LG Polymers: సరిగ్గా ఏడాది క్రితం ఆ కుటుంబాలను ఉక్కిరి బిక్కిరి చేసింది.. విష వాయువుల సుడిలో చిక్కుకుని గాలిలో కలిసిన 15 మంది ప్రాణాలు

ఒక విషాదం ఏడాదిగా కొన్ని వందల కుటుంబాలను వెంటాడుతోంది. ఏడాది కాలంగా నిద్రకు దూరం చేస్తోంది. సరిగ్గా సంవత్సరం కిందట పీల్చిన విష వాయువు... వాళ్ల జీవితాలను కకావికల్ని చేసింది.

LG Polymers: సరిగ్గా ఏడాది క్రితం ఆ కుటుంబాలను ఉక్కిరి బిక్కిరి చేసింది.. విష వాయువుల సుడిలో చిక్కుకుని గాలిలో కలిసిన 15 మంది ప్రాణాలు
Visakhapatnam Lg Polymers Gas Leak
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 03, 2021 | 4:42 PM

LG Polymers Gas Leak: ఒక విషాదం ఏడాదిగా కొన్ని వందల కుటుంబాలను వెంటాడుతోంది. ఏడాది కాలంగా నిద్రకు దూరం చేస్తోంది. సరిగ్గా సంవత్సరం కిందట పీల్చిన విష వాయువు… వాళ్ల జీవితాలను కకావికల్ని చేసింది. చూడడానికి మాములుగా కనిపిస్తారే కానీ కదిలిస్తే కన్నీటి గాథలే. వంటి నిండా విషవాయువులే. ఏడాది క్రితం విశాఖపట్నంలోని ఎల్ జీ పాలిమర్స్‌లో స్టెరైన్ విషవాయువు లీకై చిన్నాభిన్నం చేసిన జీవితాల్ని టీవీ9 పలకరించే ప్రయత్నం చేసింది.

ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటన విశాఖ ప్రజల జీవితాల్లో పీడకలగా మిగిలిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం, మే 7 వతేదీ తెల్లవారుఘామున ఆర్ ఆర్ వెంకటాపురం, వెంకటాద్రి నగర్, పద్మనాభనగర్‌, జనతాకాలనీ గ్రామస్తులకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయింది. లేచి చూస్తే దట్టమైన పొగలా కమ్మిన వాయువు. ఊపిరి ఆగి, చర్మం మండి పరుగులు తీసి 12 మంది ప్రాణాలు పోగొట్టుకుంటే, 500 మంది క్షతగాత్రులయ్యారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఉక్కిరి బిక్కిరి చేసిన విషవాయువుతో ఈ తర్వాత మరో ముగ్గురు చనిపోగా, ఇంకా శాశ్వతంగా అనారోగ్యానికి గురైనవాళ్లు వందల మంది. ఊరు వదిలి వెళ్లిన వారు ఇంకేందరో…

నాటి భయానక పరిస్థితులు ఇప్పటికీ వెంకటాపురం, వెంకటాద్రిగార్డెన్‌, పద్మనాభనగర్‌, జనతాకాలనీ వాసుల కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి.. నగరంలోని ఇతర ప్రాంతాలకు స్టైరీన్‌ విషవాయువు వ్యాపించి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. నగరవాసులకు మూడు రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా చేసింది. స్టైరీన్‌ ట్యాంకు పేలిపోతుందనే వదంతులతో అడవివరం, వేపగుంట, పెందుర్తి, చినముషిడివాడ, సుజాతనగర్‌ తదితర ప్రాంతాల వాసులు ఇళ్లు వదలి రోడ్లపైకి వచ్చేశారు. రాత్రంతా రోడ్లపై బిక్కుబిక్కుమంటూ తిరిగారు. నాటి విషాద ఘటనకు ఈనెల ఏడో తేదీకి ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఈ దుర్ఘటన లో పదేళ్ల బాలిక గ్రీష్మ ని కోల్పోయిన ఆమె తల్లి లత ఇంకా తలచుకుని, తలచుకుని ఏడవని రోజు లేదు. ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకుదంటోంది.

స్టైరీన్‌ ఆవిర్లు లీకైన ట్యాంకు సమీపంలో ఉన్న వెంకటాపురం, వెంకటాద్రినగర్‌ గ్రామాల్లోని ప్రజలు అధిక శాతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్థానికులను ఎవరిని కదిపినా కన్నీటి సుడులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, 50 ఏళ్ల పైబడిన వాళ్లు తరచూ అలసటకు గురై నీరస పడిపోతున్నారు. ‘ప్రమాదం జరగక ముందు ఎన్ని గంటలైనా పనులు చేసేవాళ్లం.. ఇప్పుడు రెండు గంటలైనా శ్రమించలేకపోతున్నాం. గుండెల్లో బరువుగా అనిపించడంతోపాటు కాళ్లూ, చేతులు పీకడం, మోకాళ్లు పట్టేస్తున్నాయి. మహిళల్లో ఆయాసం, తలనొప్పి, అజీర్తి సమస్యలు వస్తున్నాయి. కొద్దిమంది యువతలో ఆయాసం, త్వరగా అలసిపోవడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయ’ని బాధితులు వాపోతున్నారు. విషవాయువు వల్ల జీవితాంతం అనారోగ్య సమస్యలు వస్తాయని, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ కట్టిస్తామని హామీ ఇచ్చారని కానీ అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వైద్యశాలలో ధర్మామీటర్ కూడా లేదంటున్నారు బాధితులు.

ప్రమాదం జరిగిన ఏడాది అవుతున్నా ఆయాసం తగ్గడం లేదు. నీరసంగా ఉంటోంది. విషవాయువు పీల్చిన నెల రోజుల వరకు ఆరోగ్యం బాగోలేదు. తలకు గాయమై పడిపోవడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. స్టైరీన్‌ గ్యాస్‌ శరీరానికి పట్టేయడంతో చర్మమంతా పొలుసుల్లా ఊడిపోయింది. రాత్రి నిద్ర సమయంలో గురక, గుండెల్లో భారం వంటి లక్షణాలు బాధిస్తున్నాయి. 30 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో బాధపడాల్సి వస్తోంది అన్నది యువత ఆందోళన. ఆ ఘటనకు ప్రత్యక్ష సాక్షులతో టీవీ9 మాట్లాడినప్పుడు వాళ్లు ఆవేదన ఇది. ఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత విష వాయువు ప్రభావంతో కొంతమంది మరణిస్తే ఇప్పటికీ నష్ట పరిహారం ఇవ్వలేదన్నది బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలావుంటే, ఈ దుర్ఘటన తరువాత పర్యావరణ పరంగా, భూగర్భంలో చోటు చేసుకున్న మార్పులపై ఎటువంటి పరీక్షలు చేయలేదని స్థానికులు అంటున్నారు. తాగే నీరు కూడా కలిషితమైందంటున్నారు. మా సమస్యలు తీర్చాలని, ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

Read Also…. CM YS Jagan: కోవిడ్‌ పేషెంట్లకు పూర్తి ఉచిత వైద్య సేవలు.. అసవరమైన బెడ్లను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం