Lakshmi Aparna : నెట్టింట లక్ష్మీ అపర్ణ పోలీసులపై నిరసన హల్చల్.. పోలీసులు అసభ్యంగా ప్రవర్తించలేదంటూ ఏసీపీ వివరణ

లక్ష్మీ అపర్ణ పోలీసులను నడిరోడ్డుపైనే నిలదీసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విశాఖ తూర్పు ఏసీపీ..

Lakshmi Aparna : నెట్టింట లక్ష్మీ అపర్ణ పోలీసులపై నిరసన హల్చల్.. పోలీసులు అసభ్యంగా ప్రవర్తించలేదంటూ ఏసీపీ వివరణ
Visaka Acp Press Meet
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 06, 2021 | 7:44 PM

Lakshmi Aparna agitation on road against police action : కర్ఫ్యూ సమయంలో బయట తిరిగేందుకు అనుమతి ఉన్న తన వాహనానికి అపరాధ రుసుం విధించారంటూ నిన్న రాత్రి విశాఖ నగరానికి చెందిన ఓ యువతి నిరసన తెలిపిన ఉదంతంపై ఏసీపీ మీడియా ముందుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు లక్ష్మీ అపర్ణ పోలీసులను నడిరోడ్డుపైనే నిలదీసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత్‌ చంద్ర ఆదివారం మీడియాకు వెల్లడించారు. విశాఖలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో టైపిస్టుగా పనిచేస్తున్న లక్ష్మీఅపర్ణ నిన్న రాత్రి పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తుందనే తమ సిబ్బంది పోలీసు స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారని వివరించారు. యువతిపై పోలీసులు ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. నిన్న రాత్రి ఆమెను స్టేషన్‌లో ఉంచలేదని, నోటీసు ఇచ్చి పంపించి వేశామని తెలిపారు. ఎవరి మాటలూ పట్టించుకోకుండా ఎస్‌ఐపై .. లక్ష్మీ అపర్ణ కేకలు వేసిందని మహిళా కానిస్టేబుళ్లు మీడియాకు తెలిపారు.

పూర్వాపరాల్లోకి వెళ్తే.. విశాఖలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో టైపిస్ట్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అపర్ణ ఉదయం ఆటోలో ఆసుపత్రికి వెళ్తున్నారు. సాయంత్రం కర్ఫ్యూ కారణంగా వాహనాలు తిరగనందున ఆమె సోదరుడు లేదా స్నేహితుడు వచ్చి ఇంటికి తీసుకెళ్తుంటారు. కర్ఫ్యూ సమయంలో ప్రయాణించడానికి అవసరమైన పత్రాలన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. శనివారం ఆమెను తీసుకెళ్లడానికి స్నేహితుడు వస్తున్న సమయంలో ఆ పత్రాలు లేకపోవడంతో మూడో పట్టణ పోలీసులు ఆమె ద్విచక్రవాహనాన్ని ఫొటో తీశారు. వాహనానికి అపరాధరుసుం విధించినట్లు ఆమె సెల్‌ఫోన్‌కు సందేశం రావడంతో.. ఇంటికి వెళ్తున్న అపర్ణ వెనక్కివచ్చి పోలీసులను నిలదీశారు.

తనకు అనుమతి ఉన్నప్పుడు తన వాహనంపై ఎలా అపరాధరుసుం విధిస్తారని వాగ్వాదానికి దిగారు. వాదన పెద్దదవడంతో ఆమె వాహనాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. వీలుపడకపోవడంతో అపర్ణ సెల్‌ఫోన్‌ లాక్కొన్నారు. దీంతో ఆమె తిరగబడటం, మహిళా పోలీసులు నిలువరించడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. పోలీసులు ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించడానికి ప్రయత్నించారు. తాను తప్పు చేయనప్పుడు ఎందుకు రావాలంటూ ఆమె నేలపై పడుకుని వారిని ప్రతిఘటించారు.

ఆమెకు మద్యం పరీక్షలు చేయించాలంటూ సీఐ అప్పారావు పేర్కొనడంతో ‘మీరే మద్యం తాగారేమో! పని లేకుండా రోడ్డుపై తిరిగేవాళ్లను వదిలేసి మమ్మల్ని పట్టుకుంటారేంటి?’ అంటూ అపర్ణ మండిపడ్డారు. అవసరమైతే తాను కూడా మద్యం పరీక్షలు చేయించుకుంటానంటూ సీఐ అప్పారావు పేర్కొన్నారు. ప్రతిరోజూ తన వాహనానికి జరిమానా విధిస్తే జీతమంతా అవి చెల్లించడానికే సరిపోతుందంటూ అపర్ణ కన్నీరుమున్నీరయ్యారు. మహిళా పోలీసులతో ఆమె తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ఈ దృశ్యాలన్నీ శనివారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. దీంతో అసలు ఏంజరిగిందో వివరణ ఇచ్చేందుకు ఏసీపీ ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Read also :