AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: ఈ పూలతో ఇగురు పెట్టి తింటే.. అస్సలు వదలరు.. టేస్ట్ అద్భుతం.. పోషకాలు అమోఘం

విశాఖ మన్యంలో కంచెడి పూలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ సీజన్లో ఏజెన్సీలో విరివిగా దొరికే కంచేడి పూలను సేకరించే పనిలో ఉంటారు గిరిజనులు. మార్చి నెలలో ప్రతియేటా ఈ పూలకు భలే గిరాకీ ఉంటుంది.

AP: ఈ పూలతో ఇగురు పెట్టి తింటే.. అస్సలు వదలరు.. టేస్ట్ అద్భుతం.. పోషకాలు అమోఘం
Kanchadi Flowers
Ram Naramaneni
|

Updated on: Mar 26, 2022 | 1:40 PM

Share

Vizag: ప్రకృతి అందాల సమాహారం విశాఖ మన్యం. ఎన్నో వింతలు విశేషాలతో పాటు గిరిజన సంప్రదాయం అందరినీ కట్టిపడేస్తుంది. గిరిజన ఆచార వ్యవహారాలతో పాటు నోరూరించే వంటకాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఈ కోవకే చెందుతుంది కంచెడి పూల ఇగురు కూర..! అదేంటి.. పూలతో కూర ఏంటి అని అనుకుంటున్నారా..? అయితే ఈ సీజన్లో ప్రత్యేకమైన ఆ ఫ్లవర్ కర్రీ విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదండి. విశాఖ మన్యంలో కంచెడి పూలకు(Kanchadi flowers) విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ సీజన్లో ఏజెన్సీలో విరివిగా దొరికే కంచేడి పూలను సేకరించే పనిలో ఉంటారు గిరిజనులు. మార్చి నెలలో ప్రతియేటా ఈ పూలకు భలే గిరాకీ ఉంటుంది. ఇష్టపడి మరీ గిరిజనులంతా దీన్ని సేకరించేందుకు పోటీపడతారు. తెలుపు, లేత వంగ రంగుల్లో ఉండే ఈ పూల చెట్లు అడవి మెట్ట ప్రాంతాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా గిరిజన గ్రామాల్లో విస్తరించి ఉన్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఏప్రిల్ వరకు ఈ చెట్లకు విరివిగా పూలు పూస్తాయి. గిరిజనుల(Vizag Tribals) అందరినీ ఆకర్షిస్తాయి. దీంతో ఈ సీజన్ వచ్చిందంటే చాలు గిరిజనులంతా పూలను సేకరించేందుకు పోటీ పడతారు. తెలుపు, లేత వంగ రంగులో ఉన్న పూలను ఇంటికి తీసుకొచ్చి ఇగురు కూరను వండడం ఆనవాయితీ. అంతేకాదు ఆ కూరను ఇంటిల్లిపాది ఇష్టంగా ఆరగిస్తారు. లొట్టలు వేసుకుని మరి ఆహా ఏమి రుచి అంటూ తింటారు.

ఈ పూలతో మరిన్ని వంటకాలు

కేవలం ఇగురు మాత్రమే కాదు.. ఈ పూలతో వేపుడు కూర కూడా భలే పసందుగా వండుతారు తింటారు. అంతే కాదు.. పూల నిల్వ ఉండే వెరైటీ డిష్ లను కూడా తయారు చేస్తుంటారు కొంత మంది గిరిజనులు. కొంతమంది వరుగులు గా తయారు చేసి నిల్వ ఉంచుకుంటారు. ఎప్పుడైనా పూల కూర చేసుకుందాం అనుకుంటే.. వరుగులను నానబెట్టి కూర ను వండుకుంటారు గిరిజనులు.

Kanchedi

పుష్కలంగా పోషకాలు..

పోషకాలు పుష్కలంగా ఉండే ఈ కంచెడి పూలు.. కేవలం వంటకంగా మాత్రమే కాకుండా దివ్య ఔషధంగా కూడా భావిస్తారు గిరిజనులు. రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని నమ్ముతుంటారు. అంతేకాదు.. పిల్లల్లో రక్తహీనత నివారణ తో పాటు.. మహిళల్లో ఉండే పలు అనారోగ్య సమస్యలకు కూడా కంచెడి పూలు బాగా పనిచేస్తాయి అన్నది కూడా గిరిజనుల నమ్మకం.. విశ్వాసం. అందుకే ఏ గిరిజన గ్రామంలో చూసినా ఈ కంచెడి పూల కూర గుమగుమ లే కనిపిస్తాయని అంటున్నారు గిరిజనులు.

పూర్వ కాలం నుంచి గిరిజన గుడేల్లో కంచెడి కూర వంటకాలు వండి ఇష్టంగా తింటుంటారు. అంతేకాదు.. ఈ పూలను సేకరించి సంతలలో అమ్ముతుంటారు. వాటిని కూడా ఈ సీజన్లో భలే గిరాకీ ఉంటుంది. గిరిజనుల వంటకాలను చూసి మైదాన ప్రాంత వాసులు కూడా ఈ పూలను కొనుక్కొని తీసుకెళ్తుంటారు. పూల సీజన్ తర్వాత.. లేత కాయలను కూడా గిరిజనులు ఇష్టంగా తింటారు. ఇదండీ ఈ సీజన్లో గిరిజనుల స్పెషల్ డిష్ కంచేడి పువ్వుల కూర. అవకాశం ఉంటే మీరు అలా ఏజెన్సీ కి వెళ్లి ఈ పూల కూర ఇగురు టేస్ట్ ను ఆస్వాదించండి.

Kanchedi

ఖాజా, టీవీ9 తెలుగు, వైజాగ్

Also Read: RRR day 1 box office collection: తొక్కుకుంటూ పోతున్నారు.. కలెక్షన్ల ఊచకోత.. ప్రేక్షకుల బ్రహ్మరథం