డబుల్ ట్రబుల్స్‌తో సర్కార్ సంకల్పానికి తూట్లు..

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ నివాస గృహాలు లబ్ధిదారులకు తీరని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ చేతివాటంతో సర్కార్ సకల్పానికి తూట్లు పెడుతున్నారు.

డబుల్ ట్రబుల్స్‌తో సర్కార్ సంకల్పానికి తూట్లు..
Follow us

|

Updated on: Oct 11, 2020 | 2:05 PM

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ నివాస గృహాలు లబ్ధిదారులకు తీరని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ చేతివాటంతో సర్కార్ సకల్పానికి తూట్లు పెడుతున్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా తూతూ మంత్రంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు తీరని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వర్షాకాలంలో వారి బాధలు పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ఇల్లు లేని వారు తమకు కేసీఆర్ పుణ్యమా అంటూ ఇల్లు వచ్చాయని ఆనంద పడాల లేక సరైన బేస్ మట్టం లేని ఇళ్లను చూసి బాధ పడాలా అంటూ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షాలకు ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మధ్య వర్షపు నీరు చేరింది. రామన్నపాలెం చెరువు పక్కనే 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రెండేళ్ల క్రితం నిర్మించారు. ఏడాది క్రితం లబ్దిదారులకు పంపిణీ చేశారు. కొద్దిపాటి వర్షానికి కూడా ప్రతిసారి ఇండ్ల మధ్య నీరు చేరుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ఎప్పుడు ఇండ్ల లోకి నీరు వస్తుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పంచాయితీ సిబ్బంది ఆ సమయంలో మైకు ద్వారా అనౌన్స్ మెంట్ చేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారని చెప్పారు. ఇళ్లలోకి పాములు వస్తున్నాయని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. వర్షం కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పక్కనే చెరువు ఉండటంతో తమ ఇల్లు జలమయం అవుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి ప్రతిష్టాత్మకంగా హంగు ఆర్బాటాలతో ప్రవేశపెట్టిన పథకం నేడు ఎర్రుపాలెం మండల పరిధిలోని రామన్నపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఇరవై డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిన సంగతి విధితమే. ఇల్లు నిర్మాణానికి కావలసిన స్థల సేకరణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఇళ్ల నిర్మాణానికి చెరువులో స్థలాన్ని కేటాయించడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు వాగులు ఇండ్ల మధ్యలో చెరువులను తలపిస్తున్నాయి. వర్షం కురవడంతో ఇళ్లలోకి నీరు చేరడం వలన భయాందోళన తో పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

కరెంట్ పోతే పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వాపోతున్నారు. చెరువు లో ఇల్లు ఏర్పాటు చేయడం పునాది ఎత్తు కట్టకపోవడం అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన నీళ్లలో దుర్భరమైన పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్థల సేకరణలో కానీ, ఇళ్ల నిర్మాణంలో కానీ అలసత్వం వహించడం ఒక కారణం కాగా, కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తన ఇష్టానుసారం ఇళ్లను నిర్మించి దోచుకోవటానికి అవకాశం కల్పించారని విమర్శించారు. ఎవరైనా ఇల్లు నిర్మించేవారు రోడ్డు కంటే పునాదిని ఎత్తు లేపుకుంటారని రోడ్డు కంటే దిగువన కట్టడం వలన ఈ పరిస్థితి దాపురించిందని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇళ్లల్లోకి నీరు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.