Andhra Pradesh: శుక్రవారం సీఎం జగన్ విశాఖ పర్యటన.. వైఎస్ఆర్ వాహన మిత్ర నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు (శుక్రవారం) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించి.. నాలుగో ఏడాది ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్నారు. దాదాపు 2.60లక్షల మంది....
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు (శుక్రవారం) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించి.. నాలుగో ఏడాది ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్నారు. దాదాపు 2.60లక్షల మంది లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున 261.52 కోట్ల ఆర్థిక సహాయాన్ని మీట నొక్కి జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.1,026 కోట్లు అందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్ రేపు ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరనున్నారు. 10.30 గంటలకు విశాఖ చేరుకుని.. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో వైఎస్ఆర్ వాహన మిత్ర లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు వైజాగ్ ఎయిర్‌పోర్ట్ నుంచి తాడేపల్లికి బయలుదేరనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఏయూ కాలేజీ గ్రౌండ్స్ లో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఈ పథకం లబ్ధిదారులు తమ వాహనం పక్కనే ఫొటో దిగి.. గ్రామ, వార్డు సచివాలయంలో అప్‌లోడ్ చేయాలి. కొత్తగా వాహనం కొనుగోలు చేసిన డ్రైవర్లు తమ ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, భూమి వివరాలు, ఆదాయ పన్ను, కరెంట్ వివరాలు, కులం వంటి వాటిని అర్హత పత్రాలతో జత చేసి అప్లై చేసుకోవాలి. వాటిని ఆరు అంచెల్లో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఇంటి విద్యుత్తు బిల్లు నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగిస్తున్నవారు, మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలకు పైగా ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. వేరొక పథకంలో ప్రయోజనం పొందిన వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదని అధికారులు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి