Vizag: సీపీ పేరుతో ఆఫర్ లెటర్.. జాబ్ వచ్చిందని సంబరం.. కట్ చేస్తే….
ఏకంగా.. పోలీస్ కమిషనరేట్‌లో ఉద్యోగం అనేసరికి.. ఆ నిరుద్యోగి నక్క తోక తొక్కా అనుకున్నట్లు భావించాడు. మరో మారు ఆలోచించకుండా... వెంటనే అప్లయ్ చేశాడు. వెంటనే ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. ఆ తర్వాత క్వార్టర్స్ కూడా కేటాయించారు. ఆ తర్వాత అసలు ట్విస్ట్...
విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం..! జాబ్ రెడీగా ఉందని ఓ నిరుద్యోగికి మెసేజ్. అప్పటికే ఉద్యోగం కోసం వేచి చూస్తున్నా ఆ నిరుద్యోగి.. కలసి వచ్చిన అదృష్టం అని భావించి ఆ నెంబర్‌కు కాల్ చేశాడు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే .. ఆఫర్ లెటర్ వస్తుందని అటువైపు నుంచి వెర్షన్. కొంత డబ్బు చెల్లించే సరికి.. సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ పేరుతో ఒక ఆఫర్ లెటర్ మెయిల్ ఐడికి వచ్చింది. వెంటనే ఉద్యోగంలో చేరాలి.. పోలీస్ క్వార్టర్స్‌లో ఉండేందుకు అడ్వాన్స్ చెల్లించాలని మరికొంత వసూలు చేశారు. ఆ తర్వాత ఆ ఆఫర్ లెటర్ పట్టుకొని వెళ్లి పోలీస్ కమిషనరేట్‌లో ఆరా తీస్తే… అసలు విషయం బయటపడింది. కేవలం ఆ నిరుద్యోగే కాదు.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా అవాక్కయ్యారు..
విశాఖ పోలీసులకే జలక్ ఇచ్చేలా చేశాడు ఓ యువకుడు. ఏకంగా పోలీస్ కమిషనరేట్‌లో ఉద్యోగం అంటూ నమ్మించాడు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఉందంటూ ప్రకటన చేసి.. లైన్ లోకి వచ్చిన వారిని ట్రాప్ చేసి ఉచ్చులోకి దింపాడు. నకిలీ ఆఫర్ లెటర్ తయారు చేసి ఏకంగా సీపీ పేరుతో నకిలీ సంతకంతో మెయిల్ పంపించాడు. దఫదఫాలుగా డబ్బు వసూలు చేసాడు. ఆఫర్ లెటర్ పట్టుకొని సిపి కార్యాలయానికి వెళ్లి వాకబు చేశాడు బాధితుడు. దీంతో అక్కడ ఆ ఉద్యోగం లేకపోవడం సరి కదా.. ఆఫర్ లెటర్ కూడా నకిలీదని తేలింది. తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు శ్రీకాకుళం జిల్లా జద్యాడకు చెందిన మోహనరావుగా గుర్తించారు. నకిలీ ఈమెయిల్ ద్వారా నిరుద్యోగులకు మోహనరావు వలవేసి వసూళ్లకు పాల్పడినట్టు తేల్చారు. డిగ్రీ డిస్ కంటిన్యూ చేసిన నిందితుడు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మోసాలు ప్రారంభించినట్టు గుర్తించామని సైబర్ క్రైమ్ సీఏ భవాని ప్రసాద్ తెలిపారు. ఏకంగా పోలీస్ కమిషనరేట్ లోనే ఉద్యోగం అని మోసం చేయడంతో ఇప్పుడు పోలీసు అధికారులే అవాక్కయ్యారు. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీస్ అధికారులు.. డబ్బుల కోసం ఉద్యోగం అని చెబితే నమ్మొద్దని.. వెంటనే తమకు సమాచారం అందించాలని అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..