Vizag: బీచ్ రోడ్డులో ఎక్స్‌ట్రాలు చేస్తే తోలు తీస్తాం.. ఆకతాయులకు వైజాగ్ పోలీసుల డైరెక్ట్ వార్నింగ్
న్యూఇయర్ వేడుకలకు స్టీల్ సిటీ సిద్ధమైంది. నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిదని పోలీసులు సూచించారు.నిబంధనలు అతిక్రమించి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీపీ.

నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైన హద్దుమీరి ప్రవర్తించినా, ఇతరులకు ఇబ్బంది కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వైజాగ్ సీపీ శ్రీకాంత్. శనివారం రాత్రి తొమ్మిది నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు విశాఖనగరం పూర్తిగా పోలీసుల ఆధ్వర్యంలోనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సమయంలో పార్క్ హోటల్ జంక్షన్ నుంచి బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం మధ్య ఎలాంటి వాహనాలను అనుమతించబోమని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల కోసం బీచ్ రోడ్డుకు వచ్చే సందర్శకుల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించనున్నట్లు వివరించారు.
బీచ్ రోడ్‌లోనూ ప్రత్యేక ఆంక్షలు ఉండనున్నాయి. శుభాకాంక్షలతో వేధించడం, ఈవ్ టీజింగ్ చేయడం, అసభ్యకరంగా వ్వవహరించడం, దురుసుగా ప్రవర్తించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకోవల్సి వస్తుందని హెచ్చరించారు సీపీ. డ్రోన్ కెమెరాలతో బీచ్‌లో పర్సనల్‌గా నిఘా పెట్టడంమే కాకుండా… ఆకతాయిల ఆట కట్టించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు. సందర్శకులు రాత్రి సమయంలో సముద్ర స్నానానికి దిగకూడదని సూచించారు సీపీ. ఫైర్ క్రాకర్స్‌ను బీచ్‌లో కాల్చకూడదని సూచనలు జారీ చేశారు. డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి మద్యం తాగి వాహనాలు నడపడంపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ వీధి రేసుల్లో పాల్గొనే వాహనదారులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. మైనర్‌లకు లేదా పిల్లలకు తమ ద్విచక్ర వాహనాలను ఇస్తే కేసులు తప్పవన్నారు. అదే సమయంలో బీచ్ రోడ్‌లో 31 నైట్ వాహన రాకపోకలకు అనుమతి లేదని చెప్పారు సీపీ శ్రీకాంత్.
అటు విజయవాడలో కూడా నూతన సంవత్సరం సందర్భంగా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నగరపోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా హెచ్చరించారు. ఏలూరు,బందరు, బీఆర్‌టీఎస్ రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని ఆయన స్పష్టం చేశారు. నగరంలో ఫ్లైఓవర్లను మూసి వేస్తామని ఆయన చెప్పారు. క్లబ్బులు, రెస్టారెంట్లు పోలీసు ఎక్సైజ్ శాఖల నుంచి అనుమతి పొంది న్యూ ఇయర్ వేడుకులు నిర్వహించుకోవాలని సూచించారు. బహిరంగంగా కాకుండ ఇళ్ళలో మాత్రమే వేడుకలు నిర్వహించుకోవాలని సీపీ కాంతీ రాణా టాటా సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి