గ్రామాల్లో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు.. నిధుల విడుదలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు
పట్టణాల తరహాలో గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసే బృహత్తర కార్యానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Andhra Pradesh Villages: పట్టణాల తరహాలో గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసే బృహత్తర కార్యానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో దానికి సంబంధించి రూ.4,800.59 కోట్ల నిధుల కోసం ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 91,40,605 ఇళ్లు ఉండగా.. అందులో 33,88,160 ఇళ్లకు ఇప్పటికే కుళాయి కనెక్షన్లు ఉన్నట్టు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు వెల్లడించారు. మిగిలిన 57,52,445 ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి జలజీవన మిషన్ పథకంలో భాగంగా 50శాతం నిధులను కేంద్రం రాష్ట్రానికి ఇవ్వనుంది.
ఇక తొలి దశలో రాష్ట్రంలో 32 లక్షల ఇళ్లకు కుళాయిల ఏర్పాటుకు రూ.4,800.59 కోట్ల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపగా, అందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి దశలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజూ 43.5 లీటర్ల నుంచి 55 లీటర్ల మధ్య నీటి వినియోగానికి వీలుగా మంచినీటి పథకాలు నిర్మితమైన చోట కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు.
Read More: