Dubbak By-poll: ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ

ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న దుబ్బాక ఉప ఎన్నికలో తలపడే ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. బరిలో ఇద్దరు దివంగత నాయకుల...

Dubbak By-poll: ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ
Follow us
Rajesh Sharma

|

Updated on: Oct 06, 2020 | 12:35 PM

Clarity on main parties candidates: ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న దుబ్బాక ఉప ఎన్నికలో తలపడే ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. బరిలో ఇద్దరు దివంగత నాయకుల కుటుంబీకులు దిగుతున్నారు. గతంలో పోటీచేసిన అభ్యర్థే బీజేపీ తరపున మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తానికి దుబ్బాక బరిలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అనే విధంగా పోటీ పడే పరిస్థితి కనిపిస్తోంది.

అధికార టీఆర్ఎస్ పార్టీ పక్షాన దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబీకులకే టిక్కెట్ గ్యారెంటీ అన్న ప్రచారం చాలా రోజులుగా వుంది. అయితే రామలింగారెడ్డి కుటుంబీకులకు మరీ ముఖ్యంగా ఆయన తనయునికి టిక్కెట్ ఇవ్వవద్దని పలు చోట్ల టీఆర్ఎస్ శ్రేణులే తీర్మానాలు చేసిన పరిస్థితి. ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావు రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. రామలింగారెడ్డి భార్యకు టిక్కెట్ ఇస్తే ఫరవాలేదన్న స్థాయికి పరిస్థితిని మార్చారు హరీశ్ రావు. దానికి తోడు పలు చోట్ల కాంగ్రెస్, బీజేపీల నుంచి పలువురిని టీఆర్ఎస్ వైపు ఆయన ఆకర్షించారు. దాంతో తాజా పరిస్థితిని సమీక్షించిన గులాబీ దళపతి కేసీఆర్.. రామలింగారెడ్డి భార్య సుజాతకే పార్టీ టిక్కెట్ ఖరారు చేశారు.

మరోవైపు గతంలో పోటీ చేసిన రఘునందన్ రావునే బరిలోకి దింపేందుకు కమలం పార్టీ మొగ్గు చూపింది. రెండు రోజుల పాటు మేధోమధనం జరిపిన కమల దళం రఘునందన్ రావు అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది. దుబ్బాకలో ఓటర్లు బీజేపీ వైపు చూస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇక్కడ ప్రస్తావనార్హం. దుబ్బాక ప్రాంతంలో రఘునందన్ రావుకున్న పట్టుకు తోడు.. టీఆర్ఎస్ పార్టీలో వున్న అసంతృప్తవాదులను పోలరైజ్ చేయడం ద్వారా ఈసారి తప్పకుండా విజయం సాధిస్తామని రఘునందన్ రావు అనుచరగణం చెబుతోంది.

ఇక దుబ్బాకలో అధికార పార్టీని ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో వున్న కాంగ్రెస్ పార్టీ తమకున్న అన్నిరకాల అవకాశాలను వినియోగించుకునేందుకు సిద్దమవుతోంది. అయితే.. పార్టీలో ఇప్పటికే వున్న నాయకులను కాదని.. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని మరీ దుబ్బాక బరిలో నిలపాలని నిర్ణయించింది. దాంతో టిక్కెట్ ఆశించిన పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

అయితే, ఈ పరిణామాలను ముందుగానే ఊహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం.. దుబ్బాక ఉపఎన్నికకు బడానేతల బృందాన్ని డిప్యూట్ చేసింది. ఉపఎన్నికకు తానే ఇంఛార్జిగా వుండాలని నిర్ణయించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి… గల్లీకో ఇంఛార్జీ పేరిట ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో పదవులు నిర్వహించిన వారిని డిప్యూట్ చేసింది. ఇందులో వి.హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి నేతలున్నారు.

మొత్తానికి తమ సీటును తిరిగి కాపాడుకునేందుకు గులాబీ దళం ఎంతగా ప్రయత్నాలు మొదలు పెట్టిందో.. అదే స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలు కూడా తమకున్న అన్ని బలాలను మోహరించేందుకు రెడీ అవుతున్నాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దుబ్బాక ఉప ఎన్నిక రసకందాయానికి చేరుతోంది.