HPCL : విశాఖపట్నం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో భారీ అగ్నిప్రమాదం, పరుగులు తీసిన జనం
Hindustan Petroleum Corporation Limited ఫ విశాఖపట్నం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది...
Hindustan Petroleum Corporation Limited : విశాఖపట్నం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున పొగ, మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రమాదం సూచికగా ఫ్యాక్టరీలో సైరన్లు మ్రోగాయి. దీంతో ఉద్యోగులను హుటాహుటీన బయటకి పంపించివేశారు. ఉన్నఫళంగా హెచ్ పిసిఎల్ నుంచి భారీగా గా మంటలు, పొగ వస్తుండటంతో ఆ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు, ప్రమాదం సమాచారాన్ని అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. హెచ్ పి సి ఎల్ భద్రతా విభాగం రసాయినాలు ఉపయోగించి మంటల్ని అదుపు చేస్తోంది. ఇలా ఉండగా, హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో మొదట రెండు సార్లు భారీ శబ్దాలు వచ్చాయని స్పాట్ లో ఉన్న కార్మికులు చెబుతున్నారు. తాజా ఘటనతో గాజువాక, మల్కాపురం ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంధనం నిల్వ చేసే పెద్ద ట్యాంక్ పేలి ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముడి చమురు ప్రాసెస్ సమయంలో పేరుకుపోయిన కర్బన పదార్థాలు అప్పుడప్పుడూ పేలడం ఇక్కడ సర్వసాధారణం అయితే, తాజా ప్రమాదంలో మరీ ఎక్కువగా మంటలు ఎగసిపడడం వల్ల భారీ ప్రమాదమే జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
కాగా, విశాఖ హెచ్‌పీసీఎల్‌లో మూడు యూనిట్లు ఉన్నాయి. తాజా ప్రమాదం సీడీయూ మూడో యూనిట్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇది చాలా సున్నితమైన యూనిట్, అతి ఎక్కుగా మండే పదార్థాలు ఇక్కడ ఉంటాయి. దీంతో అత్యాధునిక పరికరాలతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఇక్కడ నీటితో మంటలను అదుపు చేసే వీలుండదు.. కేవలం కొన్ని రసాయనాలతో మాత్రమే మంటలను అదుపు చేయాలి. వైద్య సేవలను అందించేందుకు కొన్ని అంబులెన్స్‌లను కూడా అక్కడ సిద్ధం చేశారు. ప్రమాద సమయంలో యూనిట్‌లో ఏడుగురు సిబ్బందితో పాటు మరికొందరు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నట్లు సమాచారం. విశాఖ హెచ్ పి సిఎల్ లోని ఆరు అగ్నిమాపక శకటాలతో రసాయినాలు చల్లి మంటలను 30 నిమిషాల్లో అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం కాని, ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, కొంచెం సేపటి క్రితం ప్రమాదం గురించి HPCL అధికారిక ప్రకటన చేసింది. “హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క విశాఖ రిఫైనరీ ముడి చమురు ప్రాసెసింగ్ యూనిట్లలో మధ్యాహ్నం 3 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే భద్రతా చర్యలు, అగ్నిమాపక చర్యలు చేపట్టడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. చుట్టుపక్కల నివసించే ప్రజలకు కూడా ఎలాంటి ప్రమాదం లేదు. మిగతా రిఫైనరీ కార్యకలాపాలు సాధారణంగా జరుగుతున్నాయి.” అని సదరు ప్రకటనలో పేర్కొంది.
#JUSTIN: Major fire broke out in the newly constructed unit of Hindustan Petroleum Corporation Limited-#Visakha Refinery in #Vizag on Tuesday.
Thick smoke which was seen from a distance. Police rushed the spot and monitoring the operation. No clarity on the number of injuries pic.twitter.com/qTKJs3J60n
— Arun Kumar (@arun5paisa) May 25, 2021