Vizag: బీచ్ రోడ్‌లో బాలిక గొంతు కోసేసిన పతంగి.. చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో..
హైదరాబాద్ లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి గొంతు కోసి ప్రాణం తీసిన మాంజాదారం ఘటన మరిచిపోక ముందే.. విశాఖలో మరో మాంజా దారం ఘటన కలకలం సృష్టించింది. పండుగ పూట మరో కుటుంబంలో తీవ్ర ఆవేదన నింపింది. విశాఖ కంచరపాలం బర్మా క్యాంపు ప్రాంతానికి చెందిన

హైదరాబాద్ లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి గొంతు కోసి ప్రాణం తీసిన మాంజాదారం ఘటన మరిచిపోక ముందే.. విశాఖలో మరో మాంజా దారం ఘటన కలకలం సృష్టించింది. పండుగ పూట మరో కుటుంబంలో తీవ్ర ఆవేదన నింపింది. విశాఖ కంచరపాలం బర్మా క్యాంపు ప్రాంతానికి చెందిన శ్రీను తన ఏడేళ్ల కూతురు ప్రణతి తో కలిసి ఆర్కే బీచ్ కి వెళ్ళాడు. తండ్రితో కలిసి సరదాగా ఆర్కే బీచ్ కు వెళ్లిన ప్రణతి గంట పాటు వేర్వేరు చోట్ల గడిపింది. తండ్రి బైక్ ని డ్రైవ్ చేస్తుంటే.. ముందు కూర్చుంది ప్రణతి. ఇద్దరూ సరదాగా బీచ్ రోడ్ లో విహరిస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాళీమాత టెంపుల్ నుంచి.. పార్క్ హోటల్ జంక్షన్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో పాండురంగపురం డౌన్ లోని బీచ్ రోడ్ కు వచ్చేసరికి.. ఓ దారం బాలిక మెడకు తగిలింది. తేరుకునే లోపే మెడ కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆ చిట్టితల్లిని చూసి తండ్రి గుండెలు పట్టుకున్నాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు.
పండుగ పూట సరదాగా గడిపిన ఆ చిట్టితల్లి.. మాంజా దారంతో గాయానికి గురై ఆసుపత్రిలో చేరడం ఆ తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తుంది. ఘటనతో తీవ్ర ఆవేదనతో రోదిస్తుంది తల్లి పద్మ . పండుగ పూట ఇటువంటి కష్టం ఎవరికి రాకూడదని ఆవేదన చెందుతోంది. ఎవరో సరదా కోసం మరొకరి ప్రాణాల పైకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తోంది ఆ తల్లి. క్షణాల్లో ఘటన జరిగిపోయిందని ఆవేదన చెందుతున్నాడు తండ్రి శీను. కంటికి కనిపించని దారం తన కూతురు గొంతు కోసేసిందని తల్ల డిల్లిపోతున్నాడు. ప్రణీతకు 15 వరకు కుట్లు పడ్డాయని అంటున్నాడు తండ్రి. తన చిట్టి తల్లి త్వరగా కోలుకోవాలని కోరుతున్నాడు. మాంజా దారాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నడు తండ్రి శ్రీను.
వైద్యుల పర్యవేక్షణలో బాలిక..
విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో తండ్రితో పాటు సరదాగా బైక్ పై వెళుతూ మాంజా దారం తో తీవ్రంగా గాయపడిన ప్రణతి.. ఆసుపత్రిలో వైద్యుల పరిరక్షణలో ఉంది. Kgh IRCU లో బాలికకు చికిత్స అందిస్తున్నరు వైద్యులు. మరోవైపు గాలిపటం మాంజాదారం ఘటనలు కలవర పాటుకు గురి చేస్తున్నాయి. రెండు మూడు ఘటనలు ఆర్కే బీచ్ లోనే జరిగినట్టు చెబుతున్నారు. బాలిక గొంతు కోసిన మాంజా దారం ఘటన తెలుసుకొని అవాక్కవుతున్నరు బీచ్ సందర్శకులు. మాంజా ఘటనతో పేరెంట్స్ లో ఆందోళన మొదలైంది.
బీచ్ లో గాలిపటాల ఎగురవేతపై ఆంక్షలు..
బాలిక మాంజా దారం ఘటనతో అప్రమత్తమయ్యారు పోలీసులు. ఆర్కే బీచ్ లో గాలిపటాల అమ్మకాలను నిషేధించారు. బీచ్ లో గాలిపటాలు ఎగురవేసే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నరు పోలీసులు. ప్రమాదాల నేపథ్యంలో గాలిపటాలు ఎగరేయ వద్దని సూచిస్తున్నారు. టూరిస్టుల రద్దీ నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా సహకరించాలని కోరుతున్నరు పోలీసులు.
పేరెంట్స్ లో ఆందోళన..
పిల్లలతో సరదాగా గాలిపటాలు ఎగురవేసేందుకు ఆర్కే బీచ్కు వచ్చిన పేరెంట్స్.. బాలిక ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ పూట మన సరదాల కోసం వేరొకరి ప్రాణాలపైకి తేకూడదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాంజా దారాలను నిఘా పెంచి పూర్తిగా నిలిపివేయాలని కోరుతున్నారు ప్రణతి పెద్దమ్మ హేమలత.
పండుగ పూట సరదాగా ఉండాలి. సంబరాలు చేసుకోవాలి. ఆనందోత్సవాలతో గడపాలి. కానీ మాంజా దారలతో ఎదుటివారి ప్రాణాలకు పైకి తీసుకురావడం, మరో కుటుంబాన్ని దుఃఖంలోకి నెట్టేయడం ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








