దుర్గగుడి వెండి సింహాల చోరీ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో కీలక నిందితుడితో సహా బంగారం వ్యాపారి?
కనకదుర్గమ్మ రథం వెండి సింహాల ప్రతిమల చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పాతనేరగాడు బాలకృష్ణే చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా తేల్చినట్టు సమాచారం..
కనకదుర్గమ్మ రథం వెండి సింహాల ప్రతిమల చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పాతనేరగాడు బాలకృష్ణే చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా తేల్చినట్టు సమాచారం. సింహాల ప్రతిమలను తునిలో బంగారం వ్యాపారికి బాలకృష్ణ విక్రయించినట్టు గుర్తించారు.
దొంగతనాల కేసులో పశ్చిమగోదావరి పోలీసులకు బాలకృష్ణ పట్టుబట్టాడు. పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడించినట్టు సమాచారం. విజయవాడ నుంచి పశ్చిమగోదావరి వెళ్లిన ప్రత్యేక బృందం బాలకృష్ణను విచారిస్తున్నారు. బాలకృష్ణ ఇచ్చిన సమాచారంతో తునిలోని బంగారం వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు. కొనుగోలు చేసిన విగ్రహాలను కరిగించారా లేక ఎక్కడైనా అమ్మేశారా అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
చోరీ చేసిన మూడు వెండి సింహాల ప్రతిమల బరువు 16కిలోల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.