అన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఒకరు.. తమ్ముడు సహజీవనం చేశాడంటూ మరోకరు ఆందోళన బాట పట్టారు. వారి స్వగ్రామానికి వచ్చి మరీ నిరసనలు చేస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లికి చెందిన గుడిసెల రమేష్, వెంకటేష్ అనే ఇద్దరు అన్నదమ్ములపై ఆరోపణలు చేస్తూ ఇద్దరు మహిళలు ఆందోళన చేపట్టారు. బాధితుల కథనం ప్రకారం.. వెంకటేష్ హైదరాబాద్లోని మియాపూర్ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు అక్కడే ఉపాధి పొందుతున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇటుక రాధికను పెళ్లి చేసుకుంటానని వెంటబడ్డాడు. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో తన కొడుకును పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నానని తాను ససేమిరా అన్నారు. అయినప్పటికీ రెండేళ్ల పాటు తన చుట్టూ తిరుగుతూ ప్రేమిస్తున్నాని, తప్పకుండా పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడని రాధిక వివరించారు. చివరకు ఆమెతో సహజీవనం చేసిన వెంకటేష్ ఏడాది క్రితం కనిపించకుండా పోయాడని తెలిపారు. దీంతో బాధితురాలు ఇటుక రాధిక మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే గతంలో కూడా వెంకటేష్ వివరాలు దొరక్క గంగపల్లికి వచ్చి తన ఆవేదనను వెళ్లగక్కానని తెలిపారు. అదే సమయంలో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు తన పుట్టినింటి వారిని పిలిపించాలని పోలీసులు చెప్తే వారిని పిలిపించానన్నారు. అప్పుడు వెంకటేష్ కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని ఆ తరువాత కూడా పిలిపించినప్పటికీ తనకు న్యాయం జరగలేదని రాధిక వివరించారు. తనతో సహజీవనం చేసినప్పుడు వెంకటేష్ రూ.10 లక్షలు తీసుకున్నాడని అవి కూడా తిరిగి ఇవ్వలేదన్నారు. కర్ణాటకకు చెందిన తనకు తెలుగు రాదన్న విషయం తెలిసి ఓ పేపర్ పై తెలుగులో మ్యాటర్ రాసి తనతో సంతకాలు తీయించుకున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే తనతోనే జీవితాంతం కలిసి ఉంటానని చెప్పిన వెంకటేష్ గంగిపల్లికి వచ్చి మరో పెళ్లి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనకు దిక్కు మొక్కు లేకుండా పోయిందని తనకు న్యాయం చేయాలని కోరుతోంది బాధిత మహిళ. ప్రధానంగా తాను ఇచ్చిన రూ. 10 లక్షలకు బదులు రూ. 5 లక్షలు తిరగి ఇస్తానని, తన జీవితంలోకి రాకూడదని వెంకటేష్ చెప్తున్నాడని రాధిక వివరించారు. అయితే తాను అతనితో కలిసి జీవనం సాగిస్తాను కానీ దూరంగా మాత్రం ఉండనని తేల్చి చెబుతోంది రాధిక. శనివారం గంగిపల్లిలోని వెంకటేష్ ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న తనపై దాడికి దిగినట్టుగా రాధిక ఆరోపించారు.
ఇకపోతే వెంకటేష్ సోదరుడు రమేష్ దాదాపు పదేళ్ల క్రితం మొనే చంద్రకళ అనే యువతిని ప్రేమించాడు. కొంతకాలం కరీంనగర్లో ఇద్దరు కలిసి జీవనం కూడా సాగించారు. అయితే తాను గర్భం దాల్చే అవకాశం లేదని తెలిసి వదిలేసి మరోకరిని పెళ్లి చేసుకున్నాడని చంద్రకళ వివరించింది. దీంతో తన జీవితాన్ని అంధకారంలోకి నెట్టేశాడని.. ఇద్దరం కలిసి ఉన్నప్పుడు డబ్బులు కూడా తీసుకున్నాడని చంద్రకళ ఆరోపిస్తోంది. చివరకు తాను గంగిపల్లిలో జిరాక్స్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నానని మానకొండూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశానని వివరించింది. అయితే తాను పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ రమేష్ తన వద్దకు తరుచూ వస్తున్నాడని చంద్రకళ ఆరోపిస్తోంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని, డబ్బుల తీసుకుని మోసం చేసిన రమేష్ న్యాయం చేసే వరకు తాను కూడా ఆందోళన కొనసాగిస్తానంటూ చంద్రకళ స్పష్టం చేస్తోంది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అయితే ఇద్దరు కూడా ఇప్పటికే పోలీసు కేసులు నమోదు చేసినందున నిందితుల ఇళ్ల వద్దకు వెళ్లి నిరసనలు చేపట్టడం సరికాదని మానకొండూరు పోలీసులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..