వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన కొడాలి నాని…తిరిగి మళ్లీ గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం కొడాలి నాని విజయానికి బ్రేక్ వేయాలని చూస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి గుడివాడలో కొడాలి ని ఖచ్చితంగా ఓడించాలనే కసితో ఉన్నారు. అయితే నియోజకవర్గంలోని టీడీపీ లో ఉన్న గ్రూపులు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న రావి వెంకటేశ్వర రావు,ఎన్నారై వెని గండ్ల రాము మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. నాలుగు రోజుల క్రితం వెనిగండ్ల రాము పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ను కలిశారు. ఆ తర్వాత కొత్త ఊపుతో ఉన్నారని నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది.
తాజాగా టీడీపీ నిర్వహిస్తున్న భవిష్యత్తు కు భరోసా బస్సు యాత్ర ముగింపు రోజు వెని గండ్ల రాము కీలక వ్యాఖ్యలు చేశారు. గుడివాడ టిక్కెట్ ఎవరిదైనా అక్కడ టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయం అన్నారు. ఏది ఏమైనా పసుపు జెండా ఎగురవేసి చూపిస్తామన్నారు. తాను ఇటీవల అమెరికా వెళ్లి తానా సభల్లో పాల్గొన్నానని.. అక్కడ కూడా ఒకటే మాట వినపడిందన్నారు. ఈసారి కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని తానా సభల్లో అందరూ ఒకటే మాట అన్నారని రాము చెప్పారు.
అయితే పైకి మాత్రం సీటు ఎవరికి ఇచ్చినా టీడీపీని గెలిపిస్తామని చెబుతున్నప్పటికీ వెని గండ్ల రాము పట్ల చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని గుడివాడ టీడీపీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. పసుపు నేతలు ఎంత కసిగా ఉన్నప్పటికీ…కొడాలి నాని ని ఢీకొట్టడం అంత సులువు కాదని కూడా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..