AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rivers Link: గోదావరి -కావేరీ నదుల అనుసంధానికి ముందడుగు.. రాష్ట్రాల సూచనల మేరకే ప్రాజెక్టు డిజైన్లుః కేంద్రం

గోదావరి -కావేరీ నదుల అనుసంధానికి తొలి అడుగు పడింది. ఐదు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అన్ని రాష్ట్రాలే ఓకే అంటున్నా తమ నీటి హక్కులకు భంగం కలిగించవద్దని తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తేల్చి చెప్పాయి.

Rivers Link: గోదావరి -కావేరీ నదుల అనుసంధానికి ముందడుగు.. రాష్ట్రాల సూచనల మేరకే ప్రాజెక్టు డిజైన్లుః కేంద్రం
Godavari Kaveri Rivers Interlinking
Balaraju Goud
|

Updated on: Feb 18, 2022 | 8:51 PM

Share

Godavari -Kaveri Rivers Interlinking: గోదావరి -కావేరీ నదుల అనుసంధానికి తొలి అడుగు పడింది. ఐదు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం(Union Government) ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అన్ని రాష్ట్రాలే ఓకే అంటున్నా తమ నీటి హక్కులకు భంగం కలిగించవద్దని తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) తేల్చి చెప్పాయి. మరోవైపు, ముందు మిగులు జలాల లెక్క తేల్చాకే ముందుకు వెళ్లాలని స్పష్టం చేసింది తెలంగాణ. ఈ క్రమంలోనే గోదావరి – కావేరి నదుల అనుసంధానం అంశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, పుదుచ్ఛేరి రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, భాగస్వామ్య రాష్ట్రాల సూచనల మేరకు ప్రాజెక్టు డిజైన్లలో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.

గోదావరి – కావేరీ అనుసంధానంపై రాష్ట్రాల అభిప్రాయాల సేకరణ మొదలైంది. తొలి భేటీ ఢిల్లీలో జరిగింది. నీటి లభ్యత ఎక్కడ ఉందన్న దానిపై చర్చ జరిగింది. ఇచ్చంప‌ల్లి దగ్గర నీటి లభ్యత లేదని రెండు తెలుగు రాష్ట్రాలు స్పష్టం చేశాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ సైతం అక్కడ నీటి లభ్యత లేద‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. నీటి లభ్యతపై ముందుగా అధ్యయనం చేయాలని తెలుగు రాష్ట్రాలు డిమాండ్‌ చేశాయి. దీంతో ఇచ్చంప‌ల్లి దగ్గర నీటి లభ్యతపై స్టడీ చేస్తుంది కేంద్ర జలశక్తి శాఖ. దీని వల్ల నిర్మాణంలోని ప్రాజెక్టులు, నిర్వహణలో ఉన్న ప్రాజెక్టుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌ని ఏపీ, తెలంగాణ స్పష్టం చేశాయి. గోదావ‌రి ట్రిబ్యున‌ల్ అవార్డు ప్రకారం వాటా వినియోగం పూర్తిగా జరగాలని సూచించాయి.

న‌దుల అనుసంధానానికి అనుకూలమేనని, త‌మ రాష్ట్ర అవ‌స‌రాలు, ప్రాజెక్టులకు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌ని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. వ‌ర‌ద జ‌లాల‌నే వినియోగిస్తామన్న ప్రతిపాదన నేప‌థ్యంలో పోల‌వ‌రం నుంచి లింక్ చేయాల‌ని ప్రతిపాదించింది. పోల‌వ‌రం నుంచి తీసుకుంటే బొల్లాప‌ల్లి దగ్గర అడిష‌న‌ల్ స్టోరేజీకి అవ‌కాశం ఉంటుందని చెప్పింది. ఇదిలావుంటే, తెలంగాణ మాత్రం మిగులు జలాల లభ్యతపై మరోసారి అధ్యయనం చేయాలని తేల్చి చెప్పింది. మిగులు జలాల లెక్క తేలిన తర్వాతనే తరలింపు చేపట్టాలని స్పష్టం చేసింది. నదుల అనుసంధానానికి విముఖం కాదని, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలగకూడదని చెప్పారు అధికారులు.

అనుసంధానంతో ప్రయోజనం పొందే తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాల నుంచి పూర్తి మద్దతు వచ్చింది. తమ వాటాను తేల్చాలని కర్నాటక కోరింది. అనుసంధానంతో కర్నాటకకు పరోక్ష ప్రయోజనం కలగబోతోంది. గోదావరి మిగులు జలాలు కావేరికి చేరితే, కర్నాటక నుంచి దిగువకు విడుదల చేయాల్సిన నీటిని ఆ మేరకు నిలుపుకుని, వినియోగించుకునే అవకాశం ఆ రాష్ట్రానికి ఉంటుంది.

ఇలా నదుల సంధానంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధ‌న కోసం ప్రయత్నిస్తోంది కేంద్రం. రానున్న రోజుల్లో రాష్ట్రాలతో మ‌రిన్ని స‌మావేశాలు జరపబోతోంది. ఐదు రాష్ట్రాలు స‌హ‌క‌రిస్తే కెన్‌-బెత్వా లింక్ త‌ర‌హాలో గోదావ‌రి-కావేరికి 90 శాతం నిధులు ఇచ్చే ఆలోచ‌న‌లో ఉంది కేంద్రం. కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ కార్యదర్శి పంక‌జ్ కుమార్‌, నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ చైర్మన్‌ వెదిరె శ్రీ‌రాం నేతృత్వంలో ఈ భేటీకి జరిగింది. కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి అధికారులతోపాటు ఏపి నుంచి స్పెష‌ల్ చీఫ్ సెక్రటరీ జ‌వ‌హ‌ర్ రెడ్డి, ENC నారాయణ రెడ్డి, తెలంగాణ నుంచి ఇంజ‌నీర్లు సుబ్రహ్మణ్య ప్రసాద్, మోహన్ కుమార్ వెళ్లారు.

మరోవైపు, జాతీయస్థాయిలో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు సానుకూల దృక్పథంతో ముందుకు రావాలని జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ చెప్పారు.

ఈ సమావేశంలో 3 అంశాలపై నిర్ణయం తీసుకుంది NWDA.

  1. NWDA, CWC కలిసి రాష్ట్రాలకు జరిపిన కేటాయింపులను దృష్టిలో పెట్టుకుని నీటి లభ్యతపై స్పష్టత తీసుకురావాలి
  2. మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా అలైన్మెంట్‌ను ఖరారు చేయాలి
  3.  నీటి దౌత్య విధానాలతో మళ్లించే నీటిలో రాష్ట్రాలకు వాటాలను నిర్ణయించాలి

Read Also… Chinna Jeeyar Swamy: సీఎం కేసీఆర్‌తో సంబంధాలపై చినజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు..!