ఏపీలో గ్రామ వాలంటీర్ల కళ్లల్లో ఆనందం.. సేవలకు సత్కారాలు, నగదు ప్రోత్సాహకాలు, లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్‌

AP volunteers : కృష్ణా జిల్లా పెనమలూరులో గ్రామ వాలంటీర్ల సేవలకు సత్కారం కార్యక్రమం కొనసాగుతోంది.

  • Venkata Narayana
  • Publish Date - 11:40 am, Mon, 12 April 21
ఏపీలో గ్రామ వాలంటీర్ల కళ్లల్లో ఆనందం.. సేవలకు సత్కారాలు, నగదు ప్రోత్సాహకాలు, లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్‌
Jagan

AP volunteers : కృష్ణా జిల్లా పెనమలూరులో గ్రామ వాలంటీర్ల సేవలకు సత్కారం కార్యక్రమం కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బెస్ట్‌ వాలంటీర్లుగా ఎంపికైన వాళ్లు సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకుంటున్నారు. తొలిరోజు 13నియోజకవర్గాల పరిధిలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. సేవారత్న, సేవా వజ్ర, సేవా మిత్ర.. ఈ మూడు కేటగిరీల్లో వాలంటీర్లకు సత్కారం జరుగుతోంది. ఏప్రిల్ 28 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఉగాది పండుగ పురస్కరించుకుని వాలంటీర్లకు అవార్డుల ప్రదానం చేస్తోంది జగన్ సర్కారు. ప్రతి జిల్లాలో రోజుకొక అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున అన్ని చోట్ల సమావేశాలు నిర్వహించి ఆ నియోజకవర్గ పరిధిలో వలంటీర్లను సత్కరించనున్నారు.

ఆయా గ్రామాలు, వార్డుల్లో వలంటీర్ల పనితీరు ఆధారంగా సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో మూడు కేటగిరీల్లో సత్కరించనున్నారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నగదు బహుమతితో పాటు మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జిలను వలంటీర్లకు అందజేస్తారు. వివిధ అవార్డులకు ఎంపికైన వలంటీర్లకు నగదు ప్రోత్సాహకాన్ని సీఎం జగన్‌ సమావేశం నుంచే కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఇక, సంబంధిత నియోజకవర్గ పరిధిలో సమావేశాలు నిర్వహించిన రోజే వలంటీర్ల ఖాతాల్లో ప్రోత్సాహక బహుమతి సొమ్మును జమ చేస్తారు.

ఇక, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 2,66,092 మంది వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 2019 ఆగస్టు 15వ తేదీన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఏడాదికిపైగా సేవలందించిన వలంటీర్లను ‘సేవామిత్ర’ అవార్డుతో సత్కరించి రూ.10 వేల చొప్పున నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్‌ బహుకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,17,650 మంది వలంటీర్లను ఈ అవార్డుకు అర్హులుగా అధికారులు గుర్తించారు.

ఇక, ప్రతి నగర పాలక సంస్థ పరిధిలోని పదేసి మంది చొప్పున వలంటీర్లను ‘సేవారత్న’ అవార్డుతో సత్కరిస్తారు. రూ.20 వేల చొప్పున నగదు బహుమతితోపాటు సిల్వర్‌ మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్‌ బహుకరిస్తారు. ఈ అవార్డుకు రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మంది వలంటీర్లను అర్హులుగా గుర్తించారు. మూడో కేటగిరీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వలంటీర్లను అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున ఎంపిక చేసి ‘సేవావజ్ర’ అవార్డుతో సత్కరిస్తారు. రూ.30 వేల చొప్పున నగదు బహుమతితోపాటు గోల్డ్‌ మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జీతో సత్కరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 875 మందిని ఇందుకు ఎంపిక చేశారు.

Read also : వరంగల్‌లో మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీ, ఏబీవీపీ కార్యకర్తల అడ్డంకులు