Andhra: గూడెం దిద్దిన బడి అది.. బిడ్డల బంగారు భవిత కోసం ఏకమైన గిరిజనులు
ఏజెన్సీ ప్రాంతమైన వన్నాడలో గిరిజనులు తమ పిల్లల కోసం కళ తప్పిన బడిని అందంగా ఆధునీకరించారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా, గ్రామస్తులంతా తలో చేయి వేసి పాడుబడిన పాఠశాలను మళ్లీ జీవంతో నింపేశారు. గోడల నిండా రంగులు, బొమ్మలు.. చుట్టూ సుందర వాతావరణం.. పిల్లలు ఇప్పుడు ఆనందంగా బడివైపు పరుగులు పెడుతున్నారు

అది ఒక గిరిజన ప్రాంతం.. పిల్లలు రోజు బడికి వచ్చి బుద్ధిగా పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు.. చదువుకోడానికి వారికి ఆసక్తి ఉన్నా.. తొలుత కనీస సౌకర్యాలు లేవు. ఏజెన్సీలో కనీస వసతులు లేని పాఠశాలలు చాలానే ఉన్నాయి. శిథిలమైన స్కూల్స్ కూడా ఉన్నాయి. అటువంటి పాఠశాలల్లో పాఠాలు నేర్చుకోవడం అంటే సాహసం అనే చెప్పాలి. అటువంటి బడుల్లో ఒకటి పెదబయలు మండలం వన్నాడ బడి. ఆ ఊరి జనం బడిని అలాగే విడిచి పెట్టలేదు. తమ పిల్లలకు సరస్వతీ నిలయంగా మారిన ఆ బడిని అందంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్న ఆలోచన పక్కన పెట్టి.. చేయి చేయి కలిపారు. ఇక చెప్పేదేముంది.? ఆ బడికి వెళ్లాలంటేనే భయపడే బుజ్జాయిలంతా.. ఇప్పుడు బుడిబుడి అడుగులు వేస్తూ బడివైపు పరుగులు పెడుతున్నారు. ఎందుకో తెలుసా..? చక్కనైన బడి.. ఆ బడి గోడల నిండా ఆకట్టుకునే చిత్రాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం వారిని కట్టిపడేస్తుంది.
గతంలో ఈ బడికి 16 లక్షలు మంజూరయ్యాయి. కొంత పనులు చేసి ఆ బడి భవనాన్ని అసంపూర్తిగా వదిలేశారు అధికారులు. పిల్లలు భయం భయంతో.. కళావిహీనంగా ఉన్న తరగతి గదుల్లో చదువు సాగించేవారు. తమ పిల్లలు చదువుకునే బడి ఆ విధంగా ఉండడం గ్రామస్తులకు నచ్చలేదు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడలేదు ఆ గిరిజనులు. దీంతో అంతా ఒకచోట కూర్చున్నారు.. ఒక మాటపైకి వచ్చారు. బడిని పునర్నిర్మాణానికి గ్రామస్థులే స్వచ్చందంగా నడుం బిగించారు.
తలో చేయి వేసి.. ఆదర్శంగా నిలిచి..
వన్నాడలో 60 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళంతా ఇంటికి వెయ్యి చొప్పున 60 వేల చందాలు వసూలు చేశారు. యువత కూడా ఆ బడి భాగస్వామ్యంలో మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. 7 వేలు సమాకూర్చారు. ఉపాధ్యాయులు కూడా కొంత మొత్తం సహకారం అందించారు. గ్రామస్తులు శ్రమదానంతో పాఠశాల గట్టుపైకి మెట్లను నిర్మించారు. అంతేకాదు.. గోడలకు రంగులు వేశారు.. పిల్లలకు ఆకట్టుకునేలా బొమ్మలు వేశారు. ఇక అందరూ తలో చేయి వేయడంతో ఆదర్శవంతమైన పాఠశాల రూపుదిద్దుకుందని చెబుతున్నారు స్థానికులు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా.. తమ బిడ్డల భవిత కోసం ఇంత చేసి… ఆదర్శంగా నిలిచిన వన్నాడ గిరిజనులకు నిజంగా సలాం చేయాల్సిందే..!
