Tomato Rate Today: చికెన్, ఫిష్ రేట్లతో పోటీపడుతున్న టమాట.. ఒక్కసారిగా కుప్పకూలిన ధర.. ఇవాళ ఎంతంటే..?
గత కొన్ని రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మదనపల్లి మార్కెట్లో కిలో టమాటా ఏకంగా 130 రూపాయలు పలుకుతోంది. ఇక రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలో రేట్ల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది.
Tomato Rate Today: గత కొన్ని రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మదనపల్లి మార్కెట్లో కిలో టమాటా ఏకంగా 130 రూపాయలు పలుకుతోంది. ఇక రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలో రేట్ల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. చికెన్, చేపల ధరలతో టమాటా పోటీపడుతోంది. టామాటాను వండుకోవడం దాదాపు మర్చిపోయే పరిస్థితి నెలకొంది. అయితే, అనుహ్యంగా ఒక్కసారిగా టమాట ధర కుప్పకూలిపోయింది. పత్తికొండ మార్కెట్‌లో కిలో టమాటా 100 రూపాయలు పలికిన ధర.. ఒక్కరోజులోనే 30 రూపాయలకు పడిపోవడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పొరుగున ఉన్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ మార్కెట్‌లో నుంచి దిగుమతి అవుతు ఉండటంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు భావిస్తున్నారు.
మరోవైపు చుక్కలు చూపిస్తున్న టమాట ధర నేపథ్యంలో రంగంలోకి దిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రైతుల నుంచి నేరుగా టమాటాను కొనుగోలు చేసి, రైతు బజార్లకు తరలించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో ప్రజలకు తక్కువ ధరకే టమాటాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం ఆదేశాలతో కదిలిన అధికారులు అనంతపురం మార్కెట్ యార్డుల్లో రైతుల నుంచి కిలో 50 నుంచి 55 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. వాటిని కడప, కృష్ణా జిల్లాల్లో రైతు బజార్ల ద్వారా 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. రేషన్ పద్ధతిలో ఒక్కో వినియోగదారుడికి కిలో టమాటా చొప్పున అందిస్తున్నారు అధికారులు.
మరోవైపు, ప్రస్తుతం ప్రతి రోజూ ఏడు నుంచి 10 టన్నుల చొప్పున కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం, భవిష్యత్తులో కనీసం వంద టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్నిరోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో టామాట పంటకు భారీ నష్టం వాటిల్లింది. ఒక్క రాయలసీమ జిల్లాల్లోనే 2 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో టమాటాకు తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా ధరలు ఆకాశాన్నంటాయి. అటు టమాట, ఉల్లిపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. డిసెంబర్ నాటికి మార్కెట్లోకి టమాట నిల్వలు వస్తాయని తెలిపింది. గతేడాదితో పోల్చితే టమాట దిగుబడి తగ్గింది. ఆహార వస్తువుల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్రాలు నిధులు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది కేంద్రం.