ముగిసిన తిరుపతి ఉప ఎన్నిక.. వైసీపీ అక్రమాలకు పాల్పడిందన్న ప్రతిపక్షాలు.. ఎన్నిక రద్దుకు డిమాండ్

ముగిసిన తిరుపతి ఉప ఎన్నిక.. వైసీపీ అక్రమాలకు పాల్పడిందన్న ప్రతిపక్షాలు.. ఎన్నిక రద్దుకు డిమాండ్
Tirupati Lok Sabha By Election Polling Concludes

ఆరోపణలు, ఫిర్యాదులు, తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ.. తిరుపతి బైపోల్‌ పోలింగ్ ముగిసింది. 7గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతిచ్చారు.

Balaraju Goud

|

Apr 17, 2021 | 7:58 PM

Tirupati Lok Sabha by Election 2021: ఆరోపణలు, ఫిర్యాదులు, తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ.. తిరుపతి బైపోల్‌ పోలింగ్ ముగిసింది. 7గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతిస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్న సమాచారాన్ని బట్టి 5గంటలవరకు దాదాపు 54.99 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గపరిధిలో 79శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ముగిసేలోపు ఓటింగ్‌శాతం పెరిగే అవకాశం ఉన్నా.. గత ఎన్నికల స్థాయిలో ఉంటుందా లేదా అన్నదే డౌట్‌.

పోలింగ్‌ ప్రారంభమైనప్పటినుంచే తిరుపతి నియోజకవర్గ పరిధిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారపార్టీ భారీగా దొంగ ఓటర్లని దించిందని టీడీపీ, బీజేపీ, జనసేన ఆరోపించాయి. కొన్నిచోట్ల కొత్త వ్యక్తులను నిలదీయటంతో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. కొందరు దొంగ ఓట్లరతో పాటు.. నకిలీ ఓటర్‌ కార్డుల్ని పట్టుకున్నారు బీజేపీ, టీడీపీ నేతలు. వీటిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

తిరుపతిలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారధ్యంలో అధికారపార్టీ నేతలు బరితెగించారని ఆరోపించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. తన విద్యాభ్యాసం నుంచి తిరుపతి కేంద్రంగానే తన కార్యకలాపాలు సాగుతున్నాయన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏ అరాచకాలు జరిగాయని రీపోలింగ్‌కి డిమాండ్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే దొంగ ఓటర్లంటూ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారన్నారు పెద్దిరెడ్డి.

ఎన్నికల అధికారుల సాక్షిగా తిరుపతిలో అరాచకాలు జరిగాయన్నారు టీడీపీ ఎంపీలు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని ఆరోపించారు. కేంద్ర బలగాలతో మళ్లీ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

తిరుపతి ఎన్నికను రద్దుచేయాలన్న డిమాండ్‌పై స్పందించారు మంత్రి పెద్దిరెడ్డి. ఏం జరిగిందని రీ పోలింగ్‌ నిర్వహించాలని ప్రశ్నించారు. తిరుపతికి తానెప్పటినుంచో లోకల్‌ అన్న పెద్దిరెడ్డి.. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే విపక్ష పార్టీలు తిరుపతి ఉపఎన్నికలో గెలవడానికి డ్రామాలు ఆడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో టీడీపీ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విపక్షపార్టీల దుష్ప్రచారాన్ని నమ్మకుండా ఎన్నికల సంఘం వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. దేవుడనేవాడుంటే చంద్రబాబుని శిక్షిస్తాడన్నారు. మరోవైపు తన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.

తిరుపతి ఉపఎన్నికను తక్షణమే నిలిపివేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ డిమాండ్ చేశారు. వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం వైసీపీకి మద్దతుగా పనిచేస్తోందన్నారు. వైసీపీ ప్రభత్వం ప్రజాస్వాయ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. తిరుపతి ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు 69 ప్లటూన్ల కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంన్నారని తెలిపారు. సరిహద్దుల్లో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అనుమానితులపై నిరంతర నిఘాను ఏర్పాటు చేశామని డీజీపీ సవాంగ్ తెలిపారు. 33,966 మందిని బైండోవర్ చేశామన్నారు. 76 లక్షల నగదు, 6,884 లీటర్ల మద్యం సీజ్, 94 వాహనాలు జప్తు చేసినట్లు డీజీపీ సవాంగ్‌ పేర్కొన్నారు.

Read Also…  Delhi: ఎప్పుడూ లేని సంక్షోభంలో పడిపోయాం.. ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి..వెల్లడించిన అరవింద్ కేజ్రీవాల్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu