తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయండి.. అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నేతలపై చర్యలు తీసుకోండి.. ఈసీకి చంద్రబాబు లేఖ

తిరుపతి ఉప ఎన్నికను ఓ ప్రహసనంగా మర్చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయండి.. అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నేతలపై చర్యలు తీసుకోండి.. ఈసీకి చంద్రబాబు లేఖ
Chandrababu Naidu
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 17, 2021 | 6:31 PM

Chandrababu letter to CEC: పోలీసులు, ఎన్నికల అధికారులు, గ్రామ, వార్డు వాలంటీర్లు మొత్తంగా కుమ్మక్కైపోయి తిరుపతి ఉప ఎన్నికను ఓ ప్రహసనంగా మర్చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంత అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న ఈ ఉప ఎన్నిక ఎందుకని ప్రశ్నించారు. తిరుపతిలో స్థానికులు ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి, కేంద్ర బలగాలతో తిరిగి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఆయన లేఖ రాశారు. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో జరిగిన అక్రమాలపై తగు చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని లేఖలో పేర్కొన్నారు.

తిరుపతి ఉపఎన్నికలో స్థానికేతరులు వేల కొద్ది దొంగ ఓట్లు వేశారని.. వారిని అరికట్టడంలో పోలీసులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. తిరుపతిలో తిష్టవేసి ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న స్థానికేతరుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దొంగ ఓట్లు వేస్తున్న వారిని పట్టించిన టీడీపీ శ్రేణులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వందలాది మందిని తీసుకొచ్చి పర్యాటకులు అంటున్నారని.. అన్ని అక్రమాలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమాలకు సంబంధించిన వీడియో, ఫొటో ఆధారాలను తన లేఖతో పాటు జతచేశారు.

Read Also…