Tirupati, Nagarjuna sagar By Election 2021: నాగార్జున సాగర్, తిరుపతిలో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్

Shiva Prajapati

| Edited By: Balaraju Goud

Updated on: Apr 17, 2021 | 7:30 PM

Tirupati, Nagarjuna sagar By Poll updates: తెలుగు రాష్ట్రాల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం..

Tirupati, Nagarjuna sagar By Election 2021: నాగార్జున సాగర్, తిరుపతిలో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్
By Electons

Tirupati, Nagarjuna Sagar By Poll updates: తెలుగు రాష్ట్రాల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉపఎన్నిక పోలింగ్ కోసం అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించారు.

కాగా, తిరుపతి ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కోవిడ్‌ దృష్ట్యా పోలింగ్‌ సమయాన్ని రెండు గంటలు పెంచడంతో పాటు పోలింగ్‌ బూత్‌ల సంఖ్యను కూడా పెంచింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కోవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలున్న ఓటర్లు ఓటు వేయడానికి సాయంత్రం ఆరు గంటల నుంచి అనుమతిస్తారు. గతంలో ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్‌ బూత్‌ ఉండగా క్యూలైన్లలో ఒత్తిడిని తగ్గించడానికి ఇప్పుడు ప్రతి 1,000 మందికి ఒక పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో 28 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం నియోజకవర్గంలో 17,11,195 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఈ ఎన్నికలను అమరావతి సచివాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఎన్నికల సంఘం అధికారలు పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం అదనపు సిబ్బందిని నియమించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్‌ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించడానికి 23 కంపెనీల కేంద్ర బలగాలు, 37 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.

అలాగే, ఈ ఎన్నికలను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు పర్యవేక్షకులను నియమించింది. దినేష్‌ పాటిల్ సాధారణ అబ్జర్వర్‌గా, రాజీవ్‌కుమార్‌ పోలీసు అబ్జర్వర్‌గా, ఆనందకుమార్‌ ఎన్నికల వ్యయ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు. వీరికి అదనంగా 816 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా ఓటువేసే విధంగా ఏర్పాట్లు చేశామని విజయానంద్‌ చెప్పారు. అందరూ స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరారు.

ఇక, నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది ఈసీ. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు ఓటింగ్‌ జరుగుతుంది. నియోజకవర్గవ్యాప్తంగా 346 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,20,300 మంది. ఇందులో పురుషులు 1,09,228మంది కాగా, మహిళలు 1,11,072 మంది. ఇందుకోసం నియోజకవర్గంలో 346 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఈ పోలింగ్ కోసం 3,200 మంది సిబ్బందిని అధికార యంత్రాంగం వినియోగిస్తుంది. కోవిడ్ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ లైవ్:

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్ లైవ్:

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Apr 2021 07:08 PM (IST)

    తిరుపతిలో సాయంత్రం 5గంటలవరకు 54.99 శాతం పోలింగ్

    తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 7గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతిస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్న సమాచారాన్ని బట్టి సాయంత్రం 5గంటలవరకు దాదాపు 54.99 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గపరిధిలో 79శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ముగిసేలోపు ఓటింగ్‌శాతం పెరిగే అవకాశం ఉన్నా.. గత ఎన్నికల స్థాయిలో ఉండకపోవచ్చని ఆధికారులు అంచనా వేస్తుననారు.

  • 17 Apr 2021 07:04 PM (IST)

    సాగర్‌లో పోలింగ్ 84.32 శాతం

    నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ 84.32 శాతం మంది ఓటర్లు ఓటు వేశారని అధికారులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రజలంతా ఓట్లు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

  • 17 Apr 2021 07:00 PM (IST)

    తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలిః జనసేన పార్టీ

    తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఉన్నతాధికారులు… పోలీసులు… పోలింగ్ సిబ్బంది సహకారంతో వైసీపీ నేతలు ఆర్గనైజ్డ్ రిగ్గింగుకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని జనసేన పార్టీ ఆరోపించింది. తిరుపతి పార్లమెంట్‌తో సంబంధం లేని నియోజకవర్గాల నుంచి, పొరుగు జిల్లాల నుంచి మనుషులను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. అసలు ఓటర్లు ఓటు వేసేందుకు వీలు లేకుండా పోయిందన్నారు. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • 17 Apr 2021 05:51 PM (IST)

    నెల్లూరు జిల్లాలో ఓటింగ్ బహిష్కరణ

    నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల్లో పోలింగ్ నిలిచిపోయింది. పంచాయతీ పరిధిలో మొత్తం 2,263 ఓటర్లు ఉండగా.. ఓటు వేసేందుకు నిరాకరించారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారం చూపలేదంటూ నిరసన తెలిపారు. ఎన్నికల అధికారులు గ్రామస్తులతో చర్చించినప్పటికీ ఓటు వేసేందుకు నిరాకరించారు. విషయం తెలుసుకున్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు గ్రామానికి వచ్చి సర్ధి చెప్పేందుకు యత్నించినప్పటికీ.. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గ్రామస్తుల నినాదాలు చేశారు.

  • 17 Apr 2021 04:54 PM (IST)

    ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేదుః విజయానంద్

    తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికలో మధ్యాహ్నం 3గంటల వరకు 48.19 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు. తిరుపతి పట్టణానికి సంబంధించి వచ్చిన కొన్ని ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి,పోలీస్ అధికారులకు పంపినట్లు సీఈవో చెప్పారు. సచివాలయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

  • 17 Apr 2021 04:49 PM (IST)

    తిరుపతి ఉపఎన్నికను రద్దు చేయాలిః రత్నప్రభ

    తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ భారీగా దొంగ ఓటర్లను దించిందని టీడీపీ-బీజేపీ ఆరోపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ. దొంగ ఓట్లపై ఆమె వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నకిలీ ఐడీకార్డులతో ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. ఆధారాలతో సహా ఎన్నికల అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లామన్నారు రత్నప్రభ. ఎన్నో అక్రమాలు జరుగుతున్న తిరుపతి ఉపఎన్నికను ఎన్నికల కమిషన్‌ రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు రత్నప్రభ.

    Ratna Prabha

    Ratna Prabha

  • 17 Apr 2021 04:41 PM (IST)

    పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

    నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌ పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆయన పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.

  • 17 Apr 2021 04:39 PM (IST)

    సాగర్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్‌

    నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 69 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

  • 17 Apr 2021 04:38 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ

    పెద్దవూర మండలం పిన్నవుర గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్ 66 లో ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  • 17 Apr 2021 04:24 PM (IST)

    మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్….

    తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఇక, మధ్యాహ్నం 3గంటల వరకు నియోజకవర్గాల వారీ నమోదు అయిన పోలింగ్ శాతం ఇలా ఉంది

    సత్యవేడు నియోజకవర్గంలో 52.68 శాతం పోలింగ్‌ సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 38.1 శాతం సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 40.76 శాతం వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 35 శాతం తిరుపతి నియోజకవర్గ పరిధిలో 32.1 శాతం శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 32.9 శాతం పోలింగ్‌

  • 17 Apr 2021 03:17 PM (IST)

    టీడీపీపై ఎన్నికల సంఘానికి వైసీపీ నేతల ఫిర్యాదు

    తిరుపతి ఉపఎన్నికలో ఓటర్లను పక్కదారి పట్టించేలా తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీడీపీ నేతలపై ఏపీ సీఈవో విజయానంద్‌కు అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, తిరుపతి టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

  • 17 Apr 2021 02:58 PM (IST)

    ఓటేసిన ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి

    నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 17 Apr 2021 02:52 PM (IST)

    సాగర్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 53.3 పోలింగ్

    నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 53.3 పోలింగ్ నమోదు అయ్యినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

  • 17 Apr 2021 02:50 PM (IST)

    తిరుపతిలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.67 శాతం పోలింగ్‌

    తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.67 శాతం పోలింగ్‌ నమోదు అయ్యినట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.

    సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 38.1 శాతం గూడూరు నియోజకవర్గ పరిధిలో 36.84 శాతం సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 40.76 శాతం వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 35 శాతం తిరుపతి నియోజకవర్గ పరిధిలో 24 శాతం శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 35 శాతం సత్యవేడు నియోజకవర్గ పరిధిలో 36 శాతం

  • 17 Apr 2021 02:06 PM (IST)

    టీడీపీ, బీజేపీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం.. మంత్రి అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు..

    తిరుపతి పార్లమెంట్ ఎన్నికలో టీడీపీ, బీజేపీ డిపాజిట్లు కోల్పోతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆ భయంతో వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తోందంటూ కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. టిడిపి నాయకులు ఒడిపోతామన్న భయంతో, ఓటమిని ఒప్పుకోలేక ఇలాంటి నీచ రాజకీయలు చేస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ విషయంలో సిగ్గుండాలని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీకి ఓటు వేస్తున్నారని అన్నారు. తిరుపతి క్షేత్రానికి వస్తున్న యాత్రికులను అడుకుంటూ.. వాళ్ళని అవమానిస్తూ.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారని, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు.

  • 17 Apr 2021 02:03 PM (IST)

    మందలుగా తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారు.. సంచలన ఆరోపణలు చేసిన విష్ణువర్ధన్ రెడ్డి..

    దొంగ ఓట్లపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నాయకులు బయటి వ్యక్తులను భారీగా తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. ఇలా దొంగ ఓట్లు వేసుకొంటే వైసీపీకి లక్షల ఓట్ల మెజారిటీ ఎందుకు రాదు? అని వ్యాఖ్యానించారు. ఇలాంటి అరాచక శక్తులను ఎన్నికల కమిషన్ అడ్డుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులే ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడకపోతే ఎలా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అధికార పార్టీ నేతలను పోలీసులు ఎందుకు కస్టడీలోకి తీసుకోరని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల అధికారులందరూ చేతిలెత్తేశారని, ఇతర సిబ్బంది అధికార పార్టీకి తోత్తులుగా వ్వవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

  • 17 Apr 2021 12:30 PM (IST)

    నాగార్జున సాగర్: కొనసాగుతోన్న పోలింగ్.. ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్..

    నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు నియోజకర్గం వ్యాప్తంగా 31 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు స్వయంగా ప్రకటించారు.

  • 17 Apr 2021 12:30 PM (IST)

    లోకేష్ చేసినట్లు ఆ ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా: మంత్రి పెద్దిరెడ్డి

    తనను వీరప్పన్‌తో పోలుస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేసిన ట్వీట్‌పై మంత్రి పెద్దిరెడ్డి సీరియస్ అయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఎర్రచందనం స్మగ్లర్‌కు 2014లో టీడీపీనే సీటు ఇచ్చిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. నారా లోకేష్‌కు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. ఇతర పార్టీలో గెలిచిన వారికి పదవులు ఇచ్చింది ఎవరు? అని టీడీపీ నేతలను మంత్రి ప్రశ్నించారు. తప్పులు సరిదిద్దుకుని ప్రజల మన్నన పొందే ప్రయత్నం చేయాలి తప్ప.. ఇలా బురదజల్లే ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉండదన్నారు.

  • 17 Apr 2021 12:29 PM (IST)

    నాగార్జునసాగర్: పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్..

    నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్ నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలో పర్యటించారు. పైలాన్ కాలనీ, హిల్ కాలనీలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు శశాంక్ గోయల్. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, పోలింగ్ సరిళిని సమీక్షించారు.

  • 17 Apr 2021 12:28 PM (IST)

    ఓడిపోతామని తెలిసే దొంగ ఓట్లు అంటూ డ్రామాలు ఆడుతున్నారు.. విపక్షాలపై మండిపడ్డ పెద్దిరెడ్డి..

    తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్‌ నేపథ్యంలో వస్తున్న దొంగ ఓట్ల ఆరోపణలను మంత్రి పెద్దిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓడితామని తెలిసే విపక్ష నేతలు దొంగ ఓట్ల పేరుతో డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాబలం లేకనే దొంగ ఓట్లు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైసీపీని నేరుగా ఎదుర్కోలేక దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రమైన తిరుపతికి ఎక్కడెక్కడినుంచో భక్తులు వస్తుంటారని, బస్సుల్లో వచ్చిన ప్రయాణికులను సైతం దొంగ ఓటర్లుగా ముద్ర వేస్తున్నారని ఫైర్ అయ్యారు. విపక్ష నేతల ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని మంత్రి పెద్ది రెడ్డి తెలిపారు.

  • 17 Apr 2021 12:17 PM (IST)

    నాగార్జున సాగర్: ప్రశాంతంగా పోలింగ్.. ఓటేసిన టీడీపీ అభ్యర్థి అరుణ్ కుమార్..

    నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కోవిడ్ నిబంధనల మధ్య ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. కాగా, టీడీపీ అభ్యర్థి అరుణ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చింతగూడెంలోని పోలింగ్ బూత్‌లో అరుణ్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు.

  • 17 Apr 2021 11:50 AM (IST)

    నాగార్జునసాగర్: ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ జానారెడ్డి..

    నాగార్జున సాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాతంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తన హక్కును వినియోగించుకున్నారు. జానారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జునసాగర్‌లో ఓటు వేశారు.

  • 17 Apr 2021 11:40 AM (IST)

    తిరుపతి: ప్రతీ పోలింగ్ కేంద్రంలోనూ నకిలీ ఓటర్లు.. సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ..

    బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో నకిలీ ఓటర్లు ఉన్నారని బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి ఆరోపించారు. నకిలీ ఓట్ల విషయమై ప్రశ్నిస్తే.. ఇతర పార్టీల ఏజెంట్లను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

  • 17 Apr 2021 11:37 AM (IST)

    తిరుపతి ఉపఎన్నిక: కాసారంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం.. పోలీసులు సర్దిచెప్పడంతో..

    తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీకాళమస్తి కాసారంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. వెంటనే కల్పించుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పారు. దాంతో వివాదం సద్దుమణిగింది.

  • 17 Apr 2021 11:34 AM (IST)

    తిరుపతి ఉపఎన్నికలో విషాదం.. ఎన్నికల అధికారి హఠాన్మరణం..

    తిరుపతి ఉపఎన్నికల పోలింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. అరవపాలెంలో ఎన్నికల అధికారి హఠాన్మరణం చెందారు. పోలింగ్ బూత్‌లోనే ఎన్నికల అధికారి చెంబీటి రవి ప్రాణాలు వదిలారు. రవి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • 17 Apr 2021 11:02 AM (IST)

    తిరుపతి: ఉపఎన్నికలో దొంగ ఓట్ల కలకలం.. వేల మందిని బయటి నుంచి తీసుకువచ్చారంటూ ఆరోపణలు..

    తిరుపతిలో దొంగ ఓట్లు కలకలం సృష్టించాయి. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు బయటి నుంచి వేల మందిని తిరుపతికి తరలించారంటూ టీడీపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బస్సులు, కార్లలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు వచ్చి ఓట్లు వేస్తున్నారని ఆందోళనకు దిగారు. స్థానికులకు ఓటు వేసే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనిపై ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక లక్ష్మీపురం, కెనడీనగర్‌లో బయటి ప్రాంత వాసులు తిష్ట వేసినట్లు తెలుస్తోంది. జయనగర్, పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఇతర ప్రాంత వాసులు ఉన్నారని, అనుమానం రాకుండా వీధుల్లో ఐదుగురు చొప్పున తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

  • 17 Apr 2021 10:34 AM (IST)

    తిరుపతి: ఉదయం 9 గంటల వరకు 7.80 శాతం పోలింగ్ నమోదు..

    తిరుపతి పార్లమెంట్ నియోజకర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయించడం వల్ల పోలింగ్ ఆలస్యమైనప్పటికీ.. ఆ తరువాత సెట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల వరకు నియోజకవర్గం వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 7.80 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

  • 17 Apr 2021 10:28 AM (IST)

    నాగార్జునసాగర్: కొనసాగుతున్న పోలింగ్.. 9 గంటల సమయానికి 12.9 శాతం పోలింగ్ నమోదు..

    నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి నియోజకవర్గ వ్యాప్తంగా 12.9 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ప్రకటన విడుదల చేశారు.

    Voting Percentage

  • 17 Apr 2021 09:38 AM (IST)

    తిరుపతి: ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి..

    తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతోంది. తిరుపతి ఎంపీ పోరులో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరు జిల్లాలోని కోట మండలం వెంకన్నపాలెంలో పనబాక లక్ష్మి ఓటు వేశారు.

  • 17 Apr 2021 09:32 AM (IST)

    నాగార్జునసాగర్: సాయంత్రం 6 తరువాత కరోనా పేషెంట్లకు ఓటు వేసే అవకాశం..

    నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల తరువాత కరోనా పేషెంట్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు అధికారులు.

  • 17 Apr 2021 08:47 AM (IST)

    నాగార్జునసాగర్: ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్..

    కోవిడ్ నిబంధనల మధ్య నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా కలిసి వచ్చి హాలియాలోని ఇబ్రహీంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 17 Apr 2021 08:44 AM (IST)

    నాగార్జునసాగర్: త్రిపురారం, వట్టికోడులో మొరాయించిన ఈవీఎంలు.. పోలింగ్ ఆలస్యం..

    త్రిపురారం 265 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దాంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. గుర్రంపోడు మండలం వట్టికోడులోని 13వ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించింది. దీంతో ఇక్కడ కూడా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

  • 17 Apr 2021 08:40 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ అభ్యర్థి గురుమూర్తి.. క్యూ లైన్‌లో నిలుచుని..

    తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏర్పేడు మండలం మన్నసముద్రంలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన క్యూ లైన్‌లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    Gurumurthy

    Gurumurthy

  • 17 Apr 2021 08:36 AM (IST)

    సాంకేతిక సమస్యలు.. మొరాయిస్తున్న ఈవీఎంలు.. ఇబ్బందులు పడుతున్న ఓటర్లు..

    తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పార్లపల్లి, కొత్తపాలెం గ్రామాల్లో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దాంతో సదరు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఇక ఈవీఎంలలో సాంకేతిక సమస్యల కారణంగా కుక్కంభాకం గ్రామంలో ఇప్పటి వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు. ఫలితంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.

  • 17 Apr 2021 08:01 AM (IST)

    దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ నేతల నిరసన.. చర్యలు తీసుకోవాలని డిమాండ్..

    ఎన్నికల్లో వైసీపీ వారు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. తిరుపతి లక్ష్మీపురం చౌరస్తా వద్ద టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దొంగ ఓట్లు వేయించేందుకు బయటి వ్యక్తులను తీసుకువచ్చారని ఆరోపించారు. ఎన్నికల సంఘం, అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకురాలు సుగుణమ్మ డిమాండ్ చేశారు.

  • 17 Apr 2021 07:53 AM (IST)

    పోలింగ్ కేంద్రానికి ఒక్కొక్కరుగా తరలి వస్తున్న ఓటర్లు..

    నాగార్జున సాగర్, తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రానికి తరలి వస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల మధ్య భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Published On - Apr 17,2021 7:08 PM

Follow us