Tirumala: తిరుమలలో కేటుగాడు.. ఏకంగా సీఎం లేఖలతోనే దందా మొదలుపెట్టాడు.. కట్ చేస్తే..
తిరుమలలో VIP బ్రేక్ దర్శనం టికెట్ల అక్రమ విక్రయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పుదుచ్చేరి సీఎం లేఖను ఉపయోగించి నకిలీ టికెట్లు అమ్ముతున్న దళారిని పట్టుకున్నారు. భక్తులనుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి, తక్కువ ధర టికెట్లు ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల దుర్వినియోగం తీవ్ర వివాదాస్పదమైంది. బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకుంటున్నారని ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఇప్పటికే.. పలువురు ప్రజాప్రతినిధుల పేరిట విఐపి బ్రేక్ దర్శనం ఇప్పిస్తామని.. దళారులు భక్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.. ఇటీవల ఇదే విషయంలో ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ పై కూడా కేసు నమోదైంది.. బ్రేక్ టికెట్ల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు ఆమెపై కేసు నమోదైంది. ఈ తరుణంలోనే ఓ రాష్ట్రానికి చెందిన సీఎం పేరుతో ఏకంగా.. ఆయన లెటర్ హెడ్ తో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను అమ్మేందుకు ప్రయత్నించి ఓ దళారీ అడ్డంగా బుక్కయ్యాడు.
పాండిచ్చేరి సీఎం లేఖ ద్వారా విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్న దళారికి తిరుమల పోలీసులు అతనికి దిమ్మతిరిగేలా చెక్ పెట్టారు. పుదుచ్చేరి సీఎం లేఖ ద్వారా వీఐపీ బ్రేక్ టికెట్లను విక్రయిస్తుండగా దళారీ బద్మనాభం అలియాస్ భరత్ ను తిరుమల టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనాభం ఈ నెల 21 న నెల్లూరుకు చెందిన ఐదుగురు భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం ఇప్పిస్తానని రూ. 23 వేలు తీసుకున్నాడు.. విఐపి దర్శనం టికెట్స్ కాకుండా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇప్పించాడు. విఐపి దర్శనం టికెట్లు రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని నెల్లూరుకు చెందిన భక్తుడు విజయ్ కుమార్.. పద్మనాభంను కోరాడు..
డబ్బులు తిరిగి ఇచ్చేందుకు బద్మనాభం నిరాకరించడంతో విజయ్ కుమార్ టిటిడి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.. ఈ మేరకు భక్తుడు తిరుమల టూ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు.. దీంతో అతని స్టేట్మెంట్ ను విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శంకర్ బాబు రికార్డ్ చేశారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలాఉంటే.. బ్రేక్ దర్శనం టికెట్లు విక్రయించిన విషయంలో ఇటీవల ఏపీకి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానంపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై 6 టికెట్లు భక్తులు పొందినట్లు ఫిర్యాదు చేశారు. ఒక్కో టికెట్‌కు 10వేల రూపాయలు భక్తుల నుంచి తీసుకున్నట్లు చెప్పడంతో.. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే.. పాండిచ్చేరి సీఎం లేఖ తో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను విక్రయించడం కలకలం రేపుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..