Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ హై అలెర్ట్.. దర్శన క్యూలైన్లు తాత్కాలికంగా నిలిపివేత

తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ఏడు కొండల వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ కీలక సూచన చేసింది.

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ హై అలెర్ట్.. దర్శన క్యూలైన్లు తాత్కాలికంగా నిలిపివేత
Tirumala Queue Lines
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 08, 2022 | 6:46 PM

భక్తజనంతో కిక్కిరిసితోంది తిరుమల కొండ. భక్తులతో కిటకిటలాడిపోతుంది. శ్రీవారి దర్శనం కోసం రెండురోజులుగా భక్తులు పోటెత్తడంతో… విపరీతమైన రద్దీ ఏర్పడింది. తమిళులు పవిత్రంగా భావించే పురటాసి మాసం.. మూడో శనివారం… దానికి తోడు వరుస సెలవురోజులు…. అన్నీ కలిసి తిరుమల గిరుల్ని సందడిగా మార్చేశాయి. క్యూ లైన్లు, మాడ వీధులు, లడ్డు కౌంటర్లు, అఖిలాండం, అన్నప్రసాదం, ఉచిత సత్రాలు, కళ్యాణ కట్ట, బస్టాండ్… ఎటు చూసినా ఇసకేస్తే రాలనంత భక్తజనం. గోగర్భం వరకు దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. మరో నాలుగు రోజులు రద్దీ ఉంటుందని టీటీడీ అంచనా వేస్తుంది. శ్రీవారి దర్శనం కోసం వర్షాన్ని కూడా లెక్క చేయడం లేదు భక్తులు. రద్దీని చూసుకొని దర్శనానికి ప్లాన్‌ చేసుకోవాలని టీటీడీ సూచిస్తుంది. ఈ క్రమంలో తిరుమల భక్తులకు హైఅలెర్ట్ చేసింది టీటీడీ. దర్శన క్యూలైన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్నవారికే శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆదివారం ఉదయం తిరిగి క్యూలైన్లలోకి భక్తులను అనుమతించనున్నారు. ఈ క్రమంలోనే భక్తులను క్యూలైన్లలోకి తరలించే బస్సులు నిలిపివేశారు.

తెలుగువారికి శ్రావణమాసం ఎలాగో తమిళులకు పురటాసి మాసం అంతటి పవిత్రం. శ్రావణమాసంలో ఇక్కడ శివారాధనకు ప్రాముఖ్యతనిస్తారు. పురటాసి మాసంలో తమిళులు వైష్ణవాలయాల్లో పూజలు నిర్వహిస్తారు. అందుకే… ఈనెలలో వచ్చే ఒకటి, మూడు, ఐదో శనివారాలు ఉపవాసాలుండి… తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం తమిళుల ఆనవాయితీ. దాని పలితమే కొండపై ఈ రద్దీ. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుండి 6 కిలోమీటర్ల మేర క్యూలైన్లు నిండిపోయాయి. వైకుంఠంలోని కంపార్ట్ మెంట్లతో పాటు, నారాయణగిరిలోని 9 షెడ్లు నిండిపోయాయి. బ్రహ్మోత్సవాల త‌ర్వాత ట్రాఫిక్ ఇబ్బందులు, భ‌క్తుల రాక‌పోక‌ల క‌ష్టాల్ని గుర్తించి క్యూలైన్ రూట్లో మార్పు చేసింది టీటీడీ. గోగర్భం డ్యాం సర్కిల్ నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త క్యూ లైన్లు కూడా పురటాసి మాసం రద్దీతో కిటకిటలాడిపోతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లలో అల్పాహారం, మంచినీటిని శ్రీవారి సేవకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. అటు… సీఆర్వో ఆఫీస్ కౌంట‌ర్ క్లోజ్‌ చేయడంతో వసతి గదుల కోసం తిప్పలు పడుతున్నారు భక్తులు. కొండపై ఎక్కడ చోటు దొరికితే అక్కడ సేదదీరుతున్నారు.

కొండమీద రద్దీ కష్టాలు అలా వుంటే… వీఐపీల తాకిడి కూడా అదే స్థాయిలో ఉంది. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, ఎంపీ యంవీవీ సత్యనారాయణ, మాజీ క్రికెటర్ కేదర్ జాదవ్, నటి గౌతమి వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు నటి గౌతమి. శుక్రవారం ఒక్కరోజే శ్రీవారిని 70,007 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.25 కోట్లకు చేరింది. అటు… రోజురోజుకీ రద్దీ పెరుగుతున్న కారణంగా… తొందరపడి తిరుమల యాత్రకు రావొద్దని భక్తులకు సూచిస్తోంది టీటీడీ. పురటాసి మాసం పూర్తయ్యేదాకా ఇదే రద్దీ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..