Crime News: రెట్టింపు డబ్బు ఇస్తామని ఆశచూపారు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..
పది రూపాయిలను క్షణాల్లో రెట్టింపు చేస్తాం అంటూ ఎంతో మంది అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్న ఘటనలు ఇటీవల తరచూ చూస్తున్నాం. డబ్బుపై ఆశతో అలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి కొందరు తమ ఆస్తులను..

పది రూపాయిలను క్షణాల్లో రెట్టింపు చేస్తాం అంటూ ఎంతో మంది అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్న ఘటనలు ఇటీవల తరచూ చూస్తున్నాం. డబ్బుపై ఆశతో అలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి కొందరు తమ ఆస్తులను పొగొట్టుకుంటున్నారు. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటన ఒకటి జరగ్గా.. పోలీసులు చాకచాక్యం వ్యవహరించి.. ఆ ముఠా గుట్టు రట్టు చేశారు. రెట్టింపు డబ్బు ఇస్తామని నమ్మించి దోపిడీకి పాల్పడ్డ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్టుచేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరెడ్డి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం శివరామపురానికి చెందిన కృష్ణమూర్తి కర్ణాటక రాష్ట్రం అత్తిబెల్లికి చెందిన మంజుల, అన్నమయ్య జిల్లా రాజంపేట వాసి మురుగేష్ మరికొందరు కలిసి తెలంగాణలోని చౌటుప్పల్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి శంకర్‌కు రెట్టింపు డబ్బు ఇస్తామని నమ్మించారు. రూ.35 లక్షల నగదు ఇస్తే రూ.75 లక్షల్ని ఆన్‌లైన్‌లో పంపుతామని నమ్మించారు. శంకర్ డబ్బుతీసుకుని ముగ్గురు స్నేహితులతో తిరుపతి వచ్చారు. కృష్ణమూర్తి, మంజులలు… శంకర్‌ను జాతీయ రహదారిపైకి రప్పించారు. వారి మనుషులు తుపాకీ, కత్తులతో శంకర్‌ను బెదిరించి కళ్లలో కారంకొట్టి రూ.35 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను లాక్కెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. చంద్రగిరి కోట సమీపంలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణమూర్తి, మంజులతోపాటు వైఎస్‌ఆర్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన నాగమణి, తమిళనాడుకు చెందిన లక్ష్మికాంతం, ఎన్టీఆర్ జిల్లా కొత్తపల్లికి చెందిన వెంకటనాగరాజు, అన్నమయ్య జిల్లా చిన్నజంగంపల్లికి చెందిన సాయిచరణ్, చిత్తూరు జిల్లా విజులాపురానికి చెందిన మోహన్‌హేమంత్, కొడతపల్లిమిట్ట వాసి మహమ్మద్ జావీద్, నక్కనపల్లికి చెందిన బిల్లింటి కార్తీక్, ఒడ్డుమడికి చెందిన శీనప్పనందకుమార్, జీడిగుట్ల నివాసి గురుమూర్తిహేమంత్, రాజ్‌పేట్‌కు చెందిన షేక్‌అమీన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు మురుగేష్, రమేష్ , భాస్కర్, వినయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల నుంచి రూ.31.72 లక్షల నగదు, లైసెన్సు లేని తుపాకీ, ఐదు బుల్లెట్లు, రెండు కార్లు, రెండు కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కృష్ణమూర్తి, మంజులపై పలు కేసులు నమోదయ్యాయి. కృష్ణమూర్తి కొందరు యువకుల సహకారంతో నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు.
క్షణాల్లో డబ్బులను రెట్టింపు చేస్తామనే వారి మాటలను ఎవరూ నమ్మవద్దని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరెడ్డి ప్రజలను కోరారు. సులభంగా డబ్బు వస్తుందనే ఆశతో ఇలాంటివారు చెప్పే మాటలు విని మోసపోవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా డబ్బులను రెట్టింపు చేస్తామని చెప్పి.. డబ్బులు అడిగితే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో తెలియజేయాలని సూచించారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..