Andhra Pradesh: గంజాయి మత్తు కోసం గలీజ్ పనులు.. చివరకు ఏం జరిగిందంటే..!
Andhra Pradesh: వాళ్లంతా యువకులే.. గంజాయి మత్తుకు బానిసై నేరాలకు అలవాటు పడ్డారు. డబ్బు కోసం చిల్లర నేరాలు చేస్తూ పబ్బం గడుపుకునే వారు.
Andhra Pradesh: వాళ్లంతా యువకులే.. గంజాయి మత్తుకు బానిసై నేరాలకు అలవాటు పడ్డారు. డబ్బు కోసం చిల్లర నేరాలు చేస్తూ పబ్బం గడుపుకునే వారు. చోరీ చేసి పారిపోయే క్రమంలో ఆటోను ఎత్తుకెళ్లారు. గంజాయి మత్తులోనే ఉంటూ దారి దోపిడీ చేశారు. చేసిన పాపం ఊరికే పోతుందా.. చివరకు అడ్డంగా దొరికిపోయి కటకటాలపాలయ్యారు.
విశాఖ జిల్లాలో ఈనెల 4న జరిగిన దారిదోపిడి పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఆటో ఎక్కిన వ్యాపారిని టార్గెట్ చేసి దోచుకున్నారు దుండగులు. వ్యాపారి ఫిర్యాదు చేయడంతో ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు.. నిందితులను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. ముగ్గురుని కటకటాల వెనక్కి నెట్టారు. నిందితులను విచారించే సరికి అసలు విషయం బయటపడింది.
నర్సీపట్నం కు చెందిన రాజేష్, గాజువాక కు చెందిన నాని, శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన స్వరూప్, విశాఖ కు చెందిన కళ్యాణ్. ముగ్గురూ యువకులే..! స్నేహితులు కూడా. వీరంతా గంజాయి మత్తుకు అలవాటుపడ్డారు. నిత్యం గంజాయి మత్తు లేనిదే వారికి రోజు గడవడం లేదు. గంజాయి కొనుగోలు చేసేందుకు వీరి దగ్గర ఉన్న డబ్బులు సరిపోక నేరాల బాట పట్టారు. ఇందులో భాగంగానే ఈనెల 2న రాజేష్, నాని గాజువాక లో చోరీకి పాల్పడి పారిపోయే క్రమంలో ఆటోను తస్కరించారు. మిగతా ఇద్దరి స్నేహితులతో కలిసి చోడవరం మీదుగా రావికమతం వెళ్లారు. అక్కడ తోటలో గంజాయి తాగుతూ గడిపారు ఈ నలుగురు.
ఇదిలా ఉంటే ఈ నెల 4న నిట్టమామిడి వెళ్లేందుకు రావికమతం మండలం దొండపూడి వద్ద వేకువజామున బస్సుకోసం వేచి చూస్తున్నాడు పసుపు వ్యాపారి రాజారావు. ఈ సమయంలో ఆటో లో ఈ నలుగురు స్నేహితుడు గంజాయి మత్తులో వెళ్తున్నారు. బస్సు కోసం వేచి చూస్తున్న వ్యాపారిని చూసి పంట పండిందిలే అనుకొని ఆటో ఆపారు. ఆ వ్యాపారిని ఆటో ఎక్కించుకొని ముందుకు సాగారు. ఆటోడ్రైవర్ మిగతా ముగ్గురు ప్రయాణికుల్లా నటించారు. వ్యాపారి దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న వీరంతా.. కెఎల్ పురం వద్ద ఆటోను జీడి తోటలావైపు మళ్ళించారు. వ్యాపారి తేరుకునేలోపే మూకుమ్మడిగా దాడి చేశారు. అతని సంచిలో ఉన్న రెండు లక్షల రూపాయల నగదు, జేబులో ఉన్న మరో రూ. 1700, బంగారం ఉంగరం సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయారు. నిర్మానుష్య ప్రాంతంతో పాటు చీకటిగా ఉండటంతో అక్కడ ఎవరూ అందుబాటులో లేరు. దీంతో ఈజీగా పని పూర్తి చేసుకుని పారిపోయారు ఈ దొంగలు. వారి దగ్గర కాజేసిన డబ్బులతో ఏజెన్సీకి గంజాయి కోసం పారిపోయారు. రాజారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. అప్పటికే పలు కేసుల్లో ఉన్న రాజేష్ నర్సీపట్నం వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కొంతమంది యువకులు కనిపించారు. ఆటోఆపి విచారించే సరికి రాజారావును దారి దోపిడీ చేసిన నిందితులుగా గుర్తించారు పోలీసులు. అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి రూ. 85 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు కళ్యాణ్ పరారీలో ఉన్నాడు. అయితే వీరంతా కేవలం గంజాయి కోసమే నేరాలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో కూడా ఓ వ్యక్తిని కత్తితో పొడిచి పరారీలో ఉన్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. ముగ్గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
Also read:
Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
DSCR: ఏదైనా కంపెనీ బలం తెలుసుకోవాలంటే.. ఈ రేషియోను తప్పక చూడండి..