Andhra Pradesh: కడప గడపలో 3 మృతదేహాల మిస్టరీ వీడింది.. ఆ డెడ్‌బాడీలు ఎవరివంటే..?
గువ్వల చెరువు ఘాట్ రోడ్ లోయలో 3 మృత దేహాల మిస్టరీ వీడింది. ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కేసును సాల్వ్ చేశారు.
Kadapa District: కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్(Guvvalacheruvu Ghat Road) వద్ద ఈనెల 13న లభ్యమైన మూడు గుర్తుతెలియని మృతదేహాలకు మిస్టరీ వీడింది. స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించి.. ఈ కేసు చిక్కుముళ్లను విప్పేశారు పోలీసులు. ఫైనల్‌గా వీరు కలుషిత నీరు తాగి మృతి చెందారని ఐడెంటిఫై చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాయచోటి(Rayachoty)కి చెందిన 15 మంది కర్ణాటకలోని గుల్బర్గాకు బొగ్గులు తయారు చేసేందుకు వెళ్లారు. పని చేసే వద్ద నీళ్లు తాగేందుకు ఓ చెలిమెను తవ్వారు. ఆ చెలిమెలోకి సమీప పొలాల నుంచి కలుషిత నీరు చేరటంతో అందరూ అస్వస్థతకు గురయ్యారు. వారిని కర్ణాటకలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రులకు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. కొంతమందిని మహబూబ్‌నగర్‌లోని తరలించగా.. మిగిలిన వారిని కడపకు తరలిస్తుండగా దారిలోనే 15 సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఆ బాలికకు అక్కడే అంత్యక్రియలు చేశారు. ఆర్లగడ్డకు రాగానే.. చెంచు రామయ్య, చెంచయ్య, భారతి అనే ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని మృతుల బంధువులు తమ బంధువులకు తెలియజేయగా.. మృతదేహాలను అక్కడే ఖననం చేయాలని వ చెప్పారు.
కానీ వారు మృతదేహాలను ఖననం చేయకుండా గువ్వల చెరువు ఘాట్రోడ్లో విసిరి పడేశారు. ఈనెల 13 నుంచి అక్కడ తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు లోయలోకి దిగి గాలించగా.. మూడు గుర్తు తెలియని మృతదేహాలు బయటపడ్డాయి. డెడ్‌బాడీలను లోయలోకి పడేసే సమయంలో ఒకరి తలకు బలమైన గాయం తగిలింది. పోలీసులు ఆ గాయాన్ని చూసి హత్యగా భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. మృతుడి చొక్కాపై ఉన్న లేబుల్ ఆధారంగా వీరు రాయచోటి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను లోయలోకి పడేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..