Devil Fish: బాబోయ్ ‘దెయ్యం చేప’.. లబోదిబోమంటున్న కొల్లేరు ఆక్వా రైతులు.. ఎందుకో తెలుసా?
Kolleru Aqua Farmers: చూడ్డానికే.. భయంకరంగా ఉన్న ఈ వింత చేప.. ఇప్పుడు కొల్లేరు ఆక్వా రైతులను బెంబేలెత్తిస్తోంది. ఈ దెయ్యం చేప దెబ్బకు.. రానున్న రోజుల్లో ఆక్వా రంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతోంది.
కొల్లేరు: దెయ్యం చేప.. ఈ పేరు వింటేనే.. కొల్లేరు ఆక్వా రైతులు హడలెత్తిపోతున్నారు. స్థానికంగా దెయ్యం చేప, విమానం చేప అని పిలుస్తారు. సాంకేతిక పరిభాషలో శాస్త్రీయంగా చెప్పాలంటే దీన్ని ‘సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్’ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వన్స్ ఇది చెరువులోకి ఎంటర్ అయిందా.. ఇక అంతే…. ఈ చేప తన సంతానాన్ని తక్కువ కాలంలోనే పది రెట్లు… వంద రెట్లు పెంచేసుకుని రైతులు వేసిన మేత మొత్తాన్ని తినేస్తుంది. కేవలం మేత మాత్రమే కాదు.. ఇది మాంసాహారి కూడా…! తన కంటే చిన్నవైన ఇతర చేపల్ని సైతం మింగేస్తుంది. దీంతో లబోదిబో మంటున్నారు ఆక్వా రైతులు.
ఈ చేప కాలువల ద్వారా.. ఇప్పుడు కొల్లేరులోకి ప్రవేశించి పరివాహక ప్రాంత చెరువుల్లోకి వ్యాపించింది. ఈ చేపను చంపేందుకు ఎన్నో మందులు వాడిన ఫలితం లేకుండా పోతోంది. రైతు కొన్ని లక్షల సంఖ్యలో చేపపిల్లలను చెరువులోకి వదిలితే… దెయ్యం చేప దెబ్బకి అవి వేలల్లోనే మిగులుతున్నాయి.
ఇది చాలా మొండిది. భూమి పొరల్లోకి వెళ్లి బతుకుతుంది. ఈ చేప నీరు లేకపోయినప్పటికీ… 15 రోజులకుపైగా బతకగలదు. భూమి లోపల నుంచే గట్లను తొలచుకుని… మరో చెరువులోకి వచ్చేస్తుంది. అంతేకాదు.. ఒకవేళ వలలో చిక్కినా తన పదునైన పళ్లతో తప్పించుకుంటుంది. ఈ చేపలు మనుషులను కూడా కరిచి తీవ్రంగా గాయపరుస్తాయి.
వాస్తవానికి ఇది ఎక్వేరియం రకపు చేప. దక్షిణ అమెరికా నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయింది. ఎక్వేరియంలలో పట్టే నాచును తిని… ఆ గాజు పలకలు శుభ్రంగా కనిపించటానికి పెంచేవారు. కాని దాన్ని నిర్లక్ష్యంగా ఇళ్లు ఖాళీ చేసే సమయంలో, ఒక ఊరునుంచి మరో ఊరు వెళ్లేపుడు కాలువల్లో పడేయటంతో… ఇపుడు డ్రైనేజల నుంచి కాలువలకు, కాలువల నుంచి రిజర్వాయర్లు, చెరువులు, నదుల్లోకి వచ్చి చేరింది. దీన్ని మందులతో ఇతర మార్గాల్లోనూ… చంపటం సాధ్యం కాదంటున్నారు అధికారులు. నిర్మూలన సాధ్యం కాని ఈ దెయ్యం చేపల వల్ల ప్రతి యేటా తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల ఆదాయాన్ని రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా.. ఈ డెవిల్ ఫిష్ నిర్మూలనకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను కోరుతున్నారు ఆక్వా రైతులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..