AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిదండ్రులు ఈఎమ్ఐ కట్టలేదని మైనర్ కొడుకుని బంధించిన రికవరీ ఏజెంట్స్.. టీవీ9 చొరవతో విముక్తి

విజయనగరం జిల్లాలో ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్స్ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. సమయానికి ఈఎమ్ఐ కట్టడం లేదంటూ నిత్యం ఎక్కడో చోట దాష్టీకానికి తెగబడుతూనే ఉన్నారు. తాజాగా వేపాడ మండలం అరిగిపాలెంలో ఫైనాన్స్ రికవరీ ఏజెంట్స్ ఆగడాలు సంచలనంగా మారాయి.

తల్లిదండ్రులు ఈఎమ్ఐ కట్టలేదని మైనర్ కొడుకుని బంధించిన రికవరీ ఏజెంట్స్.. టీవీ9 చొరవతో విముక్తి
Recovery Agents
Gamidi Koteswara Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 01, 2024 | 11:17 PM

Share

విజయనగరం జిల్లాలో ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్స్ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. సమయానికి ఈఎమ్ఐ కట్టడం లేదంటూ నిత్యం ఎక్కడో చోట దాష్టీకానికి తెగబడుతూనే ఉన్నారు. తాజాగా వేపాడ మండలం అరిగిపాలెంలో ఫైనాన్స్ రికవరీ ఏజెంట్స్ ఆగడాలు సంచలనంగా మారాయి. అరిగిపాలెంకి చెందిన కాపుగంటి సన్యాసిరావు, రాజేశ్వరి దంపతులు తమ గ్రామంలో బ్రతుకుదెరువు కోసం ఒక చిన్న దుకాణం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఎస్ ఎమ్ ఎఫ్ జి గ్రామశక్తి అనే ప్రైవేట్ ఫైనాన్స్‌ని అప్పు కోసం ఆశ్రయించారు.

అక్కడ నిబంధనల ప్రకారం లక్ష ఇరవై వేల రూపాయల నగదు అప్పుగా తీసుకున్నారు. అందుకుగాను ప్రతినెల ఏడు వేల రూపాయలు ఈఎమ్ఐ రూపంలో అప్పుగా తిరిగి చెల్లించాలి. కంపెనీ నిబంధన ప్రకారం సుమారు గత పన్నెండు నెలల నుండి ప్రతినెలా నెలవారీ వాయిదా చెల్లిస్తున్నారు. అయితే జూలై నెలలో కట్టాల్సిన ఏడు వేల రూపాయలు మాత్రం సమయానికి కట్టలేకపోయారు. దీంతో నెలాఖరి రోజు అయిన జూలై 31 వ తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో ముగ్గురు ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్స్ అరిగిపాలెంలోనే సన్యాసిరావు ఇంటికి వెళ్లారు.

ఈఎమ్ఐ కట్టలేదంటూ సన్యాసిరావు భార్య రాజేశ్వరిని దుర్భాషలాడారు. అనంతరం అక్కడి నుండి షాప్ వద్దకి వెళ్లారు. ఆ షాపులో ఉన్న సన్యాసిరావు కుమారుడైన పదహారేళ్ల మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పారు. మీ నాన్న ఎస్ కోటలో ఉన్నాడు, తీసుకు రమ్మన్నాడు, మాతో రమ్మని బాలుడిని తీసుకెళ్లారు. అలా వారితో తీసుకెళ్లి ఎస్ కోట ఫైనాన్స్ ఆఫీస్ గదిలో బంధించారు. అనంతరం బాలుడు తండ్రి సన్యాసిరావుకి ఫోన్ చేసి మీ అబ్బాయిని బంధించామని, మీరు ఈఎమ్ఐ కట్టి తీసుకెళ్ళాలని, లేకపోతే మా దగ్గరే ఉంటాడని కటువుగా చెప్పారు. దీంతో చేసేదిలేక ఫైనాన్స్ కంపెనీ వద్దకు వెళ్లి మా కుమారుడిని వదిలిపెట్టాలని రికవరీ ఏజెంట్స్ ను వేడుకున్నాడు. ఈఎంఐ కడితే తప్ప వదిలేది లేదని తెగేసి చెప్పారు ఏజెంట్స్. దీంతో బాధితుడు సన్యాసిరావు చేసేదిలేక టివి9ను ఆశ్రయించాడు.

సమాచారం అందుకున్న టివి9 ప్రతినిధి వెంటనే జిల్లా ఎస్‌పీకి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఎస్ కోటలో ఉన్న తమ సిబ్బందిని అప్రమత్తం చేసి హుటాహుటిన ఫైనాన్స్ కంపెనీ వద్దకు పంపించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితి గమనించిన బాలుడిని విడిపించారు. అనంతరం బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు రికవరీ ఏజెంట్స్ తోపాటు ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే న్యాయ ప్రక్రియ ఫాలో అవ్వకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దాడులకు దిగుతున్న రికవరీ ఏజెంట్స్ ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..