Vijayawada: దీవుల్లో జీవుల్లా గడుపుతున్న జనం.. బెజవాడ వాసులను వెంటాడుతున్న మరో భయం

భారీ వర్షాలు, వరదలతో విజయవాడ కాస్తా.. విలయవాడగా మారిపోయింది. నాలుగు రోజులుగా జన జీవితం...జల జీవితంగా మారిపోయింది. వరదలోనే ప్రజలు బతుకు ఈడుస్తున్నారు. అదే ఇప్పుడు అలారం బెల్స్‌ మోగిస్తోంది.

Vijayawada: దీవుల్లో జీవుల్లా గడుపుతున్న జనం.. బెజవాడ వాసులను వెంటాడుతున్న మరో భయం
Vijayawada
Follow us

|

Updated on: Sep 03, 2024 | 9:03 AM

భారీ వర్షాలు, వరదలతో విజయవాడ కాస్తా.. విలయవాడగా మారిపోయింది. నాలుగు రోజులుగా జన జీవితం…జల జీవితంగా మారిపోయింది. వరదలోనే ప్రజలు బతుకు ఈడుస్తున్నారు. అదే ఇప్పుడు అలారం బెల్స్‌ మోగిస్తోంది. బెజవాడను జ్వరవాడగా మార్చేస్తోంది. చుట్టూ నీళ్లు…మధ్యలో దీవుల్లా మారిన కాలనీలు. దీవుల్లో జీవుల్లా బతుకీడుస్తున్న జనం. బుడమేరు వరద బీభత్సంతో.. విజయవాడలోని సింగ్‌నగర్‌, అంబాపురం, వైఎస్సార్ కాలనీ, రాజీవ్‌నగర్‌, జక్కంపూడి, అజిత్‌సింగ్‌నగర్‌, కండ్రిగ, న్యూ రాజరాజేశ్వరిపేట, సుందరయ్యనగర్‌ లాంటి పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. నాలుగు రోజులుగా వరద నీటిలోనే జన జీవితం సాగుతోంది.

నగరమంతా ఎటు చూసినా నీళ్లే.. 72 గంటలకు పైగా నరకం… బెజవాడవాసులు, ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఫస్ట్‌టైమ్‌ చూస్తున్నారు. ఎక్కడ చూసినా జల విలయమే. కరెంటు లేదు.. చాలా చోట్ల తిండి, నీళ్లు లేక అలోలక్ష్మణా అంటూ అలమటిస్తున్నారు. ఈ వరదతో 3 లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అయ్యారు. 3 రోజులుగా మంచినీళ్లు, ఆహారం కోసం జనం ఎదురు చూస్తున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్‌ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేయడంతో.. అక్కడ చిక్కకున్నవారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అలాగే పడవల్లో ఆయా ప్రాంతాల్లో ఆహారం సరఫరా చేస్తున్నారు.

జల జీవితంతో జనం నానా కష్టాలు పడుతున్నారు. ఇక చిన్నారులకు పాలు దొరక్క ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు.. గాలి వానలో వరద నీటిలో బతుకు ప్రయాణం అన్నట్లు సాగుతుండడం, కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. అసలే విష జ్వరాలు విజృంభిస్తున్న కాలం. ఇంకా వాటికి అనుకూలమైన వాతావరణం కావడంతో విష జ్వరాలు దాడి చేస్తున్నాయి. విజయవాడ వాసులను మంచాన పడేలా చేస్తున్నాయి. దీంతో రకరకాల ఆరోగ్య సమస్యలతో జనం అల్లాడిపోతున్నారు. విజయవాడ కాస్తా జ్వరవాడగా మారిపోయింది.

అటు వరదలో మునిగిపోయిన నగరం, ఇటు వరద కష్టాలకు తోడు విష జ్వరాల విజృంభణతో విజయవాడ కోలుకునేదెలా అనే ప్రశ్న తలెత్తుతోంది. బెజవాడలో చాలా ప్రాంతాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. నదీ ప్రవాహం తగ్గితే తప్ప నగరంలో నీళ్లు దిగువకు పోని పరిస్థితి. నీళ్లు పోతే కానీ….వరద ముంపు నుంచి నగరం బయటపడదు. పగలే ఇన్ని కష్టాలు పడుతున్న ప్రజలు.. రాత్రి పూట భయంతో వణికిపోతున్నారు. ఎటు నుంచి ఏ పురుగుపుట్రా వస్తాయో తెలియదు. దీనికితోడు ఆరోగ్య సమస్యలు ఆవురావురుమంటూ చుట్టుముడుతున్నాయి. దీంతో ఈ రాత్రి గడిస్తే చాలు అన్నట్లు బిక్కుబిక్కుమంటూ జనం గడుపుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..