Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ‘అమ్మో ఫ్లై ఓవర్’.. ఆ మలుపు సరాసరి యమలోకానికి ప్రధాన రహదారే.!

విశాఖలో.. అది సిటీ నడిమధ్యలో ఉన్న ఏకైక ఫ్లై ఓవర్.! సిటీ నుంచి రైల్వే స్టేషన్, గాజువాక వైపు వెళ్లేందుకు.. అదే ప్రధాన రహదారి. కేవలం రెండున్నర కిలోమీటర్లే అయినప్పటికీ.. సిగ్నల్స్ బెడద లేకుండా నేరుగా వెళ్లేందుకు ఆ ఫ్లై ఓవర్‌ను వాహనదారులు వినియోగిస్తూ ఉంటారు. అయితే.. ఆ ఫ్లైఓవరే ప్రాణాలు తీస్తోంది. నిత్యం ఫ్లైఓవర్‌పై రక్తం ఏరులై పారుతోంది.

AP News: 'అమ్మో ఫ్లై ఓవర్'.. ఆ మలుపు సరాసరి యమలోకానికి ప్రధాన రహదారే.!
Vizag Telugu Thalli Flyover
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ravi Kiran

Updated on: Oct 28, 2023 | 5:33 PM

విశాఖలో.. అది సిటీ నడిమధ్యలో ఉన్న ఏకైక ఫ్లై ఓవర్.! సిటీ నుంచి రైల్వే స్టేషన్, గాజువాక వైపు వెళ్లేందుకు.. అదే ప్రధాన రహదారి. కేవలం రెండున్నర కిలోమీటర్లే అయినప్పటికీ.. సిగ్నల్స్ బెడద లేకుండా నేరుగా వెళ్లేందుకు ఆ ఫ్లై ఓవర్‌ను వాహనదారులు వినియోగిస్తూ ఉంటారు. అయితే.. ఆ ఫ్లైఓవరే ప్రాణాలు తీస్తోంది. నిత్యం ఫ్లైఓవర్‌పై రక్తం ఏరులై పారుతోంది. ఒకవైపు వాహనాల హై-స్పీడ్‌తో పాటు నియంత్రణ లేమి.. మరోవైపు ఫ్లైఓవర్ ఇంజనీరింగ్‌లో డిఫాల్ట్ కూడా ప్రమాదాలకు కారణం అవుతుంది.

విశాఖలో వాహనాల రద్దీ.. ప్రయాణికులు సత్వరమే గమ్యస్థానాలకు చేరుకునేలా.. గాజువాక రైల్వే స్టేషన్ నుంచి సిటీలోకి.. సిరిపురం, ఆశలమెట్ట, సిటీ నుంచి రైల్వే స్టేషన్ గాజువాక వైపు వెళ్లేందుకు తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ ఫ్లైఓవర్‌పై.. రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరి యువకుల ప్రాణాలు బలిగొంటే.. మరో యువకుడిని ఆసుపత్రి పాలయ్యేలా చేసింది. దీంతో ఈ ఫ్లైఓవర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

తాజాగా విశాఖ తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైస్పీడ్‌లో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు శ్యామ్, హర్షగా గుర్తించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి రాజుగా గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలంలో పూర్తిగా భయానక దృశ్యాలు కనిపించాయి. పల్సర్ బైక్ శకలాలు 300 మీటర్ల వరకు ఎగిరిపడ్డాయి. డివైడర్‌పై ఉన్న మూడు పూలకుండీలు ధ్వంసం అయ్యాయి. అక్కడ బీతావహ పరిస్థితిని చూస్తే బైక్ స్పీడ్ దాదాపుగా వందకు పైనే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.

2.5 కిలోమీటర్ల ఫ్లై-ఓవర్‌పై..

విశాఖ తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ప్రమాదాల తీవ్రత కొనసాగుతోంది. 2.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌పై తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. అన్నీ కూడా తీవ్రమైన ప్రమాదాలు.. ఓసారి కారు అదుపుతప్పి ముందున్న బైక్ స్కూటీని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ఏకంగా ఫ్లైఓవర్ నుంచి కిందపడ్డారు. మరో ప్రమాదంలో యువతి యువకుడు ప్రాణాలు కోల్పోయారు. అలా వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2019 నుంచి డేటా తీసుకుంటే.. ఈ నాలుగేళ్ల కాలంలోనే.. 13 మందిని వేర్వేరు ప్రమాదాల్లో ఈ ఫ్లైఓవర్ బలి తీసుకుంది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైస్పీడ్‌తో పాటు ఫ్లైఓవర్ ఇంజనీరింగ్ డిఫాల్ట్‌ ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయని అంటున్నారు పోలీసులు.

జీవీఎంసీకి ఫిబ్రవరిలోనే లేఖ..

ఫ్లై ఓవర్ ఇంజనీరింగ్ డిఫాల్ట్‌పై ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవీఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్‌కు ట్రాఫిక్ పోలీసులు లేఖ కూడా రాశారు. ఆ తరువాత మరో నలుగురు వేర్వేరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న బైక్ యాక్సిడెంట్‌లో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరోసారి జీవీఎంసీ దృష్టికి సమస్య తీసుకెళ్లాలని అధికారులకు సీపీ ఆదేశించారు. ఘటనా స్థలాన్ని సీపీ రవిశంకర్ అయ్యానార్ సందర్శించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై నిపుణులుతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ఆ మలుపులో అందుకే ప్రమాదాలు..

తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై.. హై స్పీడ్‌తో వాహనాలు అదుపు తప్పుతున్న మాట ఒకటైతే.. మరోవైపు ఫ్లైఓవర్ అలైన్మెంట్ ఇంజనీరింగ్ కూడా లోపాలు ఉన్నాయన్నది గతంలోనే విశ్లేషించారు. వేర్వేరు చోట్ల ప్రమాదాలు సంభవించాయి. ఏడాదిలోనే మూడుకు పైగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రాణాలు పోతూ ఉన్నాయి. ప్రధానంగా ఫ్లైఓవర్ ఎత్తు పల్లాలుగా ఉండడంతో పాటు రైల్వే స్టేషన్ వైపు ఫ్లైఓవర్ ఎండ్ అవుతున్న కొద్ది దూరంలోనే చిన్నపాటి మలుపు, ఆపై డౌన్ కూడా ఉంది. ఈ క్రమంలో హై స్పీడ్‌గా వస్తున్న వాహనాలు ఆ మలుపు వద్ద అదుపుతప్పి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇదే విషయాన్ని పోలీసులు కూడా చెబుతున్నారు. దీనికి తోడు మలుపు తిరుగుతున్న సమయంలో.. రోడ్డుకు లెఫ్ట్ సైడ్ పల్లం ఉండాల్సింది పోయి.. రైట్ సైడ్ రోడ్డు టిల్ట్ ఉండడంతోనే.. ఈ ప్రమాదాలకు ఒక కారణమని ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు చెబుతున్నారు. హైస్పీడ్‌లో వస్తున్న వాహనాలు డౌన్ దిగే సమయంలో కంట్రోల్ చేయలేక పల్లం వైపు వెళ్లి డివైడర్‌ను ఢీ కొడుతున్నారని అంటున్నారు. దీంతో పాటు ఫ్లైఓవర్‌పై చాలా చోట్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇప్పటికే గతంలో ఒకసారి జీవీఎంసీ అధికారులు ఇన్స్పెక్షన్ చేశారు. కానీ శాశ్వత నివారణ చర్యలు చేపట్టలేదు. పోలీసులు స్పీడు కంట్రోల్ చేయగలుగుతున్నారు తప్ప.. రోడ్ ఇంజనీరింగ్ డిఫెక్ట్‌పై జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగమే చర్యలు చేపట్టాలని అంటున్నారు.