Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌తో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతల రియాక్షన్.. అసంతృప్తిలో టీడీపీ అధిష్ఠానం.. కారణం ఇదే..
చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో నంద్యాల జిల్లా టీడీపీ రియాక్షన్ సరిగా లేదా? తమ జిల్లాలో అధినేత అరెస్ట్‌తో నంద్యాల నాయకత్వం డైలమాలో పడిందా? నష్టనివారణ కోసమే మాజీ మంత్రి దీక్షకు దిగారా? దీక్షను భగ్నం చేసేదాకా మిగిలిన నేతలు ఎందుకు కలిసిరాలేదు? చంద్రబాబు అరెస్ట్ ప్రభావం కర్నూలు నేతలపై పడబోతోందా? అరెస్టుకు ముందు తర్వాత అన్నట్లు సీన్ మారబోతోందా?

అధినేత అరెస్టుపై ముందే సమాచారం ఉంది. చట్టపరమైన ప్రక్రియ అనివార్యమే అయినా కనీసం నిరసనకు దిగడంలోనూ నంద్యాల నాయకత్వం సరిగా స్పందించలేదన్న అసంతృప్తితో ఉన్నారట టీడీపీ పెద్దలు. పోలీసులు ఆ రోజు అరెస్ట్ సమయంలో చంద్రబాబు దగ్గర ఇద్దరే ఇద్దరు టీడీపీ నేతలు తప్ప మరెవరూ లేరు. పెద్దగా ప్రతిఘటన లేకపోవడంవల్లే పోలీసులు సులభంగా అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారన్న చర్చ పార్టీశ్రేణుల్లో జరుగుతోంది.
ఈ ఎపిసోడ్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతల రియాక్షన్‌పై అసంతృప్తితో ఉందట అధిష్ఠానం. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో.. ఆ పార్టీ కేడర్ హాస్పిటల్ చుట్టూ మోహరించింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో అలాంటి అలర్ట్ కనిపించలేదన్న మాట పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది.
సొంతగడ్డపై చంద్రబాబు అరెస్ట్‌తో ఆత్మరక్షణలో పడ్డారట మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లా టీడీపీపై పడ్డ మచ్చని చెరిపేందుకే ఆమె ఆమరణ దీక్షకు దిగారంటున్నారు. చంద్రబాబు అరెస్టయిన ఆర్కే ఫంక్షన్ హాల్‌లో తమ్ముడు జగత్‌తో దీక్షకు దిగారు అఖిలప్రియ. చివరికి మూడోరోజుల తర్వాత పోలీసులు దీక్షను భగ్నంచేశారు.
నంద్యాల బాధ్యతలు తమకు అప్పగించి ఉంటే తడాఖా చూపించి ఉండేవాళ్లమని అనుచరులతో చెబుతున్నారట అక్కాతమ్ముళ్లు. ఇప్పటికైనా ఎవరు నమ్మకస్తులో, పార్టీకోసం సిన్సియర్‌గా పనిచేసేదెవరో నాయకత్వానికి తెలిసిందంటోంది మాజీమంత్రి వర్గం. నారా లోకేష్ దగ్గర అనుమతి తీసుకుని ఆమరణ దీక్ష చేపట్టానని అఖిలప్రియ చెప్పినా.. కర్నూలు, నంద్యాల జిల్లాల టీడీపీ నేతలెవరూ ఆమెతో కలిసిరాలేదు.
అఖిలప్రియ ఆమరణ నిరాహారదీక్షకు నంద్యాలలోనే ఉన్న ఆమె అన్న, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్ కుటుంబీకులు సంఘీభావం ప్రకటించలేదు. పోలీసులు బలవంతంగా దీక్షని భగ్నం చేసేదాకా మిగిలిన నేతలెవరూ అఖిలప్రియకు మద్దతివ్వలేదు. కోట్ల దంపతులు, మాజీ మంత్రి ఏరాసు, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత మినహా మిగిలిన నేతలెవరూ అఖిలప్రియ దీక్షపై స్పందించలేదు.
తమ్ముడికి నంద్యాల టికెట్ విషయంలో పట్టుదలతో ఉన్న అఖిలప్రియ దీక్ష ఎపిసోడ్‌తో పార్టీ దగ్గర మైలేజ్ పెరుగుతుందనుకుంటున్నారు. నంద్యాల జిల్లా టీడీపీ విషయంలో అధిష్ఠానం అసంతృప్తితో ఉందన్న మాట బలంగానే వినిపిస్తోంది. ఎన్నికల్లో కొందరి టికెట్ల విషయంలో కూడా ఇవన్నీ ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి




