TDP: తునిలో టీడీపీకి పరాజయాల ప్రతిధ్వని.. పరాజయాల పలకరింపే తప్ప.. విజయానికి దారి ఇదేనా..
తుని. అక్కడ పరాజయాల ప్రతిధ్వనే తప్ప విజయ ధ్వని వినిపించడం లేదట. ఏపీలో బలమైన పార్టీకి దాదాపు 15 ఏళ్లుగా అక్కడ పరాజయాల పలకరింపే తప్ప విజయాలు మాత్రం హలో చెప్పనే చెప్పడం లేదంటున్నారు. అక్కడ విజయం ఎప్పుడు తమ్ముడు అంటే తమ్ముళ్లు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకటో కృష్ణుడు ఓటమి భారంతో తప్పుకుంటే రెండో కృష్ణుడు కూడా రెండుసార్లు చేతులెత్తేశారట.
గత మూడు ఎన్నికల్లో ఒక్కసారి కూడా విజయ ధ్వని వినిపించలేదట. సీనియర్ కృష్ణుడు వల్ల కాకపోతే సీరియస్ ఫైట్ ఇవ్వడానికి జూనియర్ కృష్ణుడ్ని దించినా లాభం లేకపోయిందట. తుని అసెంబ్లీ సీటులో వరుసగా మూడుసార్లు సైకిల్‌కి పంక్చర్ అయింది. అన్న, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి ఓటమి తర్వాత ఆయన తమ్ముడు కృష్ణుడు రంగంలోకి దిగినా ప్రయోజనం కనిపించలేదట. రెండుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన కృష్ణుడు ఓటమి పాలవడంతో టీడీపీ పరిస్థితి అయోమయం గందరగోళంగా ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. దీంతో ఏమీ శాయవలె అంటూ ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. తునిలో పోటీ చేయడానికి బలమైన అభ్యర్థి కావలెను అంటోందిట టీడీపీ.
మూడుసార్లు వరుసగా ఓడిన టీడీపీ
కాకినాడ జిల్లా తుని అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అని చెబుతారు. అయితే గత మూడు పర్యాయాలుగా తునిలో టీడీపీ ఓటమి పాలవుతూ వస్తోంది. 2009 లో టీడీపీ తరఫున పోటీకి దిగిన యనమల రామకృష్ణుడుపై అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి రాజా అశోక్‌బాబు గెలుపొందారు. 2014,2019 లో టీడీపీ అభ్యర్థి యనమల కృష్ణుడు పై వైస్సార్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా విజయం సాధించారు.
తునిలో గెలిచేందుకు టీడీపీ వ్యూహాలు
దీంతో రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా తునిలో జెండా ఎగరెయ్యాలని టీడీపీ అధిష్టానం పావులు కదుపుతోందట. ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టిందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితుల గురించి రహస్య నివేదికలు తెప్పించుకుంటోందిట టీడీపీ హైకమాండ్. ఈ మధ్య చంద్రబాబు యనమల కృష్ణుడిని పిలిపించుకుని నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఈ భేటీ లో తుని ఎమ్మెల్యే సీటు యనమల కృష్ణుడికే అని అధిష్టానం ప్రకటించలేదట. అయితే కృష్ణుడు మాత్రం తనకే సీటు వస్తుందని గట్టిగా నమ్ముతున్నారని చెబుతున్నారు.
అభ్యర్థిని మార్చే ఆలోచన
చంద్రబాబు మదిలో ఏముందో ఎవరికీ తెలియదంటున్నారు. రెండు దఫాలుగా కృష్ణుడు ఓడిపోవడంతో అభ్యర్థిని మారిస్తే బాగుంటుందా అని పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరోపక్క యనమల రామకృష్ణుడు పెద్ద కుమార్తె అయిన దివ్యను బరిలో నిలబడితే ఎలా ఉంటుంది అని మరో ఆలోచన కూడా ఉన్నట్టు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయట. యనమల కుటుంబసభ్యులకు కాకుండా బయటవారికి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నట్టు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు కుదిరితే ఆ పార్టీకి తుని సీటు కేటాయిస్తారనే చర్చ కూడా టీడీపీలో జరుగుతోందంటున్నారు. ఏదిఏమైనా ఈసారి తునిలో గెలవాలని గట్టి సంకల్పంతో ఉన్న టీడీపీ అధిష్టానం.. అభ్యర్థి విషయంలో భారీ మార్పులు తప్పవనే సంకేతాలు బలంగా ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తునిలో పాగా వేయాలనే టీడీపీ కోరిక ఈసారైనా నెరవేరుతుందో లేదో చూడాలంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం