Visakhapatnam: స్కూటీపై చిన్నారి మృతదేహం ఘటనపై ప్రభుత్వం సీరియస్.. స్టాఫ్ నర్స్ కృష్ణవేణి సస్పెండ్..
స్కూటీపై చిన్నారి మృతదేహాన్ని తరలించిన ఘటనలో విశాఖ కేజీహెచ్ స్టాఫ్ నర్సు కృష్ణవేణిని సస్పెండ్ చేశారు. చిన్నారి మృతి చెందిన వెంటనే ఎస్టీ సెల్ కు తెలపడంలో ఆమె ఆలస్యం చేశారని, మృతదేహాన్ని..
స్కూటీపై చిన్నారి మృతదేహాన్ని తరలించిన ఘటనలో విశాఖ కేజీహెచ్ స్టాఫ్ నర్సు కృష్ణవేణిని సస్పెండ్ చేశారు. చిన్నారి మృతి చెందిన వెంటనే ఎస్టీ సెల్ కు తెలపడంలో ఆమె ఆలస్యం చేశారని, మృతదేహాన్ని తీసుకెళ్తున్నా పట్టించుకోకపోవడంతో ఆమెపై అధికారులు వేటు వేశారు. డెడ్ బాడీతో స్కూటీపై వెళ్తున్నా అధికారులకు సమాచారం ఇవ్వని ఔట్ గేట్ వద్ద విధులు నిర్వహించిన ఇద్దరు భద్రతా సిబ్బందిని కూడా విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. విచారణ కమిటీ నివేదిక మేరకు ఉన్నతాధికారుల చర్యలు చేపట్టారు.
కాగా.. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కుముడు గ్రామానికి చెందిన చిన్న మత్స్యరాజు, మహేశ్వరి దంపతులకు ఈ నెల 2న పాడేరు ఆస్పత్రిలో మగ శిశువు జన్మించాడు. బరువు తక్కువగా ఉండటంతో పాటు శ్వాస సంబంధిత సమస్యతో జన్మించడం వల్ల పాడేరు ఆస్పత్రి వైద్యులు కేజీహెచ్ కు తరలించారు. ఎన్ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే.. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో చేసేదేమీ లేక స్కూటీపైనే చిన్నారి డెడ్ బాడీ ని తీసుకెళ్లారు.
ఈ అమానవీయ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అంబులెన్సులు, మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీలు నిధులు ఖర్చు చేస్తున్నాయి. కానీ, సిబ్బంది నిర్లక్ష్యం, అడ్మినిస్ట్రేషన్ ఉదాసీన వైఖరి దారుణాలకు కారణంగా నిలుస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..