Srisailam: శ్రీశైలానికి సంక్రాంతి శోభ.. ఈ నెల 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఈనెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అష్టదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని జనవరి 12వ తేదీ నుండి 18 తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. పంచాహ్నిక దీక్షతో ఏడురోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీన ముగియనున్నాయి.

సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ మల్లికార్జునస్వామివారికి ఏటా రెండుసార్లు అనగా మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభంగా 12 వ తేది ఉదయం గం. 9.15 లకు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అనంతరం లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు సంకల్ప పఠనం తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ జరిపించబడుతుంది. గణపతి పూజ తరువాత వృద్ధి, అభ్యుదయాల కోసం స్వస్తి పుణ్యాహవచనం జరిపించబడుతుంది ఈ కార్యక్రమాల తరువాత బ్రహ్మోత్సవ నిర్వహణకు ఆధ్వర్యం వహించే శివపరివార దేవుడైన చండీశ్వరునికి విశేష పూజలు జరిపించబడతాయి.
అనంతరం కంకణధారణ, ఋత్విగ్వరణం, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తు హోమం, మండపారాధనలు, కలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, పారాయణలు నిర్వహించ బడతాయి 12వ తేదీ సాయంకాలం 5.00 గంటల నుండి అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపనల కార్యక్రమాలు జరిపించబడుతాయి. సాయంత్రం 7.00గంటల నుండి ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ ఆయా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ముక్కోటి దేవతలను,సకల సృష్టిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు గాను ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరిపించబడుతుంద బ్రహ్మోత్సవాలలో భాగంగానే ప్రతిరోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు, మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం,చండీహోమం, నిత్యహవనాలు జరిపించబడతాయి.
బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు నుండి అనగా 13వ తేది నుండి శ్రీస్వామిఅమ్మవార్లకు వాహన సేవలు నిర్వహించబడుతాయి. 15వ తేదీ మకరసంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కల్యాణం జరిపించబడుతుంది. 17వ తేదీ ఉదయం యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం నిర్వహించబడుతాయి. సాయంత్రం సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ నిర్వహించబడుతాయి. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన 18వ తేదీ రాత్రి జరిగే పుష్పోత్సవం,శయనోత్సవం, ఏకాంతసేవలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
రోజువారీగా కార్యక్రమాలు
- 12న అంకురార్పణ, ధ్వజారోహణ
- 13న భృంగి వాహనసేవ
- 14న కైలాస వాహనసేవ
- 15న నంది వాహనసేవ , బ్రహ్మోత్సవ కల్యాణం
- 16న రావణవాహనసేవ,
- 17న పూర్ణాహుతి, త్రిశూల స్నానం, సదస్యం,నాగవల్లి, ధ్వజావరోహణ
- 18న అశ్వవాహన సేవ ( ఆలయ ఉత్సవం)
పుష్పోత్సవం, శయనోత్సవం. కాగా సంక్రాంతి రోజున (జనవరి 15 జరిగే బ్రహోత్సవాలలో కల్యాణానికి చెంచు గిరిజన భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానిచడం జరుగుతోంది.
కొన్ని ఆర్జిత సేవలు నిలుపుదల
ఉత్సవాల సందర్భంగాఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఆర్జిత ప్రత్యక్ష మరియు పరోక్షసేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, (పరోక్షసేవ) శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కల్యాణం మరియు శ్రీ స్వామిఅమ్మవార్ల కల్యాణం, ఉదయాస్తమానసేవ, ప్రాత:కాలసేవ, ప్రదోషకాలసేవ, ఏకాంతసేవలను నిలపుదల చేయబడ్డాయి ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
