Ticket Charges: సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట.. టికెట్ల ఛార్జీలపై ప్రభుత్వం కొత్త రూల్స్.. అధిక ధరలకు చెక్ పడ్డట్లే..
సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల నుంచి ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు వసూలు చేసే ఛార్జీలపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ఎలా పడితే అలా పెంచుకోవడం ఇక కుదరదు.

సంక్రాంతికి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో పండక్కి సొంతూరు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికుల సందడితో కోలాహలం నెలకొంది. ఇప్పటికే బస్సులు, రైళ్లల్లో అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. దీంతో టికెట్లు దొరకనివారు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ బస్సుల్లో పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ఛార్జీలతో పోలిస్తే రెండు లేదా మూడింతలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయం లేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సుల్లో టికెట్లను ప్రజలు బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ బస్సుల దోపిడీని నివారించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలను నియంత్రించేందుకు కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.
ప్రైవేటు బస్సుల్లో చార్జీలకు కొత్త రూల్స్
ప్రైవేట్ బస్సుల్లో అదనపు ఛార్జీలపై రవాణాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పండుగను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సుల్లో అధిక టికెట్ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా హెచ్చరించారు. RTC ఛార్జీలపై గరిష్ఠంగా 50 శాతం వరకు మాత్రమే టికెట్ ధర పెంపునకు అనుమతి ఇచ్చారు. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. AbhiBus, RedBus వంటి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్స్ ద్వారా కూడా ధరల పర్యవేక్షణ ఉంటుందన్నారు. జనవరి 18 వరకు అన్ని జిల్లాల్లో రోజువారీ తనిఖీలు చేపడతామని అన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ఛార్జీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని, ఈ సారి పెంపు లేదని స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలను ఆర్టీసీ వసూలు చేస్తోంది. కానీ ఈ సారి ప్రయాణికులకు అధిక ఛార్జీల నుంచి ఊరట కలిగిస్తూ రెగ్యూలర్ ఛార్జీలనే వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాలకు తిరిగే బస్సులతో పాటు రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలకు తిరిగే ప్రత్యేక బస్సులకు సాధారణ రోజుల్లో ఉండే ఛార్జీలు తీసుకోనున్నారు. ఈ సంక్రాంతికి దాదాపు 8 వేల ప్రత్యేక బస్సులను తిప్పేందుకు ఆర్టీసీ ప్లాన్ చేసింది. ఈ మేరకు బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చింది.ప
