ప్రియుడితో ఆ యవ్వారం.. సైలెంట్‌గా భర్తను హత్య చేసి.. వగలేడుపు.. కట్‌చేస్తే..
ఇటీవల సమాజంలో మహిళల వివాహేతర సంబంధాలు శృతి మించుతున్నాయి. తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని చివరకు తాళికట్టిన భర్తను, కడుపున పుట్టిన చిన్నారులను కడతేర్చే స్థాయికి వెళ్ళిపోతున్నారు కొంతమంది మహిళలు. ఈ మధ్య తరచూ ఇలాంటి ఘటనలు జరగడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోను ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి ఓ ఇళ్లాడు ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చింది.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోనీ SC కాలని శివారులో ఈ నెల 7న ఓ వ్యక్తి మృతదేహం పడి ఉంది. మృతదేహం పక్కనే అతని బైక్ కూడా ఉంది. విచారణ జరిపిన పోలీసులు మృతుడు పాతపట్నం మొండి గొల్ల వీధికి చెందిన నల్లి రాజు(27) గా గుర్తించారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు కూడా లేకపోవడంతో పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్‌లో మృతుడు నిద్రమాత్రలు తీసుకున్నట్టు, ఊపిరాడక మృతి చెందినట్లు వచ్చింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. రాజు చనిపోయే ముందురోజు రాత్రి మొండి గొల్లవీదిలోని పలు CC కెమెరాల పుటేజీ పరిశీలించగా గుండు ఉదయ్ కుమార్, మల్లిఖార్జున్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ కెమెరాల పుటేజీలలో కనిపించారు. దాంతో వారి ఆచూకీ గుర్తించి పట్టుకొని వారిని, రాజు భార్యను విచారించగా అసలు విషయం బయటపడింది. రాజు భార్య మౌనికే అసలు హంతకురాలనీ తేలిపోయింది.
పాతపట్నం మొండి గొల్లవీధికి చెందిన నల్లి రాజుకు 8 ఏళ్ల కిందట మౌనికతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే గత కొంత కాలంగా మౌనిక పాతపట్నంకి చెందిన గుండు ఉదయ్ కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి పలుమార్లు భర్త, కుటుంబ సభ్యులు మందలించారు. అయినప్పటికీ వివాహేతర సంబందం మోజులో ఉన్న మౌనిక అందులో నుండి బయటపడలేదు సరికదా తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే హతమార్చాలని భావించింది. దానికోసం ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ప్రియుడు ఉదయ్ కుమార్ కూడా రాజు చనిపోతే తాను తన భార్యకి విడాకులు ఇచ్చేస్తానని అప్పుడు ఇద్దరం కలిసి హ్యాపీ గా ఉండవచ్చని చెప్పాడు. దీంతో ఈనెల 5వ తేదీన రాజు భోజనంలో 5 నిద్ర మాత్రలు వేసింది మౌనిక. మరునాడు రాత్రి భోజనంలో ఆరు నిద్ర మాత్రలు వేయగా కాసేపటికి మత్తులోకి వెళ్ళిపోయాడు రాజు.
ఇక అర్ధరాత్రి దాటాక మౌనిక ప్రియుడు ఉదయ్ కుమార్‌కు ఫోన్ చేయగా అతడు తన స్నేహితుడు మల్లిఖార్జున్ ను తీసుకొని బైక్ పై రాజు ఇంటికి వచ్చాడు. బైక్ పై వెళ్తూ వెళ్తూనే మార్గమధ్యంలో వీధి లైట్లను ఆపేస్తూ రాజు ఇంటికి చేరారు. అనంతరం మత్తులో ఉన్న రాజుకి దిండును ముఖంపై అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఉదయకుమార్, మల్లిఖార్జున్ ముందుగా రాజు బైక్ ను తీసుకొని వెళ్లి sc వీధి చివరలో పెట్టి తరువాత వీరు వచ్చిన బైక్ పై రాజు మృతదేహాన్ని ఎక్కించుకుని sc కాలని వద్ద ముందుగా ఉంచిన బైక్ పక్కనే రాజు మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. రాజు ప్రమాదవశాతు బైక్ పై నుండి పడి చనిపోయినట్టు అంతా అనుకుంటారని హంతకులు భావించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మరునాడు ఉదయం బంధువులకు ఫోన్ చేసి రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన భర్త తిరిగి ఇంటికి రాలేదని చెప్పింది మౌనిక.
ఆ తర్వాత స్థానికులు రాజు మృతదేహాన్ని గుర్తించి మౌనికకు సమాచారం ఇవ్వగా ఏమి తెలియనట్టు నటిస్తూ వగల ఏడుపులు ఏడుస్తూ వచ్చింది. అయితే చివరకు పోలీసు విచారనతో వారి బండారం బయటపడింది. అనుమానాస్పద మృతిగా ఉన్న కేసును మర్డర్ కేసుగా పేర్కొంటూ A1 గా రాజు భార్య మౌనికను, A2గా ఆమె ప్రియుడు ఉదయ్ కుమార్, A3గా మల్లికార్జున్ పేర్లను నమోదు చేశారు పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేసి గురువారం వారిని కోర్టు ముందు హాజరు పరిచారు. చివరకు వివాహేతర సంబంధం కారణంగా భర్త రాజు చనిపోగా,మౌనిక జైలు పాలైంది. వారి ఇద్దరు పిల్లలు అనాధులయ్యారు. వారి కుటుంబం పరువు రోడ్డున పడింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
