AP News: పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ శిలాశాసనం.. అందులో ఏం రాసుందంటే.?

పెద్ద పెద్ద కొండలు, కొండల మధ్యలో పచ్చని చెట్లు, చెట్ల మధ్యలో పాడుబడిన ఆలయం.. ఆలయం చుట్టుపక్కల లెక్కుమించిన శిథిలాలు.. ఈ శిథిలాల మధ్యలోనే అరుదైన శాసనం.. పదహేనో శతాబ్దానికి చెందిన క్రిష్ణదేవరాయలు కాలం నాటి శాసనంగా గుర్తింపు..

AP News: పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ శిలాశాసనం.. అందులో ఏం రాసుందంటే.?
Ap News
Follow us
T Nagaraju

| Edited By: Ravi Kiran

Updated on: Dec 25, 2023 | 1:32 PM

పెద్ద పెద్ద కొండలు, కొండల మధ్యలో పచ్చని చెట్లు, చెట్ల మధ్యలో పాడుబడిన ఆలయం.. ఆలయం చుట్టుపక్కల లెక్కుమించిన శిథిలాలు.. ఈ శిథిలాల మధ్యలోనే అరుదైన శాసనం.. పదహేనో శతాబ్దానికి చెందిన క్రిష్ణదేవరాయలు కాలం నాటి శాసనంగా గుర్తింపు.. స్థానికుల సహకారం, ప్లీచ్ ఇండియా వ్యవస్థాపకుడు శివనాగిరెడ్డి సూచనలు, సలహాలతో ఆ శాసనం ఊరి నడిబొడ్డుకు చేరింది. అసలు ఆ శాసనంలో ఏముంది.. ఎందుకు శాసనాన్ని పరిరక్షించాలని డిమాండ్స్ వినపడుతున్నాయో తెలుసుకోవాల్సిందే.

వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు ప్రాంతంలో అనేక చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. బ్రహ్మనాయుడు, నాగమ్మల గురించి, మాచర్ల, గురజాల రాజ్యాలకు చెందిన అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్దం గురించి అందరికి తెలిసిందే.. అదే విధంగా ఈ ప్రాంతంలో ఇప్పటికీ అనేక శిథిలాలయాలు, వాటికి సంబంధించిన అరుదైన శిల్పాలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. ఇదే కోవలో మాచర్ల మండలం కొప్పునూరుకు అత్యంత సమీపంలోని గుండాల శిథిలాలయం వద్ద భూమిలో కూరుకుపోయిన శాసనాన్ని స్థానిక చరిత్రకారులు పావులూరి సతీష్, శివశంకర్ గుర్తించారు. ఆ సమాచారాన్ని ప్లీచ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రముఖ చరిత్రకారుడు శివనాగిరెడ్డికి చెప్పారు. వెంటనే ఆయన స్థానికులతో కలిసి శిథిలాలయం వద్ద చేరుకున్నారు. పురాతన శాసనాన్ని గుర్తించి దాన్ని భూమిలో నుండి బయటకు తీశారు. అయితే అది శ్రీక్రిష్ణదేవరాయల కాలం నాటి శాసనంగా గుర్తించారు. అందరూ కలిసి ఆ శాసనాన్ని కొప్పునూరుకు తరలించి అక్కడ భద్రపరిచారు.

శాసనం క్రీ.శ. 1516 నాటిదని, శాసనంలో క్రిష్ణ దేవరాయలు కొండవీడు, నాగార్జున కొండలను పాలిస్తున్న సమయంలో ఆయన ప్రధాని తిమ్మరుసు చేత నాగార్జున కొండ నాయంకర్‌గా ఉన్న బస్వా నాయకుడు మల్లెల గుండాల గ్రామాన్ని స్థానిక తిరువెంగళనాధుని ఆలయ నిర్వహణకు దానం ఇచ్చినట్లు ఉందని పురావస్తు అధికారులు తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న శాసనం గురించి స్థానికులకు వివరించి దాన్ని తీసుకొచ్చి కొప్పునూరులోని పీఠంలో ఉంచినట్లు ఆయన తెలిపారు. శాసనాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత స్థానికులు తీసుకోవాలని ఆయన సూచించారు.