ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడ్డ నాగుపాము.. భయంతో పరుగులు తీసిన ఉద్యోగులు

లోపల అంతా ఎవరి పనుల్లో వారుండగా అదే సమయంలో సుమారు ఆరడుగుల పొడవు, ఒంటి నిండా భయంకరమైన మచ్చలతో ఒక నాగుపాము వేగంగా కార్యాలయంలోకి దూసుకు రావటమే అంత హడావిడికి కారణమని ఉద్యోగులకు అర్థమైంది. రాజాం మండలం మడ్డువలస ఇరిగేషన్ కార్యాలయంలోకి చొరబడి స్వైర విహారం చేసిన నాగుపాము అంశం స్థానికంగా కలకలం రేపింది.

ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడ్డ నాగుపాము.. భయంతో పరుగులు తీసిన ఉద్యోగులు
Snake'
Follow us
G Koteswara Rao

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 05, 2024 | 5:53 PM

రాజాం, ఫిబ్రవరి 5: ఆ కార్యాలయం అంతా నిత్యం ఉద్యోగులు, రైతులతో నిండి ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు నిరంతరం బిజీ బిజీగా ఉండే ఆ కార్యాలయంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఎవరికివారు కేకలు వేసుకుంటూ భయంతో బయటకి పరుగులు తీశారు. ఆ హడావుడి చూస్తున్న వారికి ఎవరికేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కేకలు అరుపులతో కార్యాలయం అంతా దద్దరిల్లిపోయింది. మొత్తానికి సిబ్బంది అంతా కార్యాలయం నుండి బయటపడి అసలు ఏం జరిగిందోనని చర్చించుకోవడం మొదలుపెట్టారు.

లోపల అంతా ఎవరి పనుల్లో వారుండగా అదే సమయంలో సుమారు ఆరడుగుల పొడవు, ఒంటి నిండా భయంకరమైన మచ్చలతో ఒక నాగుపాము వేగంగా కార్యాలయంలోకి దూసుకు రావటమే అంత హడావిడికి కారణమని ఉద్యోగులకు అర్థమైంది. రాజాం మండలం మడ్డువలస ఇరిగేషన్ కార్యాలయంలోకి చొరబడి స్వైర విహారం చేసిన నాగుపాము అంశం స్థానికంగా కలకలం రేపింది. ఇరిగేషన్ కార్యాలయం కావడంతో అటు ఉద్యోగులు, ఇటు రైతులు కార్యాలయంలో సాగునీటికి సంబంధించిన కార్యకలాపాలపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో నాగుపాము రావటం, కార్యాలయంలో తిరుగుతూ బుసలు కొట్టడం ఉద్యోగులను ఒకింత భయాందోళనకు గురిచేసింది. వేగంగా దూసుకువచ్చిన నాగుపాము పడగ విప్పి కార్యాలయం అంతా తిరుగుతూ హల్ చల్ చేయడంతో భయంతో కొంతసేపు ఉద్యోగులకు నోటి వెంట మాట రాలేదు. అనంతరం స్థానిక స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు ఉద్యోగులు. విషయం తెలుసుకొని పాము సంచరిస్తున్న ఇరిగేషన్ కార్యాలయం వద్దకు చేరుకొని పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు స్నేక్ క్యాచర్. అయితే పాము మాత్రం స్నేక్ క్యాచర్ ను సైతం ముప్పుతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు నాగుపామును స్నేక్ క్యాచర్ పట్టుకుని డబ్బాలో బందించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మడ్డువలస ఇంజనీరింగ్ కార్యాలయం ఊరికి చివర చెట్లు, పొదలు మధ్య అపరిశుభ్రంగా ఉండటం, తరుచూ పాముల వంటి విషప్రాణులు రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అదృష్టం బాగుండి పాము బారి నుండి బయటపడ్డామని, ఎవర్నైనా కాటేస్తే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..