Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: కదిరిలో కుప్పకూలిన భవనం.. 4 ఇళ్లు ధ్వంసం.. ఇద్దరు చిన్నారులు మృతి.. శిథిలాల కిందే..

అనంతపురం జిల్లాని భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది.  చెంతనే ఉన్న చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. వారం రోజుల క్రితం చుక్క నీరు లేదిక్కడ.

AP Rains: కదిరిలో కుప్పకూలిన భవనం.. 4 ఇళ్లు ధ్వంసం.. ఇద్దరు చిన్నారులు మృతి.. శిథిలాల కిందే..
Building Collapse
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 20, 2021 | 8:12 AM

అనంతపురం జిల్లాని భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది.  చెంతనే ఉన్న చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. వారం రోజుల క్రితం చుక్క నీరు లేదిక్కడ. ఇప్పుడు పరిస్థితి వేరు. చిత్రావతి నది చిత్రంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాయుగుండం ఎఫెక్ట్‌తో నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నది ఉధృతంగా పారుతోంది.  చిత్రావతి నది ఉప్పొంగడంతో అనంతపురం జిల్లా కదిరి పట్టణం కకావికలమైంది. వీధులన్నీ జలమయం అయ్యాయి. పాత ఛైర్మన్‌ వీధిలో నిర్మాణంలో ఉన్న రెండతస్థుల భవనం కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న ఇళ్ళపై పడింది. దాంతో ఒక్కసారిగా నాలుగు ఇళ్లు కుప్పకూలాయి. శిథిలాల కింద మొత్తం 12 మంది చిక్కికున్నారు. స్థానికులు నలుగురిని వెలికి తీశారు. వీరిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 8 మందిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.  స్పాట్‌కు చేరుకున్న పోలీసులు , రెస్క్యూ సిబ్బంది…శిథిలాల కింద ఉన్నవారి కోసం బయటకు తీసేందుకు చర్యలు ప్రారంభించారు. అదనపు ఎస్పీ రామకృష్ణప్రసాద్‌, ఆర్డీవో వెంకటరెడ్డి.. ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు.

ఇళ్ల మధ్యే ఎలాంటి అనుమతి లేకుండా భవనం నిర్మిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులకు కంప్లైట్‌ చేసినా..పట్టించుకోలేదన్నారు. యాజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు స్థానికులు.

నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే

మరోవైపు ఏపీ సీఎం జగన్‌‌ ఇవాళ కడప, చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు రెండు వేల రూపాయల వంతున సాయం అందించాలన్నారు.

ఇటు వరద పరిస్థితులపై ప్రధాని మోదీ జగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కడప నుంచి హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. ఏరియల్‌ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు. ఏరియల్‌ సర్వేకు బయలుదేరే ముందు సీఎం వైఎస్‌ జగన్‌.. ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తారు.

Also Read: వర్షాలు, వరదలతో కడప జిల్లా అతలాకుతలం.. 30మంది గల్లంతు.. 12 మృతదేహాలు లభ్యం.. నేడు కొనసాగనున్న గాలింపు