ఋషికొండ బీచ్‌లో విషాదం.. కాళ్లు కడుక్కొని వస్తామని వెళ్లి.. సముద్ర కెరటాల్లో ముగ్గురు పిల్లల గల్లంతు!
విశాఖ ఋషికొండ బీచ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెలవు రోజున సరదాగా వెళ్లిన ముగ్గురు బాలురు సముద్ర కెరటాల్లో గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమైంది, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. మెరైన్ పోలీసులు హెచ్చరించినా వారు సముద్రంలోకి వెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

విశాఖపట్నం: ఋషికొండ ఐటీ హిల్స్ బీచ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెలవు రోజు కావడంతో విహారానికి వచ్చిన ఐదుగురు స్నేహితుల్లో ముగ్గురు సముద్ర కెరటాల్లో గల్లంతయ్యారు. గల్లంతైన వారిని నితీష్ (15), సూర్య ప్రకాష్ (14), ప్రశాంత్ (13)గా గుర్తించారు. వీరిలో ప్రశాంత్ మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఏసీపీ అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహితులంతా బీచ్‌కు వచ్చి సముద్రం వద్దకు వెళ్లారు. మెరైన్ పోలీసులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించినప్పటికీ, కాళ్లు కడుక్కొని వస్తామని చెప్పి నలుగురు సముద్రంలోకి వెళ్లారు. ఈ సమయంలో బలమైన కెరటం రావడంతో ఓ బాలుడు బయటకు రాగా.. మరో ముగ్గురు కెరటాల్లో కొట్టుకుపోయారు. ఘటన సమయంలో కెరటాల ప్రభావం ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే మెరైన్ పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. అనంతరం స్కూబా డైవర్లతో పాటు నేవీ హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను సీపీ బాగ్చి ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. గాలింపు సమయంలో ప్రశాంత్ మృతదేహం సముద్రంలో తేలుతూ కనిపించడంతో బయటకు తీసుకొచ్చారు. మిగిలిన నితీష్, సూర్య ప్రకాష్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు, గల్లంతైన బాలల్లో కొందరు వెంకటేశ్వర స్కూల్, సృజన స్కూళ్లలో చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
