Corona Effect: రక్తం మహాప్రభో.. ఆదుకునేవారి కోసం చూస్తున్న బాధితులు.. బ్లడ్ బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్..
Blood Donation; బ్లడ్ బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది. దాతలెవరూ ముందుకు రావడం లేదు. బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో ప్రకాశం జిల్లా అధికారులు
బ్లడ్ బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది. దాతలెవరూ ముందుకు రావడం లేదు. బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో ప్రకాశం జిల్లా అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికారులంతా విధిగా రక్తదానం చేయాలని నిర్ణయించారు. కరోనా కారణంగా ప్రకాశంజిల్లాలో రక్తం కొరత తీవ్రమైంది. బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. రక్త దానానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో బాధితులకు రక్తం అందించలేకపోతున్నారు. అవసరాల్లో 50శాతం కూడా రక్త సేకరణ చేయలేకపోతున్నారు.
పరిస్థితులు ఇలాగే ఉంటే మున్ముందు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశంజిల్లాలో మొత్తం 9 బ్లడ్ బ్యాంకులు నడుస్తున్నాయి. దర్శి, కందుకూరు, కనిగిరి, గిద్దలూరులో రక్తాన్ని భద్రపరిచే కేంద్రాలు ఉన్నాయి. సాధారణంగా ఒక్కో బ్లడ్ బ్యాంకులో వంద యూనిట్లకుపైగా రక్తం అందుబాటులో ఉంటుంది. గతంతో పోల్చితే ప్రస్తుతం 50శాతం నిల్వలు కూడా లేవు.
ఒంగోలు రిమ్స్‌లో ఉన్న ప్రధాన బ్లడ్ బ్యాంకులోనూ నిల్వలు పడిపోయాయి. కేవలం 60 యూనిట్ల రక్తం మాత్రమే అక్కడ అందుబాటులో ఉంది. ప్రైవేటు బ్లడ్ బ్యాంక్‌ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పరిస్థితి గమనించిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్వయంగా రక్తదానం చేసి అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరేట్‌లో బ్లడ్ డోనేషన్ క్యాంప్‌ను ప్రారంభించారు. కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులు బ్లడ్ డొనేట్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఇదేతరహాలో డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించారు. యువత కూడా పెద్ద సంఖ్యలో ముందుకురావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న బ్లడ్ బ్యాంకులు, స్టోరేజి సెంటర్ల వద్ద రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.ప్రతి కేంద్రం పరిధిలో 100 యూనిట్లు సేకరించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్.
గతంలో విద్యా సంస్థలు, ప్రైవేటు సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహించేవి. కరోనా కారణంగా ఇలాంటి శిబిరాలు జరగకపోవడం, దాతలు కూడా ముందుకు రాకరోవడం వల్ల నిల్వలు పడిపోయాయి.
ఇవి కూడా చదవండి: Postal Life Insurance: తక్కువ పెట్టబడితో ఎక్కువ భద్రత.. పోస్టాఫీసులో అదిరిపోయే ఇన్సూరెన్స్ ప్లాన్..