AP News: చేపలకు మేత వేసేందుకు వెళ్లిన రైతు.. చెరువు దగ్గర కనిపించింది చూడగా.!
పచ్చని పల్లెల్లో విష సంస్కృతిని తీసుకొచ్చి రైతాంగాన్ని అప్పల ఊబిలో నెట్టేస్తున్నారు కొందరు దుండగులు. ఇప్పటివరకు ఆక్వా ప్రాంత చేపల చెరువులకే పరిమితమైన విష ప్రయోగాలు.. ఇప్పుడు మెట్ట ప్రాంత చెరువులలో కూడా జరగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పచ్చని పల్లెల్లో విష సంస్కృతిని తీసుకొచ్చి రైతాంగాన్ని అప్పల ఊబిలో నెట్టేస్తున్నారు కొందరు దుండగులు. ఇప్పటివరకు ఆక్వా ప్రాంత చేపల చెరువులకే పరిమితమైన విష ప్రయోగాలు.. ఇప్పుడు మెట్ట ప్రాంత చెరువులలో కూడా జరగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో జరిగిన చేపల చెరువు విష ప్రయోగ ఘటన రైతును పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేయడంతో లబోదీబోమంటున్నాడు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుకుంటకు చెందిన వెంకన్నబాబు అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో గుండుగోలనుకుంట పంచాయతీకి చెందిన చెరువును చేపలు పెంచేందుకు బహిరంగ వేలం పాటలో నాలుగున్నర లక్షల రూపాయలకు లీజుకు తీసుకున్నాడు.
అనంతరం సుమారు పది లక్షల రూపాయలు వెచ్చించి బంగారు తీగ చేప పిల్లలను అందులో పెంచుతున్నాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం చెరువులో చేపలకు మేత వేస్తూ, చేపలు అనారోగ్య పరిస్థితులకు గురికాకుండా వాటికి మందులు వాడుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. మరో రెండు మూడు నెలలలో చేపలు పెరిగి పంట చేతికి వచ్చి.. పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చి ఆనందంగా జీవించొచ్చు అనే అతడి కలలు ఆవిరైపోయాయి. ప్రతీరోజూలానే వెంకన్నబాబు చేపలకు మేత వేసేందుకు చెరువు వద్దకు వెళ్లాడు. అయితే అక్కడ చెరువులో చేపలన్నీ చనిపోయి నీటిపై తేలుతూ ఉండడం కనిపించింది. వెంటనే హుటాహుటిన స్థానిక రైతులకు చెరువులో చేపలు చచ్చిపడి ఉన్న విషయాన్ని తెలిపాడు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా చేపలు ఎందుకు చనిపోయాయన్న అనుమానంతో చెరువు, చుట్టుప్రక్కల ప్రదేశాలు నిశితంగా పరిశీలించారు.

అయితే చెరువులోనూ.. గట్టుపై.. పురుగుమందుల అవశేషాలను స్థానికులు గుర్తించారు. దాంతో చెరువులో విష ప్రయోగం జరిగిందని, అందువల్ల చేపలు మృతి చెందాయని నిర్ధారణకు వచ్చారు. ఇప్పటివరకు చెరువులో చేపలు పెంచేందుకు సుమారు లీజుతో సహా 14 లక్షలుపైనే రైతు వెంకన్నబాబు ఖర్చుపెట్టాడు. ఈ ఘటన అతడు.. ఏం చేయాలో తెలియక పాలుపోని స్థితిలోకి వచ్చాడు. ఇలాంటి ఘటనలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉన్నదంతా చెరువులపై పెట్టుబడి పెట్టి నష్టపోయానని, తనని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.

