గోదావరిలో కలిసిపోయిన కుటుంబం.. మిగిలింది ఆ చిన్నారి కన్నీళ్లే
రాజమహేంద్రవరం గోదావరి తీరంలో జరిగిన విషాద ఘటన ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు మృతి చెందగా.. ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఐదో తరగతి విద్యార్థి కార్తికేయ పరిస్థితి అత్యంత విషాదకరం.

రాజమహేంద్రవరం గోదావరి తీరం ఇప్పుడు ఒక కుటుంబం విషాదానికి సాక్షిగా నిలిచింది. నిన్నటి వరకు తమ మధ్య నవ్వుతూ తిరిగిన మనుషులు. ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. ఇంట్లో పెద్దవాళ్లు లేరు. అమ్మ లేదు. అమ్మమ్మ కనిపించదు. తాతయ్య లేరు. మిగిలింది మాత్రం ఓ చిన్నారి ఒక్కరే.
పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయతో కలిసి రాజమహేంద్రవరం వచ్చారు. ఆ తర్వాత గోదావరిలోకి దూకిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో కార్తికేయను మత్స్యకారులు కాపాడగా.. నూకరాజు మృతదేహం లభించింది. మీనా, సౌజన్య కోసం గాలింపు కొనసాగుతోంది.
ఆ బాబుకు ఏం తెలుసు?
ఐదో తరగతి చదువుతున్న కార్తికేయకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కానీ తన కుటుంబం ఒక్కసారిగా తనకు దూరమైపోయిందనే వాస్తవం మాత్రం అతడి ముందుంది. గోదావరిలో కొట్టుకుపోతున్న సమయంలో ఈత రావడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మత్స్యకారులు అతడిని కాపాడారు. ఒకవైపు ప్రాణం దక్కిన ఆనందం. మరోవైపు తనవాళ్లు ఎక్కడున్నారో తెలియని ఆవేదన కార్తికేయను నిద్ర పోనివ్వడం లేదు. తినలేడు. తినకుండా ఉండలేడు. ఇంటికెళితే అమ్మ లేదు. ఆడుకుందామంటే తాతయ్య లేరు.
ఒక కుటుంబంలో అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. ఆ చిన్నారి జీవితాంతం మోయాల్సిన జ్ఞాపకంగా మారిపోయింది. సౌజన్య జీవితంలో అప్పటికే మరో విషాదం ఉంది. ఈ ఘటనకు ముందు సౌజన్య జీవితంలో మరో విషాదం ఉందని కుటుంబ సభ్యుల ఫిర్యాదులు, మీడియా కథనాలు చెబుతున్నాయి.
సౌజన్య భర్త జగదీశ్‌రెడ్డి జూలైలో మరణించారు. ఆయన మృతిపై కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగదీశ్‌రెడ్డిని చంపేశారని సౌజన్య మామ భాస్కర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారనే కథనాలు వచ్చాయి. విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చారనే ఆరోపణను ఆయన చేశారు. ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే.. ఒక కుటుంబం ఇప్పటికే ఒక కొడుకును కోల్పోయింది. ఆ విషాదం నుంచి బయటపడకముందే మరో విషాదం తలుపు తట్టింది.
నా కుమార్తెను కాపాడాలనుకున్నాం..
నూకరాజు రాశారని చెబుతున్న లేఖ ప్రకారం చూస్తే…ఒక వ్యక్తి తమ కుటుంబాన్ని వేధించాడని, సౌజన్యకు సహాయం చేస్తానని చెప్పి ఆమె బ్యాంకు వివరాలు, డబ్బు, విలువైన వస్తువులపై ఆధిపత్యం సాధించాడని ఆరోపణలు వచ్చాయి. కుటుంబాన్ని చంపుతానని బెదిరింపులు వచ్చాయని కూడా లేఖలో ఉందనే వార్తలు వచ్చాయి.
సౌజన్య రాశారని చెబుతున్న లేఖలో… తనను బెదిరించారని, బ్లాక్‌మెయిల్ చేశారని, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశారని ఆరోపించారని కథనాలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలన్నీ ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నవే. నిజానిజాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
భాస్కర్‌రెడ్డి ప్రశ్న ఒక్కటే..
నా కొడుకు ఎలా చనిపోయాడు? ఇదే ఇప్పుడు భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని వెంటాడుతున్న ప్రశ్న. తన కుమారుడు జగదీశ్‌రెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన పోలీసులను కోరారు. తన కుమారుడి మృతికి ఓ వ్యక్తితో పాటు మరొకరి పాత్ర కూడా ఉండవచ్చని ఫిర్యాదులో ఉంది. ఒక తండ్రికి తన కొడుకు మరణం వెనుక నిజం తెలుసుకోవాలనే తపన. మరోవైపు కోడలు, మనవడి భవిష్యత్తుపై ఆందోళన. కానీ చివరకు అదే కుటుంబం మరో భయంకరమైన విషాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
డబ్బు కంటే.. మనుషులే ముఖ్యం
ఈ ఘటనలో ఆరోపణలు, కేసులు, బ్యాంకు ఖాతాలు, ఆస్తులు.. ఎన్నో అంశాలు ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. ఒక కుటుంబం అంతటి తీవ్ర నిర్ణయం తీసుకునే స్థితికి ఎలా చేరుకుంది? ఎవరైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు వారి మాట వినే వ్యక్తి ఒక్కరైనా ఉన్నారా? కుటుంబ సమస్యలు తీవ్రమైనప్పుడు సమయానికి జోక్యం చేసుకునే బంధువులు, స్నేహితులు, అధికారులు ఎక్కడ ఉన్నారు?
ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. ఈ విషాదంలో అత్యంత బాధాకరమైన అధ్యాయం కార్తికేయది. తన కుటుంబాన్ని కోల్పోయిన ఆ చిన్నారి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు? తల్లి ఎక్కడ? తాత ఎక్కడ? అమ్మమ్మ ఎక్కడ? నాన్న ఎందుకు లేడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది ఎవరు?
ఒక కుటుంబ విషాదం ఇప్పుడు ఒక చిన్నారి జీవితాన్ని కూడా వెంటాడుతోంది. గోదావరి నీటిలో మునిగిపోయింది కేవలం ఒక కుటుంబం కాదు.. ఒక చిన్నారి భవిష్యత్తుపై వేసుకున్న ఎన్నో కలలు. ఈ ఘటనకు అసలు కారణం ఏంటో, ఎవరి పాత్ర ఎంతుందో దర్యాప్తు తేల్చాలి. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ అంతకంటే ముందు.. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న మరో కుటుంబం తమ బాధను చెప్పుకునే అవకాశం, సహాయం పొందే మార్గం సమాజం కల్పించాలి.
ఒక మాట.. ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు
ఒకవేళ ఈ కుటుంబం నిజంగానే తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండి ఆత్మహత్యకు ప్రయత్నించే స్థితికి చేరుకున్నట్లయితే.. ఈ విషాదం మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. వారు ఆ స్థితికి రాకముందే వారి బాధను ఎవరైనా గమనించారా? ఎవరైనా మనస్ఫూర్తిగా విన్నారా?. మానసిక నిపుణుల సూచన ప్రకారం.. ఒక వ్యక్తి అకస్మాత్తుగా మౌనంగా మారడం, అందరి నుంచి దూరంగా ఉండడం, ఇక నేను ఉండలేను, నా వల్ల అందరికీ సమస్య వంటి మాటలు మాట్లాడడం వంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు.
NCRB 2024 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 8,302 మంది, తెలంగాణలో 10,975 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా 1,70,746 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు నమోదైంది. అంటే సగటున ఏపీలో రోజుకు సుమారు 23 మంది. తెలంగాణలో సుమారు 30 మంది, దేశం మొత్తం మీద సుమారు 467 మంది సూసైడ్ చేసుకుంటున్నారు.
అలాంటి సమయంలో ఉపదేశాలు ఇవ్వడం కంటే ముందుగా వినాలి. ఏం జరిగింది? నీకు ఏం అనిపిస్తోంది? నువ్వు ఒంటరిగా లేవు.. నేను ఉన్నాననే భరోసా ఇవ్వాలి. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నాయని అనిపిస్తే నేరుగా అడగడానికి భయపడకూడదు. ప్రమాదం ఉంటే వారిని ఒంటరిగా వదలకుండా వెంటనే కుటుంబ సభ్యులు, మానసిక ఆరోగ్య నిపుణులు, అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.
కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, బెదిరింపులు, న్యాయపరమైన సమస్యలు ఏవైనా కావచ్చు. అన్నింటినీ ఒకేసారి పరిష్కరించాల్సిన అవసరం లేదు. ఒక్కో సమస్యను ఒక్కో అడుగుగా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా పిల్లలపై ఇలాంటి విషాదం తీవ్ర ప్రభావం చూపుతుంది. వారికి ప్రేమ, భద్రత, నమ్మకమైన పెద్ద మనిషి తోడు, అవసరమైతే నిపుణుల కౌన్సెలింగ్ అందించాలి. ఒక మనిషి మౌనంగా మారినప్పుడు. అతని సమస్య చిన్నదైపోదు. అతని మాట వినే ఒక మనసు దొరికితే.. ఒక కుటుంబం నిలబడవచ్చు.
కొండవీటి శివనాగరాజు
డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9
