మరణం తర్వాత మనిషి శరీరంలో మొదట ఏం జరుగుతుంది? శాస్త్రీయంగా జరిగే మార్పులు ఇవే!
మరణం అనేది జీవితంలో అత్యంత సహజమైన, కానీ ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా ఎన్నో సందేహాలతో కూడుకున్న ఒక అంశం. ఒక మనిషి ప్రాణం వదిలిన వెంటనే శరీరంలో ఏమేం మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. వైద్య శాస్త్రం ప్రకారం, గుండె కొట్టుకోవడం, శ్వాస ఆగిపోయిన క్షణం నుండే శరీరంలో జీవరసాయన మార్పులు చాలా వేగంగా ప్రారంభమవుతాయి. మరణం తర్వాత క్రమంగా జరిగే ప్రధాన దశలను ఇప్పుడు చూద్దాం.

మనిషి మరణించిన వెంటనే శరీరంలో జీవక్రియలన్నీ పూర్తిగా ఆగిపోతాయి. అలాగే ప్రతి గంటకూ శరీర ఉష్ణోగ్రత తగ్గుతూ మంచులా చల్లబడుతుంది. ఆ తరువాత గంట గంటకు మనిషి శరీరంలో జరిగే మార్పులు ఎలా ఉంటాయనే వివరాల్లోకి వెళితే..
పాలిపోవడం- మొదటి 15-20 నిమిషాలు:
గుండె స్పందన ఆగిపోగానే రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోతుంది. దీనివల్ల రక్తనాళాల్లో ఉన్న రక్తం చర్మం ఉపరితలానికి అందక, మరణించిన 15 నుండి 20 నిమిషాల్లో శరీరం తెల్లగా, పాలిపోయినట్లుగా మారుతుంది.
శరీరం చల్లబడటం:
జీవక్రియలు ఆగిపోవడంతో శరీరం ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయడం నిలిపివేస్తుంది. పరిసరాల ఉష్ణోగ్రతకు అనుగుణంగా శరీరం ప్రతి గంటకూ దాదాపు 0.8°C నుండి 1.5°F వరకు ఉష్ణోగ్రతను కోల్పోతూ చల్లబడుతుంది.
రక్తం గడ్డకట్టడం, రంగు మారడం:
గురుత్వాకర్షణ శక్తి వల్ల శరీరంలోని రక్తం కింది భాగాలకు చేరుకుని పేరుకుపోతుంది. దీనివల్ల మరణించిన 1 నుండి 2 గంటల వ్యవధిలో చర్మంపై ఎరుపు, నీలం లేదా ఊదా రంగు మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి.
కండరాలు బిగుసుకుపోవడం- 2 నుండి 6 గంటలు:
మరణం తర్వాత కణాలలో శక్తి ఉత్పత్తి ఆగిపోవడంతో కండరాలకు కాల్సియం చేరుకుని అవి సంకోచిస్తాయి. ఫలితంగా మరణించిన 2 నుండి 6 గంటల మధ్య శరీరం బిగుసుకుపోయి గట్టిగా మారుతుంది. ఇది ముందుగా ముఖం, మెడ భాగాల్లో ప్రారంభమై ఇదర అవయవాలకు వ్యాపిస్తుంది.
కణాల విచ్ఛిన్నం, కుళ్ళిపోవడం:
మరణించిన కొద్ది గంటల తర్వాత ఆక్సిజన్ లేకపోవడం వల్ల కణాలు తమను తామే జీర్ణం చేసుకోవడం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత పొట్టలోని సహజ బ్యాక్టీరియా శరీరం అంతటా వ్యాపించి కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల వాయువులు విడుదలై శరీరం ఉబ్బడం, దుర్వాసన రావడం వంటి మార్పులు జరుగుతాయి.
ఈ విధంగా, మరణం అనేది కేవలం ప్రాణం పోవడమే కాకుండా, ప్రకృతిలో శరీరం తిరిగి లీనమయ్యే ఒక క్రమబద్ధమైన శాస్త్రీయ ప్రక్రియ.




