AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎముకల బలానికి మన పూర్వీకులు ఇదే తాగేవారు.. షుగర్, బరువు ఇట్టే కంట్రోల్ అవుతాయి..

రాగి జావ కేవలం రుచికరమైన పానీయం మాత్రమే కాదు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఎముకలను బలంగా మార్చడంలో, చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, బరువు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇంట్లో సులభంగా తయారు చేసుకోగల ఈ సాంప్రదాయ రాగి జావ రెసిపీని మీ దైనందిన ఆహారంలో చేర్చుకోండి.

ఎముకల బలానికి మన పూర్వీకులు ఇదే తాగేవారు.. షుగర్, బరువు ఇట్టే కంట్రోల్ అవుతాయి..
Ragi Malt Recipe
Shaik Madar Saheb
|

Updated on: Sep 28, 2026 | 8:50 AM

Share

రాగి జావ కేవలం రుచికరమైన పానీయం మాత్రమే కాదు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వాస్తవానికి రాగుల్లో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా దాగున్నాయి.. కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని.. తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. మన పూర్వీకుల ఎముకల బలం వెనుక ఉన్న రహస్యాలలో రాగి జావ ఒకటి.. ఈ కథనంలో సింపుల్ గా రాగి జావ తయారీ విధానాన్ని తెలుసుకుందాం.. ఈ చిట్కాలు పాటిస్తే.. ఒక గ్లాసు కాదు.. రెండు మూడు గ్లాసులు తాగాలనిపిస్తుంది.. అంత అద్భుతంగా ఉంటుంది.

రాగి జావతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:

రాగి జావాను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయి.

ఎముకల దృఢత్వం: ఇందులో అధికంగా ఉండే కాల్షియం ఎముకలను బలంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనతను నివారించడంలో ఇది సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర నియంత్రణ: డయాబెటిస్ ఉన్నవారికి రాగి జావ ఒక మంచి ఆహారం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో తోడ్పడుతుంది.

బరువు తగ్గడం: రాగి జావలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

ఐరన్ – కాల్షియం: ఐరన్ లోపం (అనీమియా) ఉన్నవారికి రాగి జావ చాలా మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.

శరీరానికి చలువ: ఇది శరీరానికి చలువ చేస్తుంది.. కాబట్టి, ఎప్పుడు తీసుకున్నా మంచిదే..

రాగి జావ తయారీకి కావలసినవి (3 – 5గ్లాసుల జావ కోసం):

  • రాగి పిండి : 5-6 టీ స్పూన్లు
  • నీరు: 6 గ్లాసులు + అర కప్పు
  • అల్లం: 1 టీ స్పూన్ (ముక్కలుగా తరిగినది)
  • పచ్చిమిర్చి: 1 లేదా 2 (మీ కారానికి తగ్గట్టు)
  • పెరుగు: 3 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు: రుచికి సరిపడా
  • జీలకర్ర పొడి: పావు టీ స్పూన్ (ఐచ్ఛికం)

తయారీ విధానం:

రాగి పిండి మిశ్రమం తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రాగి పిండిని వేయండి. అర కప్పు నీటిని వేసి, ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. (ఒక గ్లాసు జావకు ఒక టీ స్పూన్ రాగి పిండి సరిపోతుంది).

మజ్జిగ మిశ్రమం తయారీ: మిక్సీ జార్ తీసుకుని, తరిగిన అల్లం (1 టీ స్పూన్), పచ్చిమిర్చి (1 లేదా 2) వేసి మిక్సీ పట్టండి. తరువాత 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి, కొద్దిగా నీళ్లు కలిపి బాగా మిక్సీ పట్టండి. ఈ మజ్జిగ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. రాగి జావకు పెరుగు కలిపి తాగితేనే రుచి అద్భుతంగా ఉంటుంది.

రాగి జావ ఉడికించడం: ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో నీటిని పోయండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసి, నీటిని బాగా మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు, ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని నెమ్మదిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండండి.

చిక్కబడే వరకు ఉడికించాలి: రాగి జావ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించి, స్టవ్ ఆఫ్ చేయండి. ఇది ఉడికించడం చాలా సులభం, ఎవరైనా సులువుగా చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పల్చగా ఉన్నట్లు అనిపించినా, చల్లారిన తర్వాత చిక్కబడుతుంది.

కలపడం – సర్వ్ చేయడం: రాగి జావ పూర్తిగా చల్లారిన తర్వాత, ముందుగా తయారుచేసుకున్న అల్లం-పచ్చిమిర్చి-పెరుగు మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపండి. వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ కలపకూడదు.

చివరి మెరుగులు: సిద్ధం చేసుకున్న రాగి జావను గ్లాసులో పోసి, దానిలో పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని కలిపి త్రాగండి. జీలకర్ర పొడిని ఉడికించేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా చివరగా కలుపుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది.

ఈ ప్రాసెస్ లో రాగి జావ తయారు చేస్తే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us