ఆర్మీ అగ్నివీర్‌గా వారంలో కొలువు.. తమ్ముడిని కాపాడేందుకు బావిలోకి దిగి దారుణం
అన్నదమ్ములు బావిలో మునిగి ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. ఇంటి మోటార్‌ను బయటకు తీసేందుకు బావిలోకి దిగిన తమ్ముడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండగా, అతడిని రక్షించేందుకు అన్న కూడా బావిలోకి దిగాడు. అయితే ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఒకేసారి ఇద్దరు కుమారులను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి..

విజయనగరం, ఆగస్ట్ 18: విజయనగరం జిల్లా సంతకవిటి మండలం పనసపేటలో జరిగిన విషాద ఘటన రెండు గ్రామాలను విషాదంలో ముంచేసింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు బావిలో మునిగి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పొందూరు మండలం మజ్జిలపేటకు చెందిన మొజ్జాడ విష్ణు (22), రామకృష్ణ (21) అన్నదమ్ములు. తండ్రి అసిరినాయుడు ఎలక్ట్రికల్, మోటారు రిపేర్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి వరలక్ష్మి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. విష్ణు డిగ్రీ చదవగా, రామకృష్ణ ఐటీఐ చదివారు. చదువుకుంటూనే ఇద్దరూ తండ్రికి మోటారు, ఎలక్ట్రికల్ పనుల్లో చేదోడువాదోడుగా ఉండేవారు.
ఈ నేపథ్యంలోనే పనసపేటలోని అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వెళ్లిన అన్నదమ్ములకు ఊహించని ప్రమాదం ఎదురైంది. అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లిన తర్వాత అమ్మమ్మ ఇంట్లో ఉన్న మోటర్ పనిచేయక నీరు రావడం ఇబ్బందిగా మారింది. మోటర్ రిపేర్ వల్ల నీరు రావటం లేదని గుర్తించిన రామకృష్ణ నందబావిలో ఉన్న మోటారును బయటకు తీసేందుకు బావిలోకి దిగాడు. కొద్దిసేపటికే నీటిలో మునిగిపోతూ రామకృష్ణ కాపాడమంటూ పెద్దపెద్దగా కేకలు వేయడంతో తమ్ముడిని రక్షించేందుకు విష్ణు కూడా బావిలోకి దిగాడు. కానీ దురదృష్టవశాత్తూ ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. పరిస్థితి గమనించిన అమ్మమ్మ, తాతయ్య కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఇద్దరు అన్నదమ్ములు విగతజీవులుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ విషాదంలో మరింత కలచివేసే విషయం నెలకొంది. రామక్రిష్ణ ఇటీవలే ఆర్మీలో అగ్నివీరుగా ఎంపికై సికింద్రాబాద్‌లో శిక్షణ పూర్తి చేశాడు. మరో వారం రోజుల్లో పంజాబ్‌లో విధుల్లో చేరాల్సి ఉంది. ఉద్యోగంలో చేరే ముందు అసిరితల్లికి మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి పనసపేటలోని తాతయ్య ఇంటికి వచ్చాడు. కానీ విధుల్లో చేరి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాల్సిన సమయంలోనే మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయాడం బాధాకరం. మరోవైపు పెద్ద కుమారుడు విష్ణును కూడా కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. ఒకేసారి ఇద్దరు కుమారులను కోల్పోయిన అసిరినాయుడు, వరలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ స్పృహ కోల్పోయారు. అన్నదమ్ములిద్దరి మృతితో మజ్జిలపేట, పనసపేట గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. ఆర్మీ యూనిఫాంలో కుమారుడిని చూడాలని కలలు కన్న తల్లిదండ్రులకు ఇప్పుడు అతని జ్ఞాపకాలే మిగిలాయి.




