AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Excise Policy: ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ.. ఇకపై అలా చేయపోతే షాపులు పోయినట్టే!

మద్యం విక్రయాల్లో అక్రమాలకు, MRP ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు ఏపీ సర్కార్ కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది. ప్రస్తుత మద్యం షాపుల లైసెన్సులను మరో ఏడాది పాటు పొడగిస్తూ.. వాటని రెన్యూవల్ చేసుకోవాలని సూచించింది. ఒక వేల ఎవరైనా రెన్యువల్ వద్దనుకుంటే.. వారి షాపులను లాటరీ విధానంలో వేరే వారికి కేటాయించనున్నట్టు స్పష్టం చేసింది.

AP Excise Policy: ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ.. ఇకపై అలా చేయపోతే షాపులు పోయినట్టే!
Ap Excise Policy 2026 27
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Sep 12, 2026 | 10:53 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం షాపుల లైసెన్సులను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,736 మద్యం షాపుల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయకుండా.. ప్రస్తుత షాపుల లైసెన్సులను రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పాలసీ 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండనుంది. అదే సమయంలో రెన్యువల్‌కు ముందుకు రాని షాపులను లాటరీ విధానంలో కొత్తగా కేటాయించనున్నారు.

అయితే మద్యం విక్రయాల్లో అక్రమాలకు, MRP ఉల్లంఘనలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతి షాపులో CCTV కెమెరాలు, డిజిటల్ ట్రాకింగ్, AI ఆధారిత పర్యవేక్షణతో మద్యం విక్రయాలపై నిఘా పెంచనుంది. వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు యాప్, QR కోడ్ వంటి సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

3,736 షాపులకు రెన్యువల్

ఏపీలో 2026-27 ఎక్సైజ్ పాలసీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 3,736 మద్యం షాపుల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇందులో 3,396 షాపులు ఓపెన్ కేటగిరీలో ఉండగా.. 340 షాపులు గీత కులాలకు రిజర్వ్ చేశారు.

ఏడాది పాటు లైసెన్స్ పొడిగింపు

ప్రస్తుత మద్యం షాపుల లైసెన్సులకు ఏడాది పాటు రెన్యువల్ అవకాశం కల్పించింది ప్రభుత్వం. 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు లైసెన్సులు చెల్లుబాటు కానున్నాయి. రెన్యువల్ కోసం వార్షిక RETతో పాటు అదనంగా 38 శాతం రెన్యువల్ RET చెల్లించాల్సి ఉంటుంది.

రెన్యువల్ వద్దంటే లాటరీ

ప్రస్తుత లైసెన్సుదారులు రెన్యువల్ చేసుకోని షాపులను లాటరీ విధానంలో కొత్తగా కేటాయించనున్నారు. ఒక్కో షాపు కోసం దరఖాస్తు చేసుకునే వారికి రూ.3 లక్షల నాన్‌రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అయితే ఒక షాపుకు కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చినప్పుడే లాటరీ నిర్వహిస్తారు. నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు వస్తే చెల్లించిన అప్లికేషన్ ఫీజును పూర్తిగా తిరిగి ఇస్తారు.

MRP ఉల్లంఘిస్తే భారీ జరిమానా

మద్యం విక్రయాల్లో MRP నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం, స్పిరియస్ లిక్కర్, బ్రాండ్ మిక్సింగ్ లేదా డైల్యూషన్, ఈ-ఇన్వెంటరీ నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తొలి తప్పిదానికి ఏకంగా రూ.10 లక్షల జరిమానా విధించనున్నారు. రెండోసారి అదే తరహా ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్ రద్దుతో పాటు భవిష్యత్తులో లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కోల్పోతారు.

ప్రతి షాపులో 4 CCTVలు

మద్యం షాపుల్లో ఇక నుంచి నిఘా మరింత పెరగనుంది. ప్రతి షాపులో నాలుగు CCTV కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. కౌంటర్, స్టాక్, వినియోగదారుల ప్రాంతం, పర్మిట్ రూమ్‌ను కవర్ చేసేలా కెమెరాలు ఉండాలి. ఇవి 24 గంటలు, వారంలో ఏడు రోజులు పనిచేసేలా నిర్వహించాలి. CCTV ఫీడ్‌ను AI ద్వారా విశ్లేషించి నిబంధనల ఉల్లంఘనలను గుర్తించే విధానాన్ని అమలు చేయనున్నారు.

బాటిల్ నుంచి బిల్లింగ్ వరకు డిజిటల్ ట్రాకింగ్ మద్యం సరఫరా వ్యవస్థను పూర్తిగా డిజిటల్ పరిధిలోకి తీసుకురానున్నారు. ఉత్పత్తి, రవాణా, పంపిణీ, షాపుకు చేరడం, రిటైల్ విక్రయం వరకు ప్రతి దశను ట్రాక్ చేసే ఎండ్-టు-ఎండ్ ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమలు చేయనున్నారు. స్టాక్ కదలికలు, విక్రయ లావాదేవీలు డిజిటల్‌గా రికార్డు కానున్నాయి. దీంతో ఎక్కడ ఎంత స్టాక్ వచ్చింది.. ఎంత విక్రయమైంది.. ఎంత మిగిలింది అనే వివరాలను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.

AI కమాండ్ కంట్రోల్ సెంటర్

CCTV ఫీడ్స్‌తో పాటు ట్రాన్సాక్షన్ రికార్డులు, ఇన్వెంటరీ డేటా, వినియోగదారుల ఫీడ్‌బ్యాక్, ఫిర్యాదులను ఒకే వ్యవస్థలో అనుసంధానం చేయనున్నారు. AI ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రియల్‌టైమ్‌లో పర్యవేక్షణ చేపట్టనున్నారు. నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే అలర్ట్స్ జారీ చేసి.. అవసరమైన చోట ప్రత్యేక బృందాలను పంపేలా వ్యవస్థను రూపొందించారు.

MRP కనిపించాల్సిందే

వినియోగదారులకు మద్యం ధరల విషయంలో స్పష్టత ఉండేలా ప్రతి షాపు ముందు అందుబాటులో ఉన్న అన్ని బ్రాండ్ల MRPని ప్రముఖంగా ప్రదర్శించడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రతి విక్రయం సమయంలో MRPని ప్రదర్శించడంతో పాటు ప్రకటించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు 14405 టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

క్యాష్.. డిజిటల్.. రెండూ

మద్యం కొనుగోళ్లలో వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేలా నగదుతో పాటు డిజిటల్ చెల్లింపులను కూడా తప్పనిసరిగా స్వీకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారుడి ఎంపిక మేరకు క్యాష్ లేదా డిజిటల్ పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది.

అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం

అలాగే అనధికారిక మద్యం విక్రయ కేంద్రాలపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. అక్రమ విక్రయాలపై రెగ్యులర్ తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు చేపట్టనున్నారు. లైసెన్సుదారు అక్రమంగా మద్యం విక్రయిస్తే తొలి తప్పిదానికి రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేసే నిబంధన తీసుకొచ్చారు.

సమాచారం ఇస్తే రూ.లక్ష వరకు రివార్డు

అక్రమ మద్యం, కల్తీ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు.. వాటిని గుర్తించేందుకు సమాచార వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. అక్రమ మద్యం లేదా నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్‌కు సంబంధించిన సమాచారం ఇచ్చి.. అది సీజ్‌కు దారితీస్తే గరిష్ఠంగా రూ.లక్ష వరకు రివార్డు అందించే అవకాశం ఉంది. సీజ్ పరిమాణాన్ని బట్టి రివార్డు మొత్తాన్ని కమిషనర్ నిర్ణయించనున్నారు.

మొత్తంగా చూస్తే..

2026-27 ఎక్సైజ్ పాలసీలో ప్రస్తుత మద్యం షాపుల లైసెన్సులకు ఏడాది పాటు రెన్యువల్ అవకాశం కల్పించడంతో పాటు.. మద్యం విక్రయాలపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒకవైపు లైసెన్సుదారులకు కొనసాగింపు అవకాశం కల్పిస్తూనే.. మరోవైపు MRP ఉల్లంఘనలు, అక్రమ విక్రయాలు, కల్తీ మద్యం, స్టాక్ నిర్వహణలో అవకతవకలకు కఠిన శిక్షలు విధించేలా నిబంధనలు తీసుకొచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us