Andhrapradesh: బలహీనపడిన అల్పపీడనం.. కోస్తా, రాయలసీమల్లో రెండురోజుల పాటు వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా...
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు, చాలా చోట్ల మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉంది. మంగళవారం ఉదయం నుంచి విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉదయాన్నే ప్రారంభమైన వర్షం రాత్రి 9 గంటల వరకు నాన్-స్టాప్‌గా దంచికొట్టింది. శ్రీకాకుళం జిల్లా.. టెక్కలి నియోజకవర్గంలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. టెక్కలి మెయిన్ రోడ్‌పై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సంతబొమ్మాళి మండలం నౌపడాలో కాలువలు సరిగా లేక వీధుల్లో వరదనీరు నిలిచింది. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో…
అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా రావివలసలో 88.25 మి.మీ, గార మండలం కళింగపట్నంలో 86 మి.మీ, విజయనగరం జిల్లా సాలూరులో 52.75 మి.మీ చొప్పున వర్షం కురిసింది. కృష్ణా జిల్లా బాపులపాడు, నందిగామ, గంపలగూడెం, గుంటూరు జిల్లా బెల్లంకొండ తదితర ప్రాంతాల్లో వానలు కురిశాయి. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీర ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు గెడ్డలు ఉప్పొంగాయి. ఉదయం ముక్కాం, చేపలకంచేరు వద్ద 60 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చి ఇళ్లను తాకడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. తుపాను హెచ్చరికతో రెండు రోజులుగా వేటకు ఎవరూ వెళ్లకపోవడంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి.
Also Read: బీటెక్ తరగతులు ప్రారంభమయ్యేది అప్పుడే.. వెల్లడించిన ఏఐసీటీఈ