Andhra Pradesh: సికింద్రాబాద్ ఘటనతో ఏపీలో హై అలర్ట్.. విశాఖపట్నం రైల్వే స్టేషన్ మూసివేత
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో(Secunderabad) ఆందోళనకారులు సృష్టించిన బీభత్సంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలో నెలకొన్న అల్లర్లు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు వ్యాపించకుండా ఉండేందుకు....
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో(Secunderabad) ఆందోళనకారులు సృష్టించిన బీభత్సంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలో నెలకొన్న అల్లర్లు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు వ్యాపించకుండా ఉండేందుకు అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం రైల్వేస్టేషన్(Visakhapatnam Railway Station) ను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 12గంటల వరకు స్టేషన్‌ను మూసివేస్తున్నామని వెల్లడించారు. స్టేషన్‌లోకి ఎవరినీ అనుమతించమని ప్రకటించారు. ప్రయాణీకులు రాకుండా రైల్వేస్టేషన్ కు సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల వరకు టికెట్ ఉంటేనే లోపలికి అనుమతించగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాజాగా రైల్వే స్టేషన్ ను మూసివేశారు. ఈ నిర్ణయంతో విజయవాడ నుంచి వచ్చే రైళ్లన్నీ దువ్వాడ, హావ్‌డా నుంచి వచ్చే రైళ్లు కొత్తవలస నుంచి, దారి మళ్లిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ భద్రతా వ్యవహారాలను సీపీ శ్రీకాంత్ స్వయంగా పరిశీలిస్తున్నారు.
విశాఖ రైల్వేస్టేషన్ మూసివేతతో పలు రైళ్లను దువ్వాడ, కొత్తవలస, అనకాపల్లి స్టేషన్ల వద్దే అధికారులు నిలిపివేస్తున్నారు. విశాఖపట్నం-గోదావరి ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-విశాఖ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబద్-విశాఖ గరీబ్‌రథ్, లోకమాన్య తిలక్ టెర్మినస్-విశాఖ, కడప-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్ రైళ్లను దువ్వాడ వద్ద నిలిపివేయనున్నారు. దిఘా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కొత్తవలస వద్ద నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అనకాపల్లిలో మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్, కాకినాడ-విశాఖ, తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ రైళ్లను నిలిపివేస్తామని రైల్వే అధికారులు చెప్పారు.
కాగా.. ఆందోళనలతో అట్టుడికిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్నుంచి తరలించారు. రాత్రి 7 గంటలకు స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు రైళ్లను పునరుద్దరించారు. దాదాపు 9 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. మరోసారి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా స్టేషన్ ప్రాంగణంలో పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలను భారీగా మోహరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి