Rahul Gandhi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే రాజధాని.. రాహుల్ గాంధీ కీలక కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఒకటేనని, అది అమరావతి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు .‘భారత్ జోడో’ యాత్రలో భాగంగా ఏపీలో పాదయాత్ర చేస్తున్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.

భారత్ జోడో యాత్ర భాగంలో ఏపీలో పర్యటించిన రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదన మంచిది కాదన్నారు. అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉంటే బాగుంటుందన్నారు. ‘భారత్ జోడో’ యాత్రలో భాగంగా ఏపీలో పాదయాత్ర చేస్తున్న ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు తనను కలిశారని , వాళ్లకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. పోలవరంతో సహా విభజన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రందే అన్నారు రాహుల్‌గాంధీ. రాష్ట్ర విభజన గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే వైసీపీ సపోర్ట్ తీసుకుంటారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పొత్తులు పెట్టుకోవడంపై పార్టీ అధ్యక్షుడే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అవకవతవకలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదుపై స్పందించారు రాహుల్. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కాంగ్రెస్ సీఈసీ ఉందన్నారు రాహుల్. ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపారు. శశిథరూర్ వర్గం చేసిన ఫిర్యాదుపై మిస్త్రీ తప్పకుండా విచారణ జరుపుతారని హామీ ఇచ్చారు.
భారీ మెజార్టీతో ఖర్గే విజయం
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లిఖార్జున్ ఖర్గే ఘనవిజయం సాధించారు. శశిథరూర్‌పై భారీ ఆధిక్యంతో ఆయన గెలిచారు. ఖర్గేకు 7897 ఓట్లు , థరూర్‌కు 1072 ఓట్లు మాత్రమే లభించాయి. 9385 మంది ఓటేయగా 416 ఓట్లు చెల్లలేదు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ఖర్గేకు శశిథరూర్ అభినందనలు తెలిపారు. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ తప్పకుండా బలోపేతం అవుతుందన్నారు. తామందరం కాంగ్రెస్ వాదులమే అని అన్నారు. ఎన్నికల్లో అవకతవకల విషయం ఇప్పుడు అనవసరమన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
